- విడదీయడమే పనిగా బీఆర్ఎస్సర్కారు నడిపిన తంతు
- అశాస్త్రీయ విభజనతో పౌరులు, ఆఫీసర్ల తిప్పలు
- పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్సర్కార్ కసరత్తు
నిజామాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్సర్కార్అశాస్త్రీయంగా ఇందూరు జిల్లాను విభజించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ తిప్పలు పడుతున్నారు. ఏ ప్రాతిపదికన జిల్లాల విభజన జరిగిందో ఇప్పటికీ అంతుపట్టని వ్యవహారంగా మారింది. కొత్త ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఈ అంశంపై మళ్లీ చర్చ జరుగుతోంది.
రెండు జిల్లాల్లో బాన్సువాడ సెగ్మెంట్
36 మండలాలున్న ఉమ్మడి జిల్లాను విడదీసి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఇందులో బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్‌ను రెండు జిల్లాల పరిధిలో చేర్చారు. నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలను కామారెడ్డి జిల్లాకు కేటాయించగా, కోటగిరి, వర్ని, పొతంగల్, చందూర్, రుద్రూర్, మోస్రా మండలాలను నిజామాబాద్ జిల్లాలో కలిపారు.
నియోజకవర్గాన్ని ఒకే జిల్లా పరిధిలో చేర్చకపోవడంతో సెగ్మెంట్లో జరిగే అఫీషియల్ రివ్యూ మీటింగ్‌లకు రెండు జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు రావాల్సి వస్తోంది. అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రంగా నిర్వహించే ప్రతి మీటింగ్‌కు తహసీల్దార్లు, మండల స్థాయి అధికారులు రెండువైపులా వెళ్లాల్సి వస్తోంది. జిల్లా పరిషత్ పరిధి కూడా ఇదే రీతిలో గజిబిజిగా ఉంది.
పక్క జిల్లాల్లో ఇక్కడి ఓటర్లు..
బాల్కొండ సెగ్మెంట్ కమ్మర్పల్లి మండలంలో ఉన్న మానాల విలేజ్‌ను పక్కనున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలంలో కలిపారు. ఈ గ్రామంలో ఆరువేలకు జనాభా, 3,170 మంది ఓటర్లున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే ఈ గ్రామ పంచాయతీ బాల్కొండ లోనే ఉంది. ఇక్కడ ఓటేసి పక్క జిల్లా పౌరులుగా ఉండడంతో సెగ్మెంట్యూనిట్గా అమలు చేసే పథకాలు అందడం లేదు.
రెవెన్యూ శాఖ నుంచి ఆయా సర్టిఫికెట్లు పొందేందుకు స్డూడెంట్స్ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాన్ని సిరిసిల్ల జిల్లాలో కలపడం వల్ల అధికారులు రెండు జిల్లాల మీటింగుల్లో పాల్గొంటున్నారు. మానాల విలేజ్ ప్రజలు రెవెన్యూ డివిజన్ సేవల కోసం ఇందూర్‌లోని ఆర్మూర్ రావాల్సి వస్తోంది.
ఇవీ కూడా అంతే..
రెవెన్యూ డివిజన్, సెగ్మెంట్ యూనిట్‌గా విభజిస్తే పౌరులకు పాలనపరమైన సౌలత్ ఉంటుంది. అలా కాకుండా రూరల్ నియోజకవర్గంలోని ఆరు మండలాలను నిజామాబాద్ డివిజన్లో చేర్చి ఒక్క జక్రాన్‌పల్లిని ఆర్మూర్‌లో కలిపారు. ఇదే సెగ్మెంట్ కింద ఉన్న బోర్గాం (పి), పాంగ్రా, మాధవ్‌నగర్, సారంగాపూర్, ఖానాపూర్, కాలూరు, ముబారక్‌నగర్, గోపన్‌పల్లి గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. బోధన్ సెగ్మెంట్లోని నవీపేట మండలం ఎప్పటి నుంచో నిజామాబాద్ డివిజన్లో ఉండగా, ఆర్మూర్ సెగ్మెంట్లోని మాక్లూర్మండలం బోర్గాం (కె), మానిక్ భండార్ విలేజ్లను కార్పొరేషన్లో చేర్చారు.
ముగ్గురు ఎంపీటీసీలతో మండలం
బుద్ధిపుట్టినప్పుడల్లా బీఆర్ఎస్ సర్కారు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. నిజామాబాద్ జిల్లాను మొదట 27 మండలాలతో కూర్చి 33కు పెంచారు. ఐదు గ్రామ పంచాయతీల పరిధితో మోస్రాను, ముగ్గురు ఎంపీటీసీలే ఉన్న చందూర్‌ను మండలాలుగా ఏర్పాటు చేశారు. చందూర్‌లో వేర్వేరు పార్టీల నుంచి ఎంపీటీసీలు గెలిస్తే ఎంపీపీ ఎన్నిక సమస్యాత్మకమే అవుతుంది.