- ఇందూర్ ఇద్దరు మాజీ కలెక్టర్లు
- ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేలు
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు కలెక్టర్లు ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. జూన్ 2007 నుంచి జూన్2009 వరకు జిల్లా కలెక్టర్‌గా ఉన్న బి.రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి గెలుపొందారు. ఫిబ్రవరి 2010 నుంచి జులై 2012 వరకు కలెక్టర్‌గా వ్యవహరించిన డి. వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి కోనసీమ జిల్లా రాజోల్ సెగ్మెంట్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు గ్రూప్-1 ద్వారా రెవెన్యూ శాఖలో ఆర్డీవోలుగా ఉద్యోగ జీవితం ప్రారంభించి ఐఏఎస్ పదోన్నతి పొందారు. పాలనలో తమదైన మార్కు కనబర్చిన వీరిద్దరూ మంచి వక్తలు. రిటైర్మెంట్ తరువాత పాలిటిక్స్‌లో చేరితే క్లిక్ అవుతారనే అభిప్రాయం జిల్లా లీడర్లలో ఉండేది. రిటైర్మెంట్ తరువాత వారు అదే మార్గాన్ని ఎంచుకున్నారు. మూడేండ్ల కింద పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన చేరిన డి.వరప్రసాద్ పార్టీలో కీలక రోల్ పోషించి ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశం సానుభూతిపరుడిగా కొనసాగిన బి.రామాంజనేయులు పోటీ చాన్స్ దక్కించుకొని సక్సెస్ అయ్యారు.
వడ్ల కొనుగోళ్లను సింగిల్ విండోలకు
సింగిల్ విండోలు (పీఏసీఎస్‌లు) ఎప్పుడూ ఫైనాన్స్ సమస్య ఎదుర్కొనేవి. రెగ్యులర్ ఆమ్దానీ లేక ఆర్థిక ఒడుదొడుకులతో ఇబ్బందులు పడేవి. సరిగ్గా అదే టైంలో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు మద్ధతు రేట్ ఇచ్చి వడ్లు కొనుగోలు షురూ చేసింది. ఈ కొనుగోలు బాధ్యతను డ్వాక్రా సంఘాలు, సాగునీటి సంఘాలు, ఫిషరీస్ సొసైటీలకు ఇచ్చింది. కలెక్టర్ హోదాలో డి.వరప్రసాద్ సింగిల్ విండోలతో ఒక సీజన్ వడ్లు కొనుగోలు చేయించి వ్యక్తిగతంగా పర్యవేక్షించారు.
వడ్ల కొనుగోలు కమీషన్ డబ్బుతో జిల్లాలోని సింగిల్ విండోలు ఆర్థిక పరిపుష్టి చెందాయి. దీనిని స్టేట్ అంతా ఇంప్లిమెంట్ చేయిస్తే కలిగే ప్రయోజనాన్ని గవర్నమెంట్‌కు ఆయన సూచించడంతో ఓకే అయింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ విండోలు నడుపుతున్న వడ్ల కొనుగోలు సెంటర్లకు మూలకర్త ఆయనే. తెలంగాణ రాష్ట్ర విభజనపై అప్పటి యూపీఏ గవర్నమెంట్ అపాయింట్ చేసిన శ్రీకృష్ణ కమిటీ ఇందూర్ జిల్లా వచ్చినప్పుడు వరప్రసాద్ గైడ్ చేశారు.