మాజీ మంత్రి గంగులకు కాళేశ్వరంపై కనీస అవగాహన లేదు: ఎమ్మెల్యే విజయ రమణారావు

మాజీ మంత్రి గంగుల కమలాకర్ పై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు విరుచుకుపడ్డారు. గంగుల కమలాకర్ మంత్రిగా పని చేసి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.  నీళ్ల మీద ఆయనకు అవగాహన ఉందో  లేదో తెలియకుండా ఉందన్నారు. గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసింది ఏమి లేదన్నారు. NSA నిపుణులు అన్నారం,మెడిగడ్డ, సుందిళ్ళ లో నీళ్లు స్టోరేజ్ చేసే పరిస్థితి లేదని  చెప్పారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పగిలింది.. బుంగలు పడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అని తెలిపారు. 

ఎన్నికల సమయంలో తొలి నీళ్లు పెద్దపల్లిని ముద్దాడుతాయని ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికారన్నారు. కాలేశ్వరం నీళ్లు పెద్దపల్లిని కాకుండా మామ అల్లుళ్ళను ముద్దాడాయన్నారు. బీఆర్ఎస్ పాలకులు పదేళ్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రైతుల పొట్టగొట్టిండ్రని చెప్పారు. కేసీఆర్ హాయంలో ఎక్కడ కొత్త ఆయకట్టు రాలేదన్నారు. కాంగ్రెస్ తన హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టిందన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల్లో ఎక్కడైనా పగుళ్లు వచ్చాయా..? అని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా నింపుతామన్నారు. బీఆర్ఎస్ నాయకుల పుట్టుకే అబద్దాల పుట్టక అన్నారు.

 కేటీఆర్,హరీష్ రావు బావ బామ్మర్దులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని తెలిపారు.  కేసీఆర్ లాగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ఇంజనీర్లు కాదని తెలిపారు. రైతు ఋణమాఫీ అనేది తెలంగాణలో ఒక చరిత్ర అన్నారు. దేశంలో ఏ సీఎం కూడా రెండు లక్షల రుణమాఫీ చేయలేదన్నారు.