వాషింగ్టన్: అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జార్జియా ప్లెయిన్స్‌లోని తన ఇంట్లో ఆదివారం తుదిశ్వాస విడిచారు. వందేండ్ల వయసున్న కార్టర్.. అమెరికా చరిత్రలో ఎక్కువ కాలం బతికిన ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. కార్టర్ భార్య రోసలిన్ పోయినేడాదే మరణించారు. ఆయనకు నలుగురు పిల్లలు, 11 మంది మనవలు/మనవరాళ్లు, 14 మంది ముని మనవలు/మనవరాళ్లు ఉన్నారు.
కార్టర్ అంత్యక్రియలను జనవరి 9న వాషింగ్టన్ లో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. కాగా, కార్టర్ మృతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, మన దేశ ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. అమెరికాతో పాటు ప్రపంచమంతా ఒక గొప్ప లీడర్‌ను, మానవతావాదిని కోల్పోయిందని బైడెన్ పేర్కొన్నారు. అమెరికా అభివృద్ధి కోసం కార్టర్ ఎంతో కష్టపడ్డారని, ఆయన చాలా మంచి వ్యక్తి అని ట్రంప్ కొనియాడారు. ప్రపంచ శాంతి కోసం కార్టర్ అలుపెరగని పోరాటం చేశారని మోదీ ప్రశంసించారు.
2002లో నోబెల్ శాంతి బహుమతి..
ఆ గ్రామం పేరు ‘కార్టర్ పురి’..
1978 జనవరిలో జిమ్మీ కార్టర్, ఆయన భార్య రోసలిన్ ఇండియా పర్యటనకు వచ్చారు. ఆనాడు ఆయన పార్లమెంట్లో ప్రసంగించారు. ఆ టైమ్‌లో కార్టర్, రోసలిన్ హర్యానాలోని దౌలత్‌పూర్ నసీరాబాద్ అనే గ్రామానికి వెళ్లారు. కార్టర్ తల్లి 1960 ప్రాంతంలో పీస్ కార్ప్స్ సంస్థతో కలిసి ఇక్కడ హెల్త్వలంటీర్గా పని చేశారు. అందుకే ఆయన ఆ గ్రామాన్ని సందర్శించా రు. కార్టర్ రాకతో ఆయన గౌరవార్థం ఆ గ్రామస్తులు ఊరి పేరును కార్టర్ పురిగా మార్చుకున్నారు. కాగా, ‘హ్యాబిటెట్ ఫర్ హ్యుమానిటీ’ అనే ఎన్జీవో ఇండియాలో నిరుపేదలకు ఇండ్లు కట్టివ్వగా, ఆ టైమ్‌లో కార్టర్ వలంటీర్ గా పని చేశారు.