Delhi Elections: కాషాయ పార్టీకి ఝలక్.. ఆప్‌లో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లోకి వలసలు ఊపందుకున్నాయి. కాషాయ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గూటికి చేరారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝా ఆదివారం(నవంబర్ 17) ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కేజ్రీవాల్ ఆయనకు ఘన స్వాగతం పలికారు

వాయువ్య ఢిల్లీలోని కిరారీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఝా రెండుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాషాయ పార్టీ నాయకత్వం, విధివిధానాలు నచ్చకనే ఆప్‌లో చేరినట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీలోని ప్రతి ఇంటికి తాగునీరు చేరిందని ఝా తెలిపారు. ఝా చేరికతో ఢిల్లీ ఎన్నికలకు ముందు పూర్వాంచలి ప్రాంతంపై ఆప్‌ పట్టు సాధించింది.