తీరొక్క పూల బతుకమ్మ ; పూలపండగలో ఈ ముచ్చట్లు తెలుసుకోవాల్సిందే!

బతుకమ్మ అంటేనే పువ్వుల పండుగ.పువ్వులు పంచే ఆరోగ్యం.. ప్రసాదాలు పంచుకుని తినే ఆచారం.. ‘మేమంతా ఒక్కటే’ అని చాటిచెప్పే చప్పట్ల సంబురం... అంతా కలిసి ఆడుతూ, పాడుకునే మురిపెం. 

బతుకమ్మ.. స్వచ్ఛమైన మనసులతో దేవతను ఆరాధించే పండుగ. ఈ పండుగ కోసం ఎలాంటి హంగులు, ఆర్భాటాలు అవసరం లేదు. ప్రకృతి ఇచ్చిన పూలు ఉంటే చాలు. ఇది ఆడపడుచుల ఉనికి, ఆత్మగౌరవాలకి ప్రతీక. పూల రూపంలో ప్రకృతిని, స్త్రీశక్తిని ఆరాధించే విశిష్టమైన పండుగ బతుకమ్మ. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం ముందు అమావాస్య రోజు నుంచి ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ చేసుకుంటారు. తొమ్మిది రోజులు ప్రత్యేక పూలతో అలంకరించి బతుకమ్మను పేరుస్తారు. పంటపొలాల్లో సీజనల్​గా దొరికే సాధారణ పూలనే బతుకమ్మను పేర్చేందుకు వాడతారు. ప్రకృతితో మమేకమై పర్యావరణహితంగా చేసుకునే పండుగ. చిన్నా–పెద్ద, పేద–ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసి తన్మయత్వంతో గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ సీజన్‌‌లో రకరకాల రంగుల పూలు వికసిస్తాయి. అందులో కొన్ని సువాసనలతో ఉంటాయి. మరికొన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వాటితో పేర్చిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీళ్లు కూడా శుభ్రం అవుతాయి.

బతుకమ్మ తయారీ.. నిమజ్జనం

ఒక రాగి పళ్ళెం (తాంబలం) లేదా సిబ్బిలో పూలను గుండ్రంగా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా గుమ్మడి ఆకులు వేసి తంగేడు పూల కట్టల వరస పేర్చుతారు. మధ్య మధ్యలో వేరే రకాల పూలు పెడతారు. గుమ్మడి ఆకులను పేర్చి మొదటి వరుసలో గుండ్రంగా తంగేడు పూలను పేరుస్తారు. తంగేడు పూలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అంటే... ‘మెరక తంగేడు, తుంగేర, గొబ్బిపూలు’ అని  పిలుస్తారు. తంగేడు తర్వాత వరుసలో వచ్చేవి గునుగు పూలు. గునుగు పూలు తెలుపు రంగులో ఉంటాయి. వీటికి ముదురు నీలం, గులాబి, ఆకుపచ్చ రంగులు అద్దుతారు. పది, పదిహేను పూలను ఒక కట్టగా కట్టి, పువ్వు కొనలను తుంచుతారు. ఆ తర్వాత బంతి, చామంతి, గన్నేరు, మందార, కలువ, తామర లాంటి పూలతో శంఖం ఆకారంలో పేరుస్తారు. మధ్యలో ఆకులు, తుంచిన కాడలను నింపుతారు. పూలు జారిపోకుండా సన్నటి నూలు దారాలను గుమ్మడి ఆకుల కింద నుంచి తీసి ముడివేస్తారు. 

