- ఫోర్జరీ నకిలీ పట్టాల బాగోతం
- రియల్టర్ల చేతిలో గవర్నమెంట్ ల్యాండ్
- కనుమరుగవుతున్న బాల్కొండ పురాతన ఖిల్లా భూములు
బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ పట్టాలతో భూమాయ జరిగింది. అధికారుల అండతో ఇంటి నిర్మాణాల కోసం అప్లై చేసి కమర్షియల్ కాంప్లెక్స్ లను నిర్మిస్తున్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్లకు అడ్డు చెప్పే వారు లేకపోవడంతో వాటిని కొన్న సామాన్య ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. బాల్కొండ మండల కేంద్రంలోని కింది స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి అధికారి వరకు అమ్యామ్యాలకు ఆశపడి గవర్నమెంట్ ఖజానాకు గండికొడుతున్నారు. 10 శాతం జీపీ ల్యాండ్ వదలకుండానే ప్లాట్లు విక్రయిస్తున్నారు. తాజాగా ఫోర్జరీ సంతకాల నకిలీ పట్టాల బాగోతం బయటపడింది. రియల్టర్ల ఆధీనంలో ఉన్న గవర్నమెంట్ స్టలాన్ని కొందరు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి అమ్మి రూ.కోట్లు కొల్లగొట్టిన విషయం బయటపడింది.
ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు..
బాల్కొండలో 1,333 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమి అక్రమాల కు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు విచారణ జరిపారు. గతంలో పని చేసిన ఎమ్మార్వోల సంతకాల ను ఫోర్జరీ చేసి , సర్కారు భూములకు పట్టాలు సృష్టించి అమ్మేసినట్లు జరిగాయని గుర్తించారు.1333 సర్వేలో సుమారు 224 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లో 1995 సంవత్సరంలో అప్పటి గవర్నమెంట్ 385 పేద కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేసింది. అది అదునుగా చేసుకున్న కొందరు మరో 600 వరకు నకిలీ పట్టాలు సృష్టించి అమాయకులకు విక్రయించారు. అవన్నీ ఫోర్జరీ నకిలీ పట్టాలుగా అనుమానిస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాలతో సర్వే బృందం పరిశీలన
కలెక్టర్ ఆదేశాలతో సర్వే బృందం గవర్నమెంట్ ల్యాండ్ హద్దులు పరిశీలించి,ఇంటింటికీ తిరుగుతూ పట్టాలు తనిఖీ చేసింది. 1332 ల్యాండ్ ను సర్వే చేస్తే తప్ప గవర్నమెంట్ ల్యాండ్ ఎంత మేరకు కబ్జా అయిందనేది తెలియదు. రెవెన్యూ ఆఫీస్ లో పని చేసిన ఆఫీసర్లు అమ్యామ్యాలకు ఆశపడి రూ.కోట్లాది విలువ చేసే గవర్నమెంట్ ల్యాండ్ ను రియల్టర్ల కు ధారాదత్తం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
పురాతన ఖిల్లా భూములు పదిలమేనా ?
బాల్కొండ పురాతన ఖిల్లా భూములు పదిలంగా ఉన్నాయా అంటే ఏ అధికారి చెప్పలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖ వారి ప్రకారం అల్లకొండ ఖిల్లా లోపల భూ విస్తీర్ణం 39 ఎకరాల 27 గంటలు, తూర్పు సర్వే నెంబర్ 2263, పడమర సర్వే 1815, ఉత్తర సర్వే నెంబర్ 2266,& 2267 ,దక్షిణ భాగం సర్వే నెంబర్ 2261భూమి ఉంది. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఖిల్లా నాల (కంద కాలు) కబ్జాలు చేసి బిల్డింగులు నిర్మించారు.
ప్రస్తుతం కందకాలు 70 శాతం మేర కనిపించకుండా పోయాయి. ఖిల్లా కందకాలను పూడ్చి పహానీ, ఖాస్రాలో బై సర్వే నంబర్లుగా మార్చి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇళ్లు,షట్టర్ల నిర్మాణాలు ,చేపట్టి థర్డ్ పార్టీకి అమ్మి రూ. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారని విమర్శలు ఉన్నాయి. . ఇప్పటికైనా పురావస్తు,రెవెన్యూ శాఖ కబ్జాదారులు,నకిలీ పట్టాల సృష్టి కర్తలపై చర్యలు తీసుకుని కనుమరుగవుతున్న బాల్కొండ సంపదను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.