సర్కార్​ స్కూళ్లకు ఫ్రీ కరెంట్

  • బడులకు, టీచర్లకు ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధం: సీఎం రేవంత్​ 
  • ఉపాధ్యాయులను గత సర్కార్​ అవమానించింది
  • స్కూళ్లలో కనీసం టాయిలెట్లు కూడా కట్టించలే
  • భాషా పండితులకు ప్రమోషన్లూ ఇయ్యలే
  • 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినం
  • ఎల్బీ స్టేడియంలో టీచర్లతో సీఎం ముఖాముఖి

హైదరాబాద్, వెలుగు : సర్కార్​ స్కూళ్లకు, టీచర్లకు ఏం కావాలన్నా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని, పేద పిల్లలకు మంచి విద్య అందించే బాధ్యత టీచర్లదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  రైతులకు, పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందున గవర్నమెంట్​ స్కూళ్లకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. 

 ‘‘తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యావిధానం బాగుపడుతుందని, టీచర్ల గౌరవం పెరుగుతుందని, వసతులు వస్తాయని అనుకున్నాం. కోదండరాం, చుక్కా రామయ్య, హరగోపాల్ లాంటి వాళ్లకు గౌరవం దక్కుతుందని భావించాం. కానీ, పదేండ్ల పాలన ఎలా ఉందో చూశాం. గత పాలకులు టీచర్లను అవమానించేలా వ్యవహరించారు” అని ఆయన మండిపడ్డారు. 

బడుల్లో ఊడ్వడానికో, తూడ్వడానికో, కనీసం టీచర్లకు నీళ్లు ఇచ్చేందుకో కార్మికులను కూడా గత ప్రభుత్వం నియమించలేదని.. ఆడపిల్లలు, మహిళా టీచర్లకు టాయిలెట్ల వసతిని కల్పించలేదన్నారు.  తమ పిల్లలు సర్కారు బడికి పోవడం ఆత్మగౌరవమని తల్లిదండ్రులు భావించేలా వాటిని తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఇటీవల ప్రమోషన్లు పొందిన టీచర్లతో శుక్రవారం హైదరాబాద్  ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్​ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో టీచర్ల పాత్ర ఎంతో ఉందన్నారు. ‘‘రాష్ట్రంలోని 30 వేల సర్కారు బడుల్లో 26 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారి భవిష్యత్తును తల్లిదండ్రులు  టీచర్లయిన మీ చేతుల్లో పెట్టారు” అని తెలిపారు. 

10 శాతం అనుకున్నం కానీ...

రాష్ట్ర బడ్జెట్​లో విద్యకు 7.3 శాతంతో రూ.21 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని సీఎం రేవంత్​ చెప్పారు. వాస్తవానికి 10% తం నిధులు అంటే రూ.30 వేల కోట్లు కేటాయించాలని లెక్కలేశామని, కానీ ప్రభుత్వం ఇంతకుముందే ఇచ్చిన హామీలు అమలు చేయాల్సి ఉండటంతో 7.3 శాతం అలాట్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐదు లక్షల మంది ఉద్యోగులకు నమ్మకం కలిగించేలా ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని మా ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.  

ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వల్ల పరిస్థితులు దిగజారాయని అన్నారు. ‘‘20 ఏండ్లుగా భాషా పండితులకు ప్రమోషన్లు లేవు. కానీ, మా ప్రభుత్వం వాళ్ల సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది. ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టింది” అని తెలిపారు. రాష్ట్రంలో 30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని, 35వేల మందికి ట్రాన్స్​ఫర్లు చేశామని చెప్పారు. 

రాష్ట్రంలో 40 వేలకు పైగా స్కూళ్లుంటే, అందులో 30 వేల సర్కారు బడులు ఉన్నాయని, వాటిలో 26 లక్షల మంది చదువుతున్నారని సీఎం చెప్పారు. అదే ప్రైవేటులో 10 వేల బడుల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు.  ‘‘ప్రైవేటు బడుల్లో మీ కంటే గొప్పగా చదువుకున్న వాళ్లు ఉన్నరా?’’ అని ప్రభుత్వ టీచర్లను అడిగారు. పీజీలు, పీహెచ్​డీలు చేసిన టీచర్లు సర్కారు బడుల్లో ఉన్నారని.. కానీ ప్రైవేటు బడుల్లో ఇంటర్ పాసై, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్లూ పాఠాలు చెప్తున్నారని అన్నారు. 

‘‘సర్కారు స్కూళ్లలో నిరుటి కంటే ఈసారి 2 లక్షల అడ్మిషన్లకు పైగా తగ్గాయి. కొన్ని బడులు బందై ఉండొచ్చు.. ఇంకొందరు ప్రైవేటు బడుల్లో వారి పిల్లలను చేర్పించి ఉండొచ్చు. ఎక్కడో ఒక లోపం ఉంది. అది పాలకులైన మా వైపు నుంచి కూడా ఉండొచ్చు. టీచర్లను బ్లేమ్ చేయదలచుకోలేదు. సర్కారు సరైన విధంగా ఉండకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవడం లోపం కావొచ్చు. సర్కార్​ స్కూళ్లకు, టీచర్లకు ఏం కావాలో చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని సీఎం సూచించారు. 30 వేల సర్కార్​ బడుల్లో తెలంగాణ భవిష్యత్ దాగి ఉందని, పిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత  టీచర్లపై ఉందని అన్నారు. 

పారిశుధ్య పనులు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు 

టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు, వాళ్లతో చర్చించేందుకు తమకు ఎలాంటి ఇబ్బందుల్లేవని సీఎం రేవంత్​ అన్నారు. సర్కారు బడుల్లో పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు రూ.79 కోట్లు ఖర్చు చేసైనా కార్మికులను నియమిస్తామని.. పారిశుద్ధ్య పనుల నిర్వహణ బాధ్యతలను సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అప్పగిస్తామని చెప్పారు.   ‘‘ఆత్మీయ సమ్మేళనంలో ఎలాంటి రాజకీయం లేదు. 

కేవలం మీ(టీచర్ల) చేతుల్లో తెలంగాణ భవిష్యత్ ఉంది కాబట్టే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. సర్కారు బడుల్లోని పిల్లలను ఐఏఎస్​, ఐపీఎస్​లు, డాక్టర్లుగా తయారు చేయాల్సిన బాధ్యత టీచర్లదే” అని సీఎం తెలిపారు. ఈ  కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, రఘోత్తంరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, టీజేఎస్​ చీఫ్​ కోదండరాం, టీచర్ల జేఏసీ నేతలు కమలాకర్ రావు, మారెడ్డి అంజిరెడ్డి, పర్వత్ రెడ్డి, కృష్ణుడు, రాజిరెడ్డి, జగదీశ్, పర్వతి సత్యనారాయణ పాల్గొన్నారు.