సాహిల్ చార్టెడ్ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి ఫేమస్ న్యూట్రిషియనిస్ట్. ఇద్దరూ బాగానే సంపాదిస్తున్నారు. కానీ.. సాహిల్‌లో ఏదో తెలియని అసంతృప్తి.. అందుకే తల్లితో కలిసి ప్యాకేజ్డ్ ఫుడ్ స్టార్టప్ పెట్టాడు. బిజినెస్‌ని డెవలప్ చేయడంలో కొడుకు చదువు, ప్రొడక్ట్‌ని క్వాలిటీగా తయారుచేయడంలో తల్లి ఎక్స్‌పీరియెన్స్ బాగా పనికొచ్చాయి. అందుకే వాళ్ల స్టార్టప్ పెద్ద బిజినెస్‌గా మారి ఎంతోమందికి ఉపాధినిస్తోంది. వాళ్లు ఇప్పుడు తాజ్ గ్రూప్, జెడబ్ల్యూ మారియట్ లాంటి 50కి పైగా పెద్ద హోటళ్లకు ప్రొడక్ట్స్‌ని సప్లై చేస్తూ.. లక్షల్లో సంపాదిస్తున్నారు.
సాహిల్ జైన్ ముంబైలోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో చార్టెర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తుండేవాడు. ఇష్టపడి చదివి.. బాగా సెటిల్ అయ్యాడు. చేస్తున్న పని ఇష్టమే. కానీ.. అతనికి కార్పొరేట్ రొటీన్ నచ్చేది కాదు. అందులో నుంచి బయటికి రాలేక, అక్కడ ఉండలేక చాలా రోజులు ఇబ్బంది పడ్డాడు. ఆఫీస్‌లో ఉన్నంత సేపు గడియారంలో చిన్న ముల్లు 6 దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండేవాడు. 6 కొట్టగానే అర క్షణం కూడా ఆగకుండా బ్యాగు సర్దుకునేవాడు.
కంపెనీలో ఒక్క నిమిషం కూడా అదనంగా పనిచేయడం అతనికి ఇష్టంలేదు. “ఒకసారి, నా పనిని 3 గంటలకే కంప్లీట్ చేసుకున్నా. అయినా.. 6 గంటల వరకు వెయిట్ చేసి, బ్యాగ్ సర్దుకోవడం మొదలుపెట్టా. అప్పుడే మా సీనియర్ నా దగ్గరకు వచ్చి ‘ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు ఆఫీస్‌లో డైరక్టర్ ఉన్నారు. ఆయన వెళ్లే వరకు ఇక్కడే కూర్చో’ అన్నాడు. ఆ నిమిషం నాకు చాలా చిరాకేసింది. అలాంటి ఉద్యోగం అక్కర్లేదు అనిపించింది.
కార్పొరేట్ కల్చర్‌లో ఇమడలేనని స్పష్టంగా అర్థమైంది. అందుకే ఏడాదిన్నర పాటు జాబ్ చేశాక విముక్తి పొంది స్టార్టప్ నిర్మించడానికి ముందడుగు వేశా” అంటూ ఉద్యోగం చేసినప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు సాహిల్.
క్వాలిటీ, న్యూట్రిషియస్
మైటీ మిల్లెట్స్ నుంచి తీసుకొచ్చిన ప్రతి ఫుడ్ ఐటమ్ చాలా క్వాలిటీగా, న్యూట్రిషియస్గా ఉండేలా చూసుకుంటున్నారు. సీఏగా పనిచేసిన సాహిల్ స్కిల్స్, న్యూట్రిషియనిస్ట్‌గా మీనా ఎక్స్‌పీరియెన్స్ ‘మైటీ మిల్లెట్స్’ సక్సెస్‌కు కారణమయ్యాయి. కాకపోతే.. సక్సెస్ రావడానికి కాస్త టైం పట్టింది. స్టార్టప్‌ను నిర్మించడంలో వాళ్లు ఎదుర్కొన్న సమస్యల గురించి సాహిల్ ఇలా చెప్పుకొచ్చాడు “అమ్మకు పోషకాహారం మీద, నాకు ఫైనాన్స్‌లో నాలెడ్జ్ ఉంది. కానీ.. స్టార్టప్‌ని బిల్డ్ చేయడం మాకు పెద్దగా తెలియదు. అందుకే ప్రతీది నేర్చుకున్నాం.
ముఖ్యంగా మొదటి సంవత్సరం చాలా కష్టపడ్డాం. కానీ.. అదే టైంలో కరోనా వచ్చి, బిజినెస్‌ను దెబ్బతీసింది. కంపెనీని నిలబెట్టడానికి మళ్లీ ఏడాదిన్నర పట్టింది. కంపెనీ పెట్టిన రెండు సంవత్సరాల వరకు పెద్దగా లాభాలు రాలేదు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ మధ్యే నేను కూడా కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్నా. అంతకుముందు బిజినెస్‌లో వచ్చినదంతా తిరిగి పెట్టుబడిగానే పెట్టాం. అయితే.. ఈ ఎక్స్‌పీరియెన్స్ వల్ల మేము తెలుసుకున్నది ఏంటంటే.. వ్యాపారాన్ని నడపాలంటే ముఖ్యంగా కావాల్సింది ఓపిక.
అంతేకాదు.. సక్సెస్ కోసం కొన్ని త్యాగాలు, కృషి చేయాలి. ఏది ఏమైనా.. ఇప్పుడు సక్సెస్ అయ్యాం. నేను నా సొంత ఆఫీస్‌లోనే పని చేస్తున్నా. ఇప్పుడు రోజూ గడియారం వైపు చూడడం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడే బయటికి వెళ్లిపోతున్నా” అంటూ తన సక్సెస్ జర్నీని చెప్పుకొచ్చాడు సాహిల్.
నా కొడుకు నా దగ్గరే
నా కొడుకుతో కలిసి వ్యాపారం చేయడం చాలా ఆనందంగా ఉంది. వాడు జాబ్ చేసే రోజుల్లో ఏం తిన్నాడో.. ఏం చేస్తున్నాడో అని ఎప్పుడూ వాడి గురించే ఆలోచించేదాన్ని. నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఎలాంటి ఆందోళనలు లేవు. నేను ఎప్పుడూ వాడి పక్కనే ఉండి చూసుకుంటున్నా. - మీనా
జాగ్రత్తగా ఉండాలి
‘‘ఫుడ్ బిజినెస్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ తప్పులు జరగకుండా చూసుకోవాలి. కంపెనీ మీద ఒక్క కంప్లైంట్ వచ్చినా అప్పటివరకు సంపాదించుకున్న గుడ్ విల్ మొత్తం పోతుంది. అందుకే ముడి పదార్థాలను శుభ్రపరచడం నుండి ప్రొడక్ట్ బయటికి వెళ్లేవరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శ్నాక్స్ అమ్మేవాళ్లు మరీ జాగ్రత్తగా ఉండాలి.
ప్యాకింగ్, షెల్ఫ్ లైఫ్‌కు సంబంధించి సరైన డాక్యుమెంటేషన్, ల్యాబ్ టెస్ట్‌లు చేయించాలి” అంటూ మీనా తన ఎక్స్‌పీరియెన్స్‌ని చెప్పింది. వాళ్ల కిచెన్‌లో మొదలైన మైటీ మిల్లెట్స్ ప్రయాణం.. ఇప్పుడు ముగ్గురు కాంట్రాక్ట్ తయారీదారులతో కలిసి సాగుతోంది. ప్రొడక్ట్స్ విపరీతంగా అమ్ముడవుతున్నాయి.
వంటగది నుండి మొదలై..
సాహిల్ తల్లి మీనా ఫుడ్ రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని ఇచ్చేదై ఉండాలి అంటుంది. అందుకే ఇంట్లో ఎప్పుడూ హెల్దీ ఫుడ్ మాత్రమే వండేది. సాహిల్ మాత్రం మొదటి నుంచి భోజన ప్రియుడు. ముఖ్యంగా మీనా చేసే ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకాలు బాగా ఇష్టం. అదే ఫుడ్‌ని అందరికీ పరిచయం చేయాలి అనుకున్నాడు సాహిల్. అయితే.. ఈ నిర్ణయం ఒక్క రోజులో తీసుకున్నది కాదు. చాలా రోజులు ప్లాన్ చేసి స్టార్టప్ పెట్టాడు. సాహిల్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రతి వీకెండ్లో తన ఫ్రెండ్స్‌తో కిచెన్లోనే గడిపేవాడు. అమ్మతో ఫుడ్ ట్రయల్స్ చేయించి వాటిని అందరికీ తినిపించేవాడు.
వాళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునేవాడు. వాళ్ల అమ్మ వడా పావ్ లాంటి ముంబై కల్చరల్ ఫుడ్ నుంచి హైదరాబాదీ టోస్ట్ వరకు చాలా రకాల వంటలు చేసిపెట్టింది. అలా.. స్టార్టప్‌కు సరిపోయే స్పెషల్ ఫుడ్‌ని కనుగొనడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. చివరకు మిల్లెట్స్‌తో చేసే శ్నాక్స్ని ఎంపిక చేశారు. అలా 2018లో మొదటగా లడ్డూ బార్లతోపాటు కొన్ని రకాల శ్నాక్స్ని తయారుచేశారు.
వాటిని ‘మైటీ మిల్లెట్స్’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు న్యూట్రిషన్ బార్స్, గ్రానోలాస్, మిల్లెట్ బేస్డ్ కుక్కీలు, నూడుల్స్, పాస్తా, పాన్‌కేక్ మిక్స్‌లు, వెజిటబుల్ చిప్స్ లాంటి 50 కంటే ఎక్కువ రకాల ప్రిజర్వేటివ్–ఫ్రీ ప్రొడక్ట్స్‌ని తయారుచేస్తున్నారు.