హరీశ్​రావుకు చేదు అనుభవం

  • మీడియాతో మాట్లాడుతుండగా వాగ్వాదానికి దిగిన రైతు
  • బీఆర్ఎస్​ హయాంలో పీఏసీఎస్​లో రూ.45 లక్షలు అవినీతి జరిగినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీత 
  • నల్గొండ జిల్లా చండూరు మండలం మర్రిగూడలో ఘటన

చండూరు ( మర్రిగూడ), వెలుగు : నల్గొండ జిల్లా చండూరు మండలం మర్రిగూడ మండలంలో వడ్ల కొనుగోలు సెంటర్​ వద్ద మాజీ మంత్రి హరీశ్​రావుకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మండల కేంద్రంలో దొడ్డు రకం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా..  రాజేందర్ అనే రైతు కల్పించుకొని బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో పీఏసీఎస్​లో రూ.45 లక్షల అవినీతి జరిగిందని, తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.

ఆ తర్వాత హరీశ్‌‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం దొడ్డు, సన్న రకం కేంద్రాలను వేర్వేరుగా పెట్టడంతో రైతులకు ఇబ్బంది కలుగుతుందని, రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు  తీసుకోవడం లేదన్నారు. దీంతో హరీశ్‌‌రావు మాటలకు రైతు రాజేందర్‌‌ అడ్డు తగిలారు. ‘ఈ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవమే.. కానీ బీఆర్ఎస్‌‌ ప్రభుత్వంలో మర్రిగూడ పీఏసీఎస్‌‌లో తరుగు పేరిట రూ.45 లక్షల అవినీతి జరిగింది’

అని వాగ్వాదానికి దిగాడు. రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేస్తే.. వారిపైన బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హరీశ్‌‌రావు తర్వాత మాట్లాడదామని దాట వేశాడు. అనంతరం రైతుకు ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్‌‌ మునుగోడు ఇన్‌‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డితో పాటు కార్యకర్తలు రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.