వణికిస్తున్న పులి !..భయం గుప్పిట్లో అటవీ గ్రామాల ప్రజలు

  • ఇంకా మహారాష్ట్ర బోర్డర్‌‌‌‌లోనే తిరుగుతున్న పెద్దపులి
  • మానిటరింగ్‌‌‌‌ చేస్తున్న ఆఫీసర్లు
  •  భయం గుప్పిట్లో అటవీ గ్రామాల ప్రజలు
  • పత్తి ఏరేందుకు చేన్లకు వెళ్లలేని పరిస్థితి 
  • రైతులు, కూలీలకు తప్పని తిప్పలు
  • నేటితో ముగియనున్న 144 సెక్షన్ 

ఆసిఫాబాద్/కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లాలోని అటవీగ్రామాల ప్రజలను పులి భయం వెంటాడుతోంది. ఇటీవల కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ రేంజ్‌‌‌‌ పరిధిలోని గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మిని చంపేసిన పులి, మరుసటి రోజే సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ గ్రామానికి చెందిన రైతు రౌతు సురేశ్‌‌‌‌పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ రెండు ఘటనలతో ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. 

పత్తి ఏరే సీజన్​కావడంతో చేన్ల వైపు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. మరోవైపు వచ్చింది రెండు పులులు అని, అవి ఇంకా మహారాష్ట్ర బోర్డర్‌‌‌‌లోనే తిరుగుతున్నాయని ప్రకటించిన ఆఫీసర్లు వాటి కదలికలను మానిటరింగ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అటవీ సిబ్బంది జనానికి మాస్క్‌‌‌‌లు పంపిణీ చేస్తున్నారు. తల వెనుకవైపు మాస్కులు పెట్టుకొని వెళ్తే పులి దాడిచేయదని చెప్తున్నా రైతులు, కూలీల్లో భయం మాత్రం తగ్గడం లేదు. 

కొత్త భూభాగాలను వెతుక్కుంటూ.. 

మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి వలస వచ్చిన రెండు పులులు (ఆడ, మగ) తెలంగాణ బోర్డర్‌‌‌‌లోని టైగర్‌‌‌‌ కారిడార్‌‌‌‌లో కొత్త ఆవాసాలను వెతుకుతున్నాయని తెలంగాణ అటవీ శాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు. పులి సాధారణంగా 60 నుంచి 100 చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఉంటుంది. తడోబాలో పులుల సంఖ్య పెరిగి, పోటీ ఏర్పడడంతో ఆవాసాన్ని వెతుక్కుంటూ వచ్చిన రెండు పులులు కొద్దిరోజులుగా కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ డివిజన్‌‌‌‌లోని సిర్పూర్‌‌‌‌ రేంజ్ చుట్టూ తిరుగుతున్నాయని ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు చెప్తున్నారు. 

కాగా, గత నెల 29, 30 తేదీల్లో ఇద్దరిపై దాడిచేసిన పులి మధ్యలో రెండు రోజులు ఆచూకీ లేకుండా పోయింది. శనివారం ఇటికలపహాడ్, సిర్పూర్, బొంబాయిగూడ, పెంచికల్‌‌‌‌పేట్ (కాగజ్‌‌‌‌నగర్), ఆసిఫాబాద్‌‌‌‌ డివిజన్‌‌‌‌లో, ఆదివారం సిర్పూర్‌‌‌‌లోని అటవీ నర్సరీ సమీపంలో పులి అడుగులు కనిపించాయి. కాగా, పులి లక్ష్మిని హతమార్చిన ఏరియా చుట్టుపక్కల14 గ్రామాల్లో 144 సెక్షన్‌‌‌‌ విధించిన పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు.. రైతులు, కూలీలు పంట పొలాలు, చేన్ల వైపు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. 

పులి దాడి జరిగిన కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ మండలం బెంగాలీ క్యాంప్‌‌‌‌లు, అనుకొడ, గన్నారం, మండ్వా, సిర్పూర్ (టి) మండలం ఇటికలపహాడ్, చింతకుంట, చీలపల్లి, ఆరెగూడ, పెద్దబండ, చుంచుపల్లి గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కొందరు మధ్యాహ్నం పూట బయటకు వస్తున్నా సాయంత్రం నాలుగు దాటిందంటే ఇండ్లకు రిటర్న్‌‌‌‌ అవుతున్నారు. వర్షాలు పడుతుండడంతో మొక్కల మీది పత్తి నేలపాలై రైతులు నష్టపోతున్నారు. పత్తి ఏరేందుకు వెళ్లి నాలుగు రాళ్లు సంపాదించుకుందామనుకున్న కూలీలు సైతం ఉపాధి లేక ఇండ్లకే పరిమితమయ్యారు. 

పులులు మహారాష్ట్ర వెళ్లిపోయాయని కొందరు, ఇంకా ఇక్కడే తిరుగుతున్నాయని ఇంకొందరు ప్రచారం చేస్తుండడంతో దేనిని నమ్మాలో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు. అసలు పులులు ఉన్నాయా ? వెళ్లిపోయాయా ? క్లారిటీ ఇవ్వాలని ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లను కోరుతున్నారు. అదే సమయంలో 14 గ్రామాల్లో నేటి నుంచి 144 సెక్షన్‌‌‌‌ ఎత్తివేస్తారా ? కొనసాగిస్తారా ? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

పొద్దు వంగక ముందే ఇంటికి రమ్మంది

పొలానికి వెళ్తుంటే పొద్దు వంగక ముందే ఇంటికి రావాలని నా భార్య ఆర్డర్‌‌‌‌ వేసింది. పులి భయం మస్తు ఉంది. పులి చూస్తే పంజా దెబ్బ.. పాము చూస్తే కాటు తప్పదని మా అమ్మ చెప్పేది. ఏడాది పాటు కష్టం చేసి పండించిన పంట ఇప్పుడు కోతకు వచ్చింది. వారం నుంచి కూలీల వెంట పడుతున్నా. ఇటీవల పులి చంపిన ఏరియా కావడంతో ఎవరూ రావడం లేదు.   – ప్రఫుల్‌‌‌‌ మండలం, బెంగాలీ క్యాంప్ 12 గ్రామ రైతు

చీపుర్లు అమ్ముకుని బతికేటోల్లం 

నాకు భూమి లేదు. మా కుటుంబం మొత్తం చీపుర్లు అమ్మే జీవనం సాగిస్తున్నం. మా గన్నారం ఊరికి దగ్గర్లో ఉన్న అడవి దగ్గర చీపుర్లు కోసుకునేందుకు ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు పోనివ్వడం లేదు. పులి భయం కూడా ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది ఒక రైతు భూమి పాలుకు సాగు చేస్తున్న. అయిదు రోజుల కిందట వడ్లు కోసి పొలంలో పెట్టాం. అంతలోనే పులి దాడి చేసి లక్ష్మిని చంపేసింది. ఇప్పుడు పొలంలో ఉన్న వడ్లు చెదలు పడుతున్నాయి. పులి మా జీవితాలను ఆగం చేస్తోంది.

– గడ్డం శంకరి, గ్రామస్తుడు

 పులి ఉంది రావొద్దని చెప్పాం కదా అమ్మా : ఫారెస్ట్ ఆఫీసర్లు

రాకుంటే పూట గడిసేదెలా : కూలీలు

మంగళవారం సాయంత్రం కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ మండలం బెంగాలీ క్యాంప్ 5 దగ్గర్లో పత్తి చేనులో పత్తి తీసేందుకు వచ్చిన కూలీలతో ఫారెస్ట్ సిబ్బంది మాట్లాడారు. ఈ సమయంలో అధికారి ఇప్పుడు పులి భయం ఉంది. పనులకు ఎందుకు వస్తున్నారు. రావద్దని చెప్పాం కదా, ప్రాణం కంటే కూలీ ఎక్కువా ? అని ప్రశ్నించారు. దీంతో అక్కడి కూలీలు తాము కూలీ పనికి రాకుంటే పూట గడిసేది ఎలా అని అన్నారు. రోడ్డు పక్కన ఉన్న చేను కావడంతో వచ్చామని, నాలుగు గంటల వరకు ఇండ్లకు రిటర్న్‌‌‌‌ అవుతున్నామని సమాధానం ఇచ్చారు

పులి నైనా పట్టండి..కూలీ అయినా ఇయ్యండి 

మా ఊరి మహిళ లక్ష్మి మీద పులి దాడి చేసి చంపేసిన తర్వాత మేమంతా భయంతో ఇండ్లలోనే ఉంటున్నాం. నాలుగు రోజులుగా కూలీకి కూడా పోవడం లేదు. ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు పులిని అయినా పట్టుకోవాలి.. లేదంటే మాకు రోజు కూలీ అయినా కట్టియ్యాలి. డ్వాక్రా, బ్యాంక్ నుంచి, వీవోల్లో లోన్లు తీసుకున్నాం. ఆ డబ్బులు కట్టేందుకు ఆపతి అవుతోంది. నెలకు రూ. 8 వేలు కట్టాలి. మా గోస ఎవరికీ పట్టడం లేదు.– బీసు స్వప్న, గన్నారం గ్రామం

ముగ్గురం ఇంటికే పరిమితమైనం

మాకు భూమి లేదు. మా ఇంట్లో అందరం కూలీలమే. నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాం. ఈ సీజన్‌‌‌‌లో పత్తి, వరి కోత కూలీ దొరికేది. ఇప్పుడు పులి కారణంగా ఎవరూ పనికి పిలవడం లేదు. ఏమైనా జరిగితే రైతు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని భయపడుతున్నారు. రోజుకు రూ. 1500 నష్టపోతున్నాం. మేము చెప్పేదాక చేన్లకు పోవొద్దని ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు చెప్పిండ్రు. దీంతో ఖాళీగా కూర్చుంటున్నాం.– బీరక దుర్గయ్య, గన్నారం