ఇయ్యాల రుణమాఫీ .. రైతుల సంబురాలు

  • నిజామాబాద్ లో 44,469, కామారెడ్డిలో 49,541 మందికి లబ్ధి 

నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని 94,010 మంది  రైతులకు లక్ష లోపు రుణాలు  గురువారం సాయంత్రం మాఫీ కానున్నాయి. దీనికి సంబంధించిన లిస్టు ఆయా మండల కేంద్రాలకు బుధవారమే చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలో రూ. 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వారు 1.12 లక్షల మంది ఉండగా..  మొదటి విడతలో లక్ష రూపాయలు రుణం తీసుకున్న 44, 469 మందికి రుణ మాఫీ జరగనుంది. వీరందరి ఖాతాలో రుణమాఫీ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.  

కామారెడ్డిలో ..

కామారెడ్డి జిల్లాలో రూ. 2 లక్షల వరకు రుణం పొందిన రైతులు దాదాపు లక్ష మంది వరకు ఉన్నారు. . ఇందులో మొదటి విడతలో రూ. లక్ష లోపు రుణాలు తీసుకున్న 49,541 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమకానున్నాయి.   మొదటి విడతలోనే కామారెడ్డి జిల్లాలోని రైతులకు సుమారు రూ.335 కోట్ల వరకు మాఫీ కానున్నాయి.  రెండో విడతలో ఈ నెలాఖరులోగా రూ.లక్షన్నర రుణాలు, ఆ తర్వాత రూ. 2 లక్షల రుణాల మాఫీ ఆగస్టు 15 లోగా చేయనున్నారు.
  
ఏవో, ఏఈవోలు నోడల్​ ఆఫీసర్లు

నిజామాబాద్ జిల్లాలో గవర్నమెంట్, ప్రైవేట్​, కో ఆపరేటివ్​ కలిపి మొత్తం 26 బ్యాంకులుండగా 269 బ్రాంచ్​లు ఉన్నాయి. రుణమాఫీ వర్తించే బ్యాంకుల వివరాలు, రైతుల పేర్లు గవర్నమెంట్​వద్ద ఉన్నాయి.  రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో జమ అయిన డబ్బులను బ్యాంకర్లు ఇతర ఖాతాలకు  డైవర్ట్​ చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు బ్యాంకర్లకు ఉన్నాయి. అలాంటి సమస్యలేవైనా తలెత్తితే మానిటరింగ్​ చేయడానికి అగ్రికల్చర్​ ఆఫీసర్లను నోడల్​అధికారులుగా సర్కారు నియమించింది.  జిల్లా లెవెల్​లో డీఏవో, మండలాలకు ఏవోలు, బ్యాంక్​ బ్రాంచ్​లకు ఏఈవోలు నోడల్​ ఆఫీసర్లుగా 
వ్యవహరిస్తారు. 

కాంగ్రెస్ సంబరాలకు సిద్ధం 

రుణమాఫీ సందర్భంగా రైతులతో కలిసి సంబరాలు నిర్వహించనున్నారు.  రైతు వేదికల వద్ద ఈ వేడుకలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఇందులో పాల్గొననున్నారు. మరో వైపు కాంగ్రెస్​ శ్రేణులు సంబరాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.