సూర్యాపేట జిల్లాలో విచ్చలవిడిగా కల్తీ ఆహారం

  • కుళ్లిన చికెన్, కాలం చెల్లిన కలర్స్  
  • హోటల్ నిర్వాహకుల కక్కుర్తి
  • పాడైపోయిన పదార్థాలతో ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ 
  • సూర్యాపేట జిల్లాలో యాథేచ్ఛగా కల్తీ దందా 
  • ఫుడ్ సేఫ్టీ దాడుల్లో బయటపడ్డ రెస్టారెంట్ల బాగోతం  

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంగా విచ్చలవిడిగా ఆహార కల్తీ జరుగుతున్నది. కంటికి ఇంపుగా కనిపించేందుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లలో వివిధ రకాల ఫ్లేవర్ కలర్లు కలుపుతున్నారు. టేస్ట్ కోసం కెమికల్ సాల్ట్ వేస్తున్నారు. వంటకు ఉపయోగించే అల్లం, కారం పొడి, వివిధ రకాల మసాలాలను కూడా కల్తీ చేస్తున్నారు. ఒకవైపు కాలం చెల్లిన ఉత్పత్తులు, మరోవైపు కుళ్లిన పదార్థాలతో తయారు చేస్తున్న ఆహారం జనాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఫుడ్​సేఫ్టీ, మున్సిపల్​ హెల్త్​ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. టాస్క్​ఫోర్స్​అధికారులు ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ కల్తీ బాగోతాలు బయటపడ్డాయి. 

హోటల్ నిర్వాహకుల కక్కుర్తి..

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా ఫుడ్​స్టాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు అనేక వెరైటీలు​తయారు చేస్తున్నారు. కొందరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే దురాశతో కల్తీ దందా చేస్తున్నారు. ఫుడ్ టేస్ట్ కోసం కలర్  వచ్చేందుకు, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఫార్మాల్డీ హైడ్ వంటి కెమికల్స్ కలుపుతున్నారు. 

మరోపక్క కుళ్లిన చికెన్, బేకరీల్లో కాలం చెల్లిన కలర్స్, క్వాలిటీ లేని ఆయిల్స్ వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. తనిఖీల్లో రెస్టారెంట్ల కిచెన్ చూసి అందరూ షాక్ అయ్యారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వివిధ షాపులు, కనీస శుభ్రత పాటించకుండానే కుళ్లిన చికెన్ వండుతూ బిజినెస్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్​అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సర్టిఫికెట్ లేకుండానే కల్తీ బిజినెస్​జోరుగా నడుస్తున్నది.

తనిఖీలు మరిచిన ఆఫీసర్లు..

జిల్లాలో ఫుడ్​బిజినెస్ పై ఎక్కడా కనీస ప్రమాణాలు పాటించడం లేదనే విషయం స్పష్టమవుతున్నది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతోపాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టడం లేదు. కల్తీ ఆహారాన్ని అరికట్టాల్సిన ఆఫీసర్లు కొందరు మామూళ్లకు అలవాటు పడి తనిఖీలు చేయడం మరిచారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. 

మరోవైపు 10 లక్షల జనాభా ఉన్న సూర్యాపేట జిల్లాకు ఇన్​చార్జి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండడంతోపాటు మూడు జిల్లాలకు ఈయనే ఇన్​చార్జిగా ఉండడంతో తనిఖీలను అధికారులు మర్చిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఆహారం కల్తీ చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

నోటీసులు అందించాం.. 

సూర్యాపేటలోని కొన్ని రెస్టారెంట్లు, బేకరీల్లో తనిఖీలు చేపట్టాం. వాటిలో కుళ్లిన చికెన్, కాలం చెల్లిన ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించాం. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్​కు పంపించాం. రిపోర్ట్ రాగానే వాటిపై చర్యలు తీసుకుంటాం. – జ్యోతిర్మయి, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్