జీతాలు రాక అవస్థలు పడుతున్న..  అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 

  • ఆఫీసర్ల నిర్లక్ష్యంతో శాలరీ పెండింగ్ 
  • అడ్డగోలుగా ఏజెన్సీలను ఎంపిక చేసిన ఆఫీసర్​ 
  • ఇటీవల ఏజెన్సీలను రెన్యువల్ చేయకపోవడంతో ఇబ్బందులు 
  • రెన్యువల్ కోసం కోర్టు కెళ్లిన పలు ఏజెన్సీ నిర్వాహకులు 
  • కనీసం పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించని ఉద్యోగుల వేడుకోలు  

సూర్యాపేట, వెలుగు :ఆరు నెలలుగా జీతాలు లేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.  అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులకు శాపంగా మారింది. సకాలంలో ఏజెన్సీలను రెన్యువల్ చేయకపోవడంతో జిల్లాలోని పనిచేస్తున్న ఔట్ సో ర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్నారు. జీతాల కోసం ఎదురుచూస్తుండగా రెన్యువల్ చేయాలంటూ పలు ఏజెన్సీలు కోర్టును ఆశ్రయించాయి. అయితే ఇప్పుడు అధికారులు కొత్తగా ఏజెన్సీల కోసం టెండర్లను ఆహ్వానించడం వివాదంగా మారింది. 

రెన్యువల్ కు అడ్డంకులు..

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల కోసం అర్హత కలిగిన ఏజెన్సీలు ఎన్​ ప్యానెల్ చేయించుకోవాలి. అగ్రిమెంట్ చేసుకున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఏటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్​ ప్యానెల్​మెంట్ కమిటీ చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా ఎంప్లాయీమెంట్ ఆఫీసర్ వ్యవహరిస్తారు. సూర్యాపేట జిల్లాలో 36 ఏజెన్సీలు ఉన్నాయి. గత మార్చిలో వ్యాలిడిటీ ముగిశాయి. వరుస ఎన్నికలతో ఏజెన్సీలను రెన్యువల్ చేయకుండా వాటి గడువు జూలై 31 వరకు పొడిగించారు. జూలై 31తో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వ్యాలిడిటీ ముగిసింది. 

కోర్టు కెళ్లిన పలు ఏజెన్సీ నిర్వాహకులు..

ఎంప్లాయీమెంట్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమకు అనుకూలంగా ఉన్న వారికి రెన్యువల్ చేస్తున్నారని కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఏజెన్సీలను రెన్యువల్ చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎంప్లాయీమెంట్ అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ కొత్తగా ఎన్​ ప్యానెల్​మెంట్ల కోసం టెండర్లను పిలిచారు. గతంలో ఉన్న ఏజెన్సీ లను కాదని కొత్త ఏజెన్సీ లకు కట్టబెట్టేందుకే ఈ ​టెండర్లను పిలుస్తున్నారని నిర్వాహకులు మండిపడుతున్నారు. 

Also Read :- చేపలన్నీ వరద పాలు..!

జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు..

హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈఎస్ఐ  డిస్పెన్సరీని గతేడాది జనవరిలో అప్పటి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మొత్తం 18 మంది సిబ్బందితో డిస్పెన్సరీ ఏర్పాటు చేయగా ఉద్యోగాల భర్తీ అక్రమంగా జరిగాయంటూ హుజూర్ నగర్ కు చెందిన ఒక ఏజెన్సీ కోర్టుకు వెళ్లింది. దీంతో ఈ ఏడాది మార్చిలో లీనా మ్యాన్ పవర్ ఏజెన్సీ నుంచి షిర్డీ సాయి ఏజెన్సీకి బదిలీ చేశారు.

ఏజెన్సీ కేటాయించిన నాటి నుంచి ఇప్పటి వరకు నిర్వాహకుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన కూడా బిల్లులు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా ఆరు నెలలుగా సిబ్బందికి చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ సైతం చెల్లించడం లేదు.

పైగా ఉద్యోగాల నుంచి తొలగించి కొత్త వారిని నియమిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఏజెన్సీ నిర్వాహకుడి బాగోతం బయటపడింది. మరోవైపు గతేడాది ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 21 ఏఎన్ఎం పోస్టులను ఔట్ సో ర్సింగ్ పద్ధతితో నియమించగా, వాటిని సూర్యాపేటకు చెందిన ఏజెన్సీకి కేటాయించి భర్తీ చేశారు. ఇటీవల ఎంప్లాయీమెంట్ ఆఫీసర్ ఆ ఏజెన్సీని కాదని.. మరో ఏజెన్సీకి కట్టబెట్టారు. కానీ జీతాలు మాత్రం మొదట నియమించిన ఏజెన్సీ నుంచే ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చారు.

దీంతో ఆరు నెలలుగా ఏఎన్ఎంలకు కూడా జీతాలు ఇవ్వడం లేదు. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు రెన్యువల్ చేయకుండా జాప్యం చేయడంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి చెందిన ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.