బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం లూటీ : దామోదర్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ప్రజాధనాన్ని లూటీ చేశారని, దోచుకొని దాచుకోవడమే లక్ష్యంగా పదేండ్లు పాలన కొనసాగించారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట నియోజకవర్గంలో నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి కార్పొరేట్ శక్తుల కోసం పనిచేసిందన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ మరోసారి దేశ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు.

ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం పాతర్లపహాడ్ లో ఎదురుగాలులకు చేనేత పవర్ లూమ్ షెడ్డు నెలకొరిగిన విషయం తెలుసుకున్న దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గ్రామానికి వెళ్లి చేనేత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా కల్పించారు.