పేర్చిన బతుకమ్మ మీద రెండు తమలపాకులు పెట్టి పిడికెడంత పసుపు ముద్దను పెడతారు. కొందరు బతుకమ్మ మీద కాకుండా పళ్లెంలో విడి​గా గౌరమ్మను ఉంచుతారు. పసుపు ముద్దకు కుంకుమ బొట్టు పెట్టి, వెలిగించిన అగరొత్తులను బతుకమ్మ పై భాగంలో గుచ్చుతారు. అలంకరించిన బతుకమ్మను ఇంట్లో దేవుడి గదిలో పెట్టి మొక్కుతారు. మధ్యాహ్నం పేర్చిన బతుకమ్మలోని పూలు సాయంత్రం వరకు వాడిపోకుండా ఉండేందుకు తడిబట్ట కప్పుతారు. సాయంకాలం అందరూ కొత్త బట్టలు కట్టుకొని.. బతుకమ్మలను తీసుకెళ్లి కూడళ్లలో పెట్టి పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఆడతారు. పాటలతో గౌరీ దేవిని కీర్తిస్తారు. ఆ తర్వాత చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. తరువాత ఆ పళ్లెంలో తెచ్చిన నీళ్లతో ఆడవాళ్లు ‘ఇస్తినమ్మా వాయనం.. పుచ్చుకుంటినమ్మా వాయనం’ అంటూ వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంటి నుంచి తెచ్చిన ప్రసాదాలు ఒకరికొకరు పంచుకుంటారు. తొలిరోజు ఎంగిలిపూల (చిన్న బతుకమ్మ) బతుకమ్మతో మొదలై తొమ్మిదిరోజులు చేసుకునే ఈ పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ తొమ్మిదిరోజుల్లో ఒక్కో రోజు ఒక్కో విశిష్టత ఉంటుంది.

వైభవంగా సద్దుల బతుకమ్మ 

ఆశ్వయుజ అష్టమి (దుర్గా అష్టమి) నాడు చేసుకునే పండుగను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అంటారు. ఆరోజు మొదటి ఎనిమిది రోజుల్లో పేర్చిన బతుకమ్మల సైజుకంటే పెద్దగా బతుకమ్మను రకరకాల పూలతో పేర్చుతారు. కొందరు ప్రతిరోజూ బతుకమ్మను పేర్చకపోయినా.. తొమ్మిదో రోజు మాత్రం కచ్చితంగా పేర్చుతారు. ఆరోజు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పండుగలో భాగం అవుతారు. సాయంత్రం పూట సుమారు గంట నుంచి  రెండు గంటల వరకు ఆడిపాడాక బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు.

తంగేడు పూలు

తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర పుష్పం. బతుకమ్మ తయారీలో మొదటి వరసలో ఉంటాయి ఈ పూలు. పసిడి వర్ణంలో మెరిసే వీటిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. తంగేడు చెట్లు ఊరి చివరన ఉండే గుట్టల్లో పెరుగుతాయి. 

గునుగు పూలు

గునుగు పువ్వు గడ్డి జాతికి చెందింది. బతుకమ్మ అలంకరణలో ఇది కూడా చాలా ముఖ్యమైనది. రెండో వరుసలో పెట్టే ఈ పువ్వు చాలా అందంగా ఉంటుంది. జొన్న కంకిలా కనిపించే ఈ పూలు ప్రకృతి ఒడిలో చాలా రంగుల్లో పలకరిస్తుంటాయి. బతుకమ్మ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. కాబట్టి ఆ టైంలో గునుగు చెట్లు విరగబూస్తాయి. 

తామర పూలు

తామర పువ్వు అందానికి, స్వచ్ఛతకు ప్రతీక. లక్ష్మీదేవి నివాసం తామర పూలు. బతుకమ్మ పేర్చిన తర్వాత చివరగా అలంకరణ కోసం ఈ పూలు పెడతారు. తామరపూలు కూడా ఎన్నో రంగుల్లో ఉంటాయి. ఏ రంగులో ఉన్నా అందంగా ఉంటాయి ఇవి.

గుమ్మడి పువ్వు

గుమ్మడి పువ్వుది బతుకమ్మలో మొదటిస్థానం. గుమ్మడి పువ్వునే గౌరమ్మగా భావించి పూజిస్తారు.  

కట్ల పువ్వు

కట్ల పువ్వు నీలి రంగులో ఉంటుంది. బతుకమ్మను చూడగానే భలే ఉంది అనిపించేలా చేస్తాయి ఈ పూలు. 

బీరపువ్వు

బీరపువ్వు పసుపు పచ్చగా ఉంటుంది. పేర్చిన బతుకమ్మకు అందాన్నిస్తుంది. బీరపువ్వు సీజనల్ ఫ్లవర్. దీని సైంటిఫిక్​ పేరు ‘లుఫా’. బతుకమ్మను పేర్చేటప్పుడు నుదుటన తిలకం దిద్దినట్లుగా బీరపువ్వును పెడతారు. 

గడ్డి బంతి పూలు

గడ్డి బంతి పూలు చూడటానికి అందంగా ఉంటాయి. ఇవి కూడా చాలా రంగుల్లో ఉంటాయి. ఈ మొక్కను గ్లోబ్ ఉసిరి, వడ మల్లి, బోడబంతి పూలు అని పిలుస్తారు. 

సీత జడ పూలు

సీత జడ పూలనే సీతమ్మవారి జడగంటలు అని కూడా పిలుస్తారు. ముదురు రంగులో కనిపించే ఈ పూలను కూడా బతుకమ్మను పేర్చడంలో ఎక్కువగా వాడతారు. ఇవి మెత్తగా పట్టుకుచ్చుల్లా ఉంటాయి. ఈ పూలు ఎక్కడ ఉన్నా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఈ పూలను నారలు, రంగుల తయారీలో వాడతారు. దీని సైంటిఫిక్​ పేరు సిలోసియా అరిగేటియా అమరాంథస్. వీటితో పాటు వాడే బంతి, చామంతి పూలు వర్షాకాలం దోమల్ని దరిచేరనీయవు. నందివర్ధనంలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉంటాయి. పార్వతీపరమేశ్వర పూలు, టేకు, గులాబీ, సోంపు లాంటి పూలన్నీ బతుకమ్మను పేర్చడంలో వాడతారు.


మారుతున్న కాలానుగుణంగా పండుగ చేసుకునే తీరు కూడా మారిపోతూ వస్తోంది. ప్రకృతిలో దొరికే పూలు కరువయ్యాయి. ప్లాస్టిక్‌‌‌‌, కాగితం పూలతో తయారుచేసిన బతుకమ్మలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మైనింగ్​ల వల్ల గుట్టలు కనిపించకుండా పోతున్నాయి. దాంతో గుట్టల్లో పెరిగే తంగేడు చెట్లు కనుమరుగయ్యాయి. 

ఒకప్పుడు పల్లెల్లో పశువుల మేత కోసం ఏర్పాటు చేసుకున్న  కంచెలు కాస్తా పంట చేన్లుగా మారాయి. దాంతో గునుగు పూలు దొరకట్లేదు. చెరువులు కబ్జా చేయడంతో బతుకమ్మకు అదనపు అందాన్నిచ్చే తామర పూలు జాడే లేకుండా పోయింది. చప్పట్లతో బతుకమ్మ పాటలు పాడే చోట డీజే సౌండ్స్‌‌‌‌ వచ్చి చేరాయి. ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే దసరా ముందు మాత్రమే చేసుకునేటోళ్లు. కానీ.. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే బతుకమ్మలు కనిపిస్తున్నాయి. ఇదివరకు రోజుల్లో బతుకమ్మలు పెట్టే స్థలాన్ని ముందుగా బాగా శుభ్రం చేసి, ఎర్రమట్టితో అలికేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడే రోడ్ల మీదే బతుకమ్మలు పెడుతున్నారు. బతుకమ్మ మీద గౌరమ్మ(పసుపు ముద్ద)ను ఉంచడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. కానీ.. ఇప్పుడు గౌరమ్మ పెట్టడమే మానేశారు కొందరు. ఇదివరకటితో పోలిస్తే.. బతుకమ్మ పండుగ ఆర్టిఫిషియల్‌‌‌‌గా అనిపిస్తోందని చాలామంది చెప్తున్నారు. 

గడ్డి మందుల వల్ల 

చాలా ప్రాంతాల్లో బతుకమ్మ పేర్చడానికి పూలు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందంటున్నారు. వర్షాకాలపు చివరి, శీతాకాలపు తొలి రోజుల్లో బతుకమ్మ పండుగ వస్తుంది. కొన్నేళ్ల కిందట ఈ టైంలో ఎక్కడ చూసినా రకరకాల పువ్వులు రంగు రంగుల్లో పూసి పలకరించేవి. ఇప్పుడు పూల చెట్లే  కనిపించడం లేదు. సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కంచెలు కూడా కనిపించకుండా పోయాయి. సాగు భూముల్లో ఎలాగంటే అలా గడ్డి మందులు కొడుతున్నారు. పంట చేల దగ్గర ఒడ్లపైనే కాకుండా పంట భూముల్లో కూడా నెలకోసారి గడ్డి మందులు కొడుతున్నట్లు వ్యవసాయ శాఖాధికారులు చెప్తున్నారు. దీంతో గడ్డి జాతి మొక్కలైన గునుగు, చిట్టి బంతితోపాటు బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూల మొక్కలు చనిపోతున్నాయి. ఈ కారణం వల్ల కూడా బతుకమ్మ పూలు దొరకని పరిస్థితి నెలకొంది. 

మైనింగ్‌‌‌‌ వల్ల..

బతుకమ్మను పేర్చడంలో ముఖ్యంగా తంగేడు పువ్వు వాడతారు. గతంలో ఎక్కడ చూసినా తంగేడు చెట్లు కనిపించేవి. ఊళ్లల్లో ఉండే చిన్న చిన్న గుట్టలు, ప్రభుత్వ స్థలాల్లో వేలాదిగా ఈ మొక్కలు ఉండేవి. బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు పిల్లలంతా గుంపులుగా వెళ్లి తంగేడు పువ్వు, ఆకులు కోసుకొచ్చి అక్కా చెల్లెళ్లకు ఇచ్చేవాళ్లు. అలాంటిది కొన్నేండ్లుగా రాష్ట్రంలో ఇష్టారీతిన మైనింగ్‌‌‌‌ జరుగుతోంది. అనుమతులు లేకుండానే రాళ్లు కొడుతున్నారు. మట్టి తవ్వి తీసుకెళ్తున్నారు. దాంతో  గుట్టలు మాయమైపోతున్నాయి. కరీంనగర్‌‌‌‌లో గ్రానైట్‌‌‌‌, వరంగల్‌‌‌‌, హనుమకొండ జిల్లాలో క్వారీ మైనింగ్‌‌‌‌ ఎక్కువగా జరుగుతోంది. ఇదే కాకుండా మట్టి తవ్వకాల కోసం కూడా సర్కారు భూములను నాశనం చేస్తున్నారు. దీంతో తంగేడు చెట్లు అంతరించిపోవడంతో మహిళలు కాగితం పూల బతుకమ్మలు కొనుక్కోవాల్సి వస్తోంది. అది లేదంటే హైబ్రిడ్​ పూలతో బతుకమ్మను పేర్చుతున్నారు. దాంతో పూల అమ్మకందారులకు, సింథటిక్ బతుకమ్మల తయారీదారుల బిజినెస్​ పెరిగింది. పెద్ద సైజు బతుకమ్మలను కొనాలంటే వెయ్యి నుంచి 1,500  రూపాయల వరకు ఖర్చవుతోంది. 

పంట చేన్లుగా మారిన కంచెలు 

గ్రామాల్లో ఒకప్పుడు పశువుల మేత కోసం కంచె చేన్లు ఉండేవి. సర్కారు భూములే కాకుండా ఊళ్లల్లో ఉండే రైతులు కూడా ఉమ్మడిగా స్థలాలు కొని ఆవులు, గేదెలు, ఎడ్లను మేపడానికి ఖాళీగా వదిలే వాళ్లు. కాలక్రమేణా సాగు విస్తీర్ణం పెరగడంతో కంచె చేన్లు లేకుండాపోయాయి. ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తే.. ఇప్పుడు కోటి ఎకరాలకు పైగా సాగు భూమి ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ రికార్డులు చెప్తున్నాయి. దాంతో బతుకమ్మలో ఉపయోగించే తంగేడు, గునుగుపూలు, ఇతర పూల చెట్లు లేకుండా పోయాయి.