నిజామాబాద్ జిల్లాలో నలుగురు సీనియర్లకు కార్పొరేషన్​ పదవులు

  • విధేయతకు పట్టం
  • ఇద్దరు ఓసీ, ఇద్దరు బీసీలకు అవకాశం 
  •  కాంగ్రెస్​ శ్రేణుల్లో ఫుల్​ జోష్​.. 

నిజామాబాద్​, వెలుగు: పదేండ్ల పాటు రాజకీయ పదవులకు దూరమై, పార్టీ కోసం పని చేసిన కాంగ్రెస్​ పార్టీ  విధేయులకు   ఫలితం దక్కింది. రాష్ట్రంలో  కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడటంతో  కార్పొరేషన్​ చైర్మన్​ పదవులు  దక్కాయి.  ఉమ్మడి జిల్లా నుంచి  మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్,   నాయకులు మానాల మోహన్​రెడ్డి, అన్వేశ్​రెడ్డి, కాసుల బాల్​రాజ్ కార్పొరేషన్​ పదవులు  అధిష్టించబోతున్నారు.  ఈ మేరకు  ప్రభుత్వం   సోమవారం  ఉత్తర్వులు జారీ చేసింది.    తమ  నాయకులకు పదవులు రావడంతో  కాంగ్రెస్​ కార్యకర్తలు  కూడా ఫుల్​ జోష్​లో ఉన్నారు. 

విధేయతకు పట్టం.. 

2014 తర్వాత  కాంగ్రెస్​ పార్టీ  అధికారం కోల్పోవడంతో..   చాలామంది నేతలు పార్టీ మారారు.  కొంతమంది నాయకులు మాత్రం పార్టీ  బలోపేతానికి కృషి చేశారు.   కాంగ్రెస్​ పట్ల విధేయత, పార్టీని అధికారంలోకి తేవడం కోసం చేసిన కృషి ఫలితంగా పదేండ్ల తర్వాత  వారికి సముచిత స్థానం  దక్కింది.   పార్టీ కోసం కష్ట పడ్డ వారికి  అవకాశాలుంటాయని చెప్తూ వచ్చిన హైకమాండ్​   కార్పొరేషన్​ పదవులను ఇచ్చి మాట నిలబెట్టుకుంది. 

టికెట్లు రాకున్నా.. గెలుపు కోసం కృషి.. 

కార్పొరేషన్​ చైర్మన్లుగా పదవులు పొందిన  ఈ నేతలు మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల్లో  కాంగ్రెస్​ టికెట్​ ఆశించిన వారే కావడం విశేషం. కానీ హైకమాండ్​ రాజకీయ సమీకరణాలతో  టికెట్​ ఇవ్వలేకపోయింది.  బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్​ టికెట్​ను   మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్​, డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్​రెడ్డి, కిసాన్​ఖేత్​ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్​​రెడ్డి  ఆశించారు.  అనంతరం  ఈరవత్రి అనిల్​ నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానం నుంచి బరిలో దిగాలని కూడా అనుకున్నారు.   అయితే కాంగ్రెస్​ హైకమాండ్   వేరే వారికి  టికెట్లు ఇచ్చింది.   అయినా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్​  అభ్యర్థుల గెలుపు కోసం  కష్టపడ్డారు. ​ దీంతో వారికి గుర్తింపు నిస్తూ చైర్మన్​ పదవులు కట్టబెట్టారు.  

బడా కార్పొరేషన్​లు

  •   2009లో ప్రజారాజ్యం నుంచి బాల్కొండ  నుంచి  ఈరవత్రి అనిల్ ఎమ్మెల్యేగా గెలిచారు. ​ తరువాత అప్పటి కాంగ్రెస్  ప్రభుత్వంలో   ప్రజారాజ్యం  విలీనమైంది. దీంతో ప్రభుత్వ విప్​గా ఆయన బాధ్యతలు నిర్వహించారు.  ఆ తర్వాత   కాంగ్రెస్​ లోనే కొనసాగారు.   ఇప్పుడు ఆయన కు  మినరల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​  చైర్మన్​ పదవి దక్కింది. 
  •   డీసీసీ ప్రెసిడెండ్​ మానాల మోహన్​రెడ్డి కి  తెలంగాణ స్టేట్​ కో-–ఆపరేటివ్​ యూనియన్​ చైర్మన్​పదవి దక్కింది.  
  •   కాంగ్రెస్​ రైతు విభాగం స్టేట్​ ప్రెసిడెంట్​గా ఉన్న  ఎస్​.అన్వేష్​రెడ్డికి ప్రభుత్వం  తెలంగాణ స్టేట్​ సీడ్స్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​ పదవి కేటాయించింది.  
  •   కాసుల బాల్​రాజ్​కు  ఆగ్రోస్​  చైర్మన్​ పదవి వరించింది.   రెండేండ్ల కాలానికి చెందిన కీలక నామినేటెడ్​ పదవులు ఉమ్మడి జిల్లాకు దక్కడంతో కాంగ్రెస్​ కార్యకర్తలు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సామాజిక సర్దుబాటు ..  

మానాల మోహన్​రెడ్డి, అన్వేష్​రెడ్డి ఓసీలుగా కాగా పద్మశాలి వర్గానికి  చెందిన ఈరవత్రి అనిల్​, మున్నూరు కాపు కులానికి చెందిన కాసుల బాల్​రాజ్​ను బీసీ కోటాలో ఎంపిక చేశారు.  గతంలో ప్రకటించిన పోస్టులు తారుమారవుతాయనే చర్చ జరిగినా.. మార్పలేమీ జరగలేదు.   నిజామాబాద్​ అర్బన్​కు చెందిన మైనారిటీ నేత తాహెర్​ను మార్చిలోనే ఉర్దూ ఆకాడమీ చైర్మన్​గా నియమించింది.      షబ్బీర్​అలీ  సలహాదారుడిగా ఉన్నారు.  మహేశ్​ ​గౌడ్​ ఎమ్మెల్సీ అయ్యారు.  తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఉమ్మడి జిల్లాలో నలుగురు  కాంగ్రెస్​ ఎమ్మెల్యేలున్నారు. వీరందరి బలంతో  లోకల్​బాడీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా  గెలుపు తమదే నని  ధీమాతో కాంగ్రెస్​ నేతలు  ఉన్నారు.