కేటీఆర్ ఇంటిపై పోలీసుల దాడులను ఖండిస్తున్నాం

  • కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం
  • రౌడీల్లాగా వ్యవహరిస్తున్న పోలీసులు
  • మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి  

సూర్యాపేట, వెలుగు : కేటీఆర్ ఇంటిపై పోలీసులు దౌర్జన్యంగా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని, వారెంట్ లేకుండా పోలీసులు సోదాలు ఎలా చేస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. ఆదివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నేత కేటీఆర్ ఇంటిపై పోలీసులు దుర్మార్గంగా దాడిచేశారన్నారు. 

ఎక్కడో ఏదో జరిగితే అది కేటీఆర్ కు ఏం సంబంధమని, రేవంత్ సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయని, వారి ఇండ్లపైనా పోలీసులు ఇలాగే చేసే దమ్ముందా..?  ప్రశ్నించారు.  నిజాం కాలంలో కూడా ఇంత దుర్మార్గంగా పోలీసులు పని చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి పొంగులేటి ఇంట్లో విదేశీ వాచీల వ్యవహారం ఎటుపోయిందని ప్రశ్నించారు.

 తెలంగాణలో గృహ ప్రవేశానికి దావత్ లు జరగడం సర్వ సాధారణమని, మంత్రులే పట్టపగలు తాగి తిరుగుతున్నారని, వారికి కూడా పరీక్షలు చేస్తారా..? అని ఫైర్ అయ్యారు. పోలీసులు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని, ఇకముందైనా చట్ట పరిధిలో పనిచేయకపోతే డీజీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.  తమకు అరెస్టులు కొత్త కాదని, ఎన్ని కుట్రలు చేసినా తమ పోరాటం ఆగదని, ప్రజలే కేటీఆర్ ని రక్షించుకుంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ,  నేతలు మొరిశెట్టి శ్రీనివాస్,  ఒంటెద్దు నరసింహారెడ్డి, సవరాల సత్యనారాయణ, నెమ్మాది భిక్షం పాల్గొన్నారు.