బీఆర్ఎస్​ హయాంలోనే లిఫ్ట్ లు మంజూరు చేయించా : జీవన్ రెడ్డి

  • ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​ నియోజకర్గంలోని మచ్చర్ల, ఫతేపూర్, సుర్బిర్యాల్, చేపూర్​ లిఫ్ట్​లను బీఆర్ఎస్ హయాంలో తాను మంజూరు చేయిస్తే ఇప్పడు కాంగ్రెస్​ నాయకులు తామే మంజూరు చేయించామని చెప్పుకోవడం తగదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్​ జిల్లా ప్రెసిడెంట్ ఆశన్నగారి జీవన్​రెడ్డి అన్నారు. బుధవారం మచ్చర్ల లిఫ్ట్​ పనులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. తన హయాంలో లిఫ్ట్​ మంజూరైందనే అక్కసుతో మచ్చర్ల లిఫ్ట్ పనులను చేపట్టడం లేదన్నారు.

కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ పాలిట దుష్టశక్తులుగా మారాయని మండిపడ్డారు. గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే తెచ్చిన నిధులు ఏమీలేవని, ఓడిన కాంగ్రెస్ నేత అవినీతిపరుడని, ఈ రెండు పార్టీల పుణ్యమా అని ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లిఫ్టుల పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.