రూపాయి బిళ్ళ మీద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రం.. అభిమానం చాటుకున్న సూక్ష్మ కళాకారుడు

మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పై అమిత అభిమానాన్ని చాటుకున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం సూక్ష్మ కళాకారుడు గాలిపెల్లి చోళేశ్వర్ చారి  మన్మోహన్ పై ఉన్న అభిమానంతో రూపాయిబిళ్ల మీద ఆయన చిత్రాన్ని చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.  డా.మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలకు చిహ్నంగానే రూపాయి బిళ్ళ మీద చిత్రాన్ని వేసినట్లు చారి తెలిపాడు. 

చోలేశ్వర్ చారి ప్రస్తుతం వేములవాడలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా పని చేస్తున్నాడు. సూక్ష్మ కళాకారుడిగా, చిత్రకారుడిగా,  సైకత శిల్పిగా, ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందిన చోళేశ్వర్ చారి 2024 లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు పొందారు.  వెయ్యికి పైగా సుద్ధముక్కలతో పాటు ఆకులు పాలు, నీళ్లు, రావి ఆకులు, బియ్యం గింజలు ఇతర వస్తువుల మీద కూడా శిల్పాలు చెక్కడం లో నేర్పరి. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రాన్ని రూపాయి బిళ్లపైన వేసి అందరినీ ఆకట్టుకున్నాడు.