స్టంట్ రైడర్లపై ప్రజల ఆగ్రహం.. ఫ్లైఓవర్​ నుంచి కిందకు విసిరేశారు

బెంగళూరు: ఫ్లైఓవర్‌‌పై టూవీలర్స్​తో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారని రెండు స్కూటర్లను ప్రజలు ఫ్లైఓవర్​పై నుంచి విసిరి కిందపడేశారు. ఆగస్టు 15న బెంగళూరులోని నెలమంగళ ఫ్లైఓవర్‌‌ వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే స్టంట్స్ చేసిన, స్కూటర్లను కిందకు విసిరేసిన 36 మందిపై కేసులు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. 

బెంగళూరులోని నెలమంగళ ఫ్లై ఓవర్ నిత్యం చాలా రద్ధీగా ఉంటుంది. ఆగస్టు 15 కొందరు టూవీలర్లు ఈ ఫ్లైఓవర్​పై స్టంట్స్ చేస్తూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు స్టంట్స్ చేస్తున్న వారిలో కొందరిని, రెండు స్కూటర్లను పట్టుకున్నారు. మిగతా వారు పారిపోయారు. పట్టుకున్న రెండు స్కూటర్లను వారు ఫ్లైఓవర్​ పై నుంచి కిందకు విసిరేశారు. అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయింది. ప్రజాభద్రతకు ముప్పు కలిగేలా ప్రవర్తించారంటూ పోలీసులు మొత్తం 36 మందిపై 34 కేసులు నమోదు చేశారు. ఇందులో స్టంట్స్ చేసిన వారితో పాటు స్కూటర్లు విసిరేసిన వారు కూడా ఉన్నారు.