12 ఎగ్జామ్ అటెమ్ట్‌‌ల్లో ఏడింటిని పట్టించుకోవద్దు : పూజా ఖేద్కర్

  • ఢిల్లీ హైకోర్టును కోరిన మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్

న్యూఢిల్లీ: తాను సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలను 12 సార్లు రాశారని..అందులో ఏడు అటెమ్ట్‌‌లను పరిగణనలోకి తీసుకోవద్దని ఢిల్లీ హైకోర్టును మాజీ ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేద్కర్ కోరారు. తనకు మోకాళ్ల సమస్య ఉన్నందున దివ్యాంగురాలి కేటగిరీలో రాసిన ఐదు అటెమ్ట్‌‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనకు 47% వైకల్యం ఉన్నట్లు మహారాష్ట్ర ఆస్పత్రి ఇచ్చిన సర్టిఫికెట్ ఉందని కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌‌లో  పూజా ఖేద్కర్ వివరించారు.

 ప్రొబేషనరీ ఆఫీసర్​గా బాధ్యతలు స్వీకరించినందునా ఇప్పుడు తన ఎంపికను రద్దు చేసే అధికారం యూపీఎస్సీకి లేదని తెలిపారు. ఒకవేళ తాను తప్పు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. పేరు మార్చుకుని 12 సార్లు ఎగ్జామ్ రాసినట్లు వస్తున్న ఆరోపణలను కూడా పూజా తప్పుపట్టారు. తన పేరు మధ్యలో మాత్రమే చిన్న మార్పు చేశానని వెల్లడించారు.