కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ 50 మందికి అస్వస్థత

  •    నర్సాపూర్​, నిర్మల్​దవాఖానలకు తరలింపు
  •     పాచిపోయిన భోజనం పెడుతున్నారని పేరెంట్స్​ఆగ్రహం
  •     ఇద్దరిని విధుల నుంచి తొలగించిన అధికారులు

నిర్మల్/ నర్సాపూర్ (జి) వెలుగు:  నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని కేజీబీవీ గర్ల్స్​స్కూల్​లో ఫుడ్ పాయిజన్ తో 50 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ అధికారులు ఇద్దరిని విధుల నుంచి తొలగించారు. బుధవారం రాత్రి హాస్టల్​లో భోజనం చేసిన స్టూడెంట్లు ఒకరి తర్వాత ఒకరు