అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న జిమ్మీ కార్టర్..  2024, డిసెంబర్ 29న జార్జియాలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కాలేయం, మెదడుకు వ్యాపించే మెలనోమాతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురైన కార్టర్ సోమవారం మరణించారు. కార్టర్ మృతి పట్ల పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‎లో అధికారిక లాంఛనాలతో జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

అమెరికా 39వ అధ్యక్షుడు

1976 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జిమ్మీ కార్టర్.. రిపబ్లికన్ క్యాండిడేట్ గెరాల్డ్ ఫోర్డ్‌ను ఓడించి తొలిసారి వైట్‌హౌస్‌లోకి ప్రవేశించాడు. అమెరికా 39వ అధ్యక్షుడిగా ఎన్నికైన కార్టర్.. 1977 నుంచి 1981 వరకు అగ్రరాజ్యానికి సేవలు అందించారు. 1980లో ప్రెసిడెంట్ ఎన్నికల్లో జిమ్మీకి పరాజయం ఎదురైంది.

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రోనాల్డ్ రీగన్ చేతిలో ఓడిపోయాడు. ఇజ్రాయెల్, ఈజిప్ట్ మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించడం..  తన మానవతావాదంతో  ఎన్నో దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంతో పాటు మానవ హక్కులను కాపాడటంలో విశేషంగా కృషి చేసినందుకుగానూ శాంతి రంగంలో అత్యున్నత పురస్కారమైన ‘నోబెల్ శాంతి’ అవార్డ్ గెల్చుకున్నారు జిమ్మీ కార్టర్. 2002 సంవత్సరంలో జిమ్మీకి నోబెల్ శాంతి అవార్డ్ ప్రకటించింది. 

బైడెన్, ట్రంప్ నివాళులు

మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నివాళులర్పించారు. "ఈ రోజు అమెరికాతో పాటు ప్రపంచం ఒక అసాధారణ నాయకుడిని, రాజనీతిజ్ఞుడిని, మానవతావాదిని కోల్పోయింది. ఆరు దశాబ్దాలుగా జిమ్మీ కార్టర్‌ను ప్రియమైన స్నేహితుడు అని పిలిచే గౌరవం మాకు ఉంది. 

అమెరికాలో మిలియన్ల మంది ప్రజలు, జిమ్మీని ఎన్నడూ కలవని వ్యక్తులు కూడా అతడిని గొప్ప వ్యక్తిగా భావించడం కార్టర్ గొప్పతనం’ అని బైడెన్ కొనియాడారు. ‘‘అమెరికా అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ అనేక సవాళ్లు ఎదుర్కొని నిలబడ్డారు. అమెరికన్లందరి జీవితాలను మెరుగుపరచడానికి అతను తన శక్తి మేరకు అన్ని విధాలుగా కృషి చేశాడు. అందుకు అమెరికన్లు జిమ్మీకి కృతజ్ఞతతో రుణపడి ఉంటాము’’ అని ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ట్రంప్ పేర్కొన్నారు.