2028 దాకా ఫ్రీ రేషన్..గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపు

  • గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
  • రూ.17వేల కోట్లు కేటాయింపు.. 80 కోట్ల కుటుంబాలకు లబ్ధి
  • పోషకాహార లోపం అధిగమించడమే ఎజెండా: అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ : ఆహార భద్రతలో భాగంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)తో పాటు సంబంధిత పథకాలను 2028, డిసెంబర్ వరకు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ 2028 దాకా ఫ్రీగా ఫోర్టిఫైడ్ రైస్​తో పాటు నిత్యావసరాలు అందిస్తామని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం మంత్రివర్గం భేటీ అయింది. ఈ సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 

మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రేషన్ కార్డుదారులకు ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు నిర్ణయించిందన్నారు. ఈ బియ్యంపై నీతిఅయోగ్ పూర్తిగా పరిశోధన చేసిందని, మామూలు బియ్యంతోనే వీటిని తయారు చేస్తారని వివరించారు. ఈ స్కీమ్ కోసం రూ.17,082 కోట్లు అవసరమని చెప్పారు. పీఎంజీకేఏవై స్కీమ్ కింద 80 కోట్ల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందన్నారు. 

నిధులన్నీ కేంద్రమే భరిస్తది

2019 నుంచి 2021 మధ్య నిర్వహించిన ఆరోగ్య సర్వేలో రక్తహీనత సమస్య అధికంగా ఉన్నట్లు తేలిందని, అన్నివయసుల వారిలో ఈ లోపం కనిపించిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఐరన్, విటమిన్ బీ12, ఫోలిక్ యాసిడ్ వంటి లోపాలు కనిపించాయన్నారు. ఆ సర్వే ఆధారంగానే ఫోర్టిఫైడ్ రైస్​ను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. దీనికి సంబంధించిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తదని చెప్పారు. కాగా, గుజరాత్​లోని లోథల్ దగ్గర నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్​ఎంహెచ్​సీ) అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

బార్డర్ల వెంట గ్రామాలతో కనెక్టివిటీ

పంజాజ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రూ.4,406 కోట్ల వ్యయంతో సరిహద్దు రోడ్లను అభివృద్ధి చేయాల ని కేబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కింద రోడ్లు, టెలికాం, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య అందించేందుకు ఆమోదం తెలిపామన్నా రు. పాక్​ సరిహద్దుల్లోని గ్రామాలకు కనెక్టయ్యేలా 2,208 కి.మీ.మేర రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో కొత్త రోడ్లను నిర్మించాలని నిర్ణయించామన్నా రు. హైవేలతో కలపడం ద్వారా సరిహద్దు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను కేబినెట్ సిద్ధం చేసిందని తెలిపారు.