- మేడారంలో మూడు నెలల కింద 800 ఎకరాల్లో కూలిన చెట్లు
- ఇప్పటివరకు తొలగించని ఫారెస్ట్ ఆఫీసర్లు
- కొత్తగా ఒక్క మొక్క కూడా నాటని వైనం
- పరీక్షల పేరుతో కాలయాపన
జయశంకర్‌భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా మేడారం అడవుల్లో చెట్లు పడిపోయి మూడు నెలలు దాటినా వాటిని తొలగించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు. పరీక్షల పేరుతో కాలం గడుపుతున్నారు కానీ పడిపోయిన చెట్ల స్థానంలో ఇప్పటివరకు ఒక్క కొత్త మొక్క కూడా నాటలేదు. మరో వైపు చెట్లు కూలడానికి క్లౌడ్ బరస్ట్ అని ఒకరు, టోర్నడోనే కారణమని మరొకరు చెబుతున్నారు తప్పించి.. ఇదీ అసలు కారణమని ఎవరూ కన్ఫర్మ్ చేయడం లేదు.
800 ఎకరాల్లో 78 వేల చెట్లు నేలమట్టం
ములుగు జిల్లాలో ఆగస్టు 31న రాత్రి ఈదురుగాలులు, గాలివాన భారీ బీభత్సాన్ని సృష్టించాయి. తాడ్వాయి – మేడారం రూట్‌లో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా సుమారు అర కిలోమీటర్ రేడియస్‌లో 2 రెండు కిలోమీటర్ల పొడవునా 830 ఎకరాల విస్తీర్ణంలో 70 వేలకు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి. పెద్ద పెద్ద చెట్లు సైతం వేర్లతో సహా నేలకొరగగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు ఘటనకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
Also Read : పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్ల రిక్రూట్మెంట్
సెప్టెంబర్ 4, 5వ తేదీల్లో పీసీసీఎఫ్ ఆరెం డోబ్రియల్, కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్, భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ భీమానాయక్, ములుగు డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెట్లు కూలడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ తయారుచేయడానికి శాటిలైట్ డేటా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) శాస్త్రవేత్తల సహాయం తీసుకుంటామని చెప్పారు.
ఎక్కడి చెట్లు అక్కడే..
చెట్లు కూలిపోయిన ఘటన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ 10 టీమ్‌లను వేసి కూలిపోయిన చెట్లను లెక్కించారు. ఎన్ని ఎకరాల్లో ఎన్ని చెట్లు కూలిపోయాయి ? కూలిన వాటిలో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ? వంటి వివరాలను సేకరించారు. మొత్తం 830 ఎకరాల్లో 70 వేలకుపైగా 150 రకాల చెట్లు కూలినట్లు తేల్చారు. వీటిలో వేర్లతో సహా కూలిన చెట్లు, సగం వరకు కొమ్మలు విరిగిన చెట్లు, గాలులకు పడిపోయిన చెట్లను గుర్తించారు.
తర్వాత వాటిని పట్టించుకోవడమే మానేశారు. చెట్లు కూలడానికి గల కారణాలను స్పష్టంగా చెప్పకపోగా, పడిపోయిన ఒక్క చెట్టును కూడా పక్కకు జరపలేదు. విరిగిన కొమ్మలను అక్కడే వదిలేశారు. బుధవారం మేడారంలో భూకంప కేంద్రం బయటపడిన విషయం తెలిసి మీడియా వచ్చే అవకాశం ఉందని భావించిన ఫారెస్ట్ ఆఫీసర్లు హడావుడిగా కొన్ని చెట్లను నరికి టింబర్ డిపోలకు తరలించే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులను తీసుకొచ్చి యంత్రాల సాయంతో చెట్లను కట్ చేయడం మొదలుపెట్టారు.
ఐదు రకాల చెట్లను కొట్టి టింబర్ డిపోకు పంపిస్తం
మేడారం అడవిలో పడిపోయిన చెట్లలో విలువైన ఐదు రకాల చెట్లను కొట్టి కలపను టింబర్ డిపోలకు పంపిస్తం. ఆ తర్వాత మార్కెట్ రేటు ప్రకారం వాటిని అమ్మి డబ్బులను ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తాం. టేకు, నల్లమద్ది, ఏకీస, నారేప, బండారు రకం దుంగలను కోసేందుకు ఏర్పాట్లు చేసినం. అడవి సంరక్షణ కోసం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేశాం. నిధులు మంజూరు కాగానే పనులు స్టార్ట్ చేస్తాం
రాహుల్ కిషన్ జాదవ్, ఫారెస్ట్ ఆఫీసర్, ములుగు జిల్లా
ఒక్క మొక్క కూడా నాటలే..
మేడారం అడవిలో నాలుగు నెలల కింద చెట్లు కూలినప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. పడిపోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటుతామని చెప్పిన్రు. ఇప్పటివరకు ఒక్క మొక్క నాటలే. చెట్లు ఎందుకు కూలినయో కూడా చెప్పట్లేదు. అప్పుడు చెట్లు కూలినయ్, ఇప్పుడు భూకంపం అంటున్నరు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు.
చందా ప్రకాశ్, కామారం, తాడ్వాయి
ఫారెస్టోళ్లు పట్టించుకోవట్లే..
మేడారం అడవుల్లో ఒకే సారి 70 వేలకు పైగా చెట్లు పడిపోతే ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. ఎంక్వైరీ పేరుతో కాలం గడుపుతున్నారు. చెట్లు నేలకొరిగి నాలుగు నెలలు దాటింది. పడిపోయిన చెట్ల దుంగలను తీసే ప్రయత్నం కూడా చేయట్లేదు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ఫారెస్ట్ ఆఫీసర్లపై ఉంది.
సుతారి సతీశ్, పర్యావరణ వేత్త, ములుగు జిల్లా