మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో.. రోడ్లకు ఫారెస్ట్ పర్మిషన్లు లేట్

 

  • ప్రతిసారి కొర్రీలు పెడుతున్న ఆఫీసర్లు
  • వెయ్యి కిలో మీటర్లకు.. 430 కిలో మీటర్లే పూర్తి
  • నిరుపయోగంగా రూ.630 కోట్ల నిధులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఇన్ టైమ్ లో అనుమతులు ఇవ్వకపోవడమేనని ఆర్ అండ్ బీ అధికారులు చెప్తున్నారు. కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖలకు చెందిన అధికారులతో ఆర్ అండ్ బీ ఆఫీసర్లు ప్రతి వారం సమావేశం అవుతున్నా.. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ఆటంకం అవుతున్నాయని చెప్తున్నారు. రోడ్లన్నీ కనెక్టివిటీకి ఉపయోగపడుతాయని, నిబంధనలు కొంతమేర సడలించాలని కేంద్ర అధికారులను స్టేట్ ఆర్ అండ్ బీ ఆఫీసర్లు కోరుతున్నా పట్టించుకోవడం లేదని గుర్తు చేస్తున్నారు.

సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు

రాష్ట్రంలో ఈ రోడ్ల నిర్మాణం మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా చేపట్టాల్సి ఉందని ఆర్ అండ్ బీ అధికారుల తెలిపారు. అయితే, ఈ రోడ్ల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న ఫారెస్ట్ రూల్స్ ను సవరించాలని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి ద్వారా  సీఎం రేవంత్  రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు సీఎం, మంత్రి కోమటిరెడ్డి.. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ దృష్టికి తీసుకెళితే రోడ్ల నిర్మాణంలో వేగం పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో వెయ్యి కిలో మీటర్లు రోడ్లు నిర్మించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు కేవలం 430 కిలో మీటర్లలోనే పూర్తయిందని  అధికారులు చెప్తున్నారు. అలాగే, 40 వంతెనల నిర్మాణానికి గాను 19 దాకా పూర్తయినట్టు తెలిసింది. మిగతా 570 కిలో మీటర్ల రోడ్లు పూర్తి చేయాల్సి ఉన్నది. అందుకోసం దాదాపు రూ.630 కోట్ల నిధులు ఉండగా.. అటవీ అనుమతుల కారణంగా వాటిని ఉపయోగించలేని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ పర్మిషన్లు ఇవ్వకపోవడం ప్రతి ఏటా ఆ నిధులు తరువాతి ఏడాదికి క్యారీ ఫార్వడ్ అవుతున్నాయంటున్నారు.

100 శాతం నిధులు కేంద్రమే భరించాలి

దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, జిల్లాల్లో రోడ్ల నిర్మాణానికి ఎల్​డబ్ల్యూ ఈ (లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రిమిజమ్) స్కీంలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫండ్స్ ఇస్తోంది. ఈ రోడ్లు నిర్మించేందుకు అటవీ శాఖ నుంచి పర్మిషన్ వచ్చిన వెంటనే రెవెన్యూ శాఖ భూమిని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోడ్ల నిర్మాణానికి కేంద్రం 60% , రాష్ట్రం 40% నిధులు ఖర్చు చేయాలి. అయితే, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి 100% నిధులను కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం గత కొంత కాలంగా కోరుతోంది. మావోయిస్టు ప్రాంతాల్లో ఏదైనా ఘటన జరిగినప్పుడు భద్రతా దళాలు చేరుకోవడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఈ రోడ్లే కీలకమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది.