కెమెరాలు పెట్టకుండానే ..బిల్లులు లేపేశారు

  •    కాంట్రాక్టర్​, మున్సిపల్​, పోలీస్​ శాఖలు కుమ్మక్కు
  •     రూ.44 లక్షల ఎంపీ ల్యాడ్స్​ నిధులు స్వాహా 
  •     కెమెరాలు ఏర్పాటు చేకుండానే ఎన్వోసీ ఇచ్చిన పోలీస్​ శాఖ
  •     తమకు సంబంధం లేదంటున్న మున్సిపల్ శాఖ

సూర్యాపేట, వెలుగు : జిల్లా కేంద్రంలో సీపీ కెమెరాల ఏర్పాటుకు కేటాయించిన రూ.44 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులు పక్కదారి పట్టాయి. రెండేళ్ల క్రితం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు ఫండ్స్ రిలీజ్ చేశారు. కెమెరాలు పెట్టకుండానే పోలీస్ శాఖ అధికారులు ఎన్వోసీ ఇవ్వగా, మున్సిపల్ శాఖ అధికారులు ఫండ్స్ రిలీజ్ చేశారు. ఇటీవల సీసీ కెమెరాల భాగోతం బయటపడడంతో పోలీస్ శాఖ ఎన్వోసీ ఇచ్చినందుకే ఫండ్స్ రిలీజ్ చేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఎంక్వైరీ చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. 

300 కెమెరాలు రూ.44 లక్షలు.. 

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నేరాల నియంత్రణ కోసం మున్సిపాలిటీ పరిధిలో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయించారు. ఇందుకు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తన నిధుల నుంచి రూ.44 లక్షల ఫండ్స్ కేటాయించారు. హైదరాబాద్ కు చెందిన ఒక కాంట్రాక్టర్ కు  సూర్యాపేట టౌన్ లోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. అంతేకాకుండా సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లోని మొదటి అంతస్తులో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి దానికి కెమెరాలను అనుసంధానం చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. 

కెమెరాలు పెట్టకుండానే ఫండ్స్ రిలీజ్.. 

పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండానే మున్సిపల్ అధికారులు ఫండ్స్ రిలీజ్ చేశారు. సూర్యాపేట టౌన్ లో 280 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ అధికారులు ఎన్వోసీ ఇవ్వడంతో మున్సిపల్ అధికారులు సదరు కాంట్రాక్టర్ కు రూ.36 లక్షల ఫండ్స్ రిలీజ్ చేశారు. అయితే, కాంట్రాక్టర్ తో మున్సిపల్, పోలీస్ శాఖ కుమ్మక్కై కెమెరాలు ఏర్పాటు చేయకుండానే బిల్లు పాస్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం టెండర్లలో స్థానికులను కాకుండా హైదరాబాద్ కు చెందిన కాంట్రాక్టర్ కు బాధ్యతలు అప్పగించడంతోపాటు మొదట

రూ.18.88 లక్షల్లో పనులు పూర్తి చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫండ్స్ సరిపోవడం లేదంటూ మరోసారి ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అయినా ఫండ్స్ కావాలంటూ ఏకంగా రూ.44 లక్షలకు ఎస్టిమేషన్ పెంచారు. ఆ తర్వాత కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు ఎన్వోసీ ఇచ్చారు. కనీసం కెమెరాలు ఎక్కడెక్కడ బిగించారో చూడకుండా మున్సిపల్ అధికారులు బిల్లు పాస్ చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.  

కొత్త కెమెరాలు వస్తున్నాయని.. పాతవి పక్కకు పెట్టిన్రు.. 

జిల్లా కేంద్రంలో 300 కొత్త కెమెరాలు వస్తున్నాయని పాత కెమెరాలను పక్కకు పెట్టారు. సూర్యాపేట టౌన్ లో గతంలో దాతల సహాయంతో 135 కెమెరాలను ఏర్పాటు చేయగా, వీటిలో 120 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ప్రస్తుతం వీటిలో 30 మాత్రమే పనిచేస్తున్నాయి. దీం తో టౌన్ లో దొంగతనాలు, బ్యాంకుల దోపిడీ, వెహికిల్స్ ను దొంగలు ఎత్తుకుపోతున్న కేసులు ఎక్కువయ్యాయి. 

ఎంక్వైరీ చేయాలని కలెక్టర్​ను ఆదేశించిన మంత్రి 

ఇటీవల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని సూర్యాపేట టౌన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక ప్రైవేట్ కంపెనీని కోరారు. అక్కడే ఉన్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గతంలో ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేసినట్లు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా బిల్లులు ఎలా రిలీజ్ చేశారని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కలెక్టర్ ఎస్.వెంకట్​రావును ఆదేశించారు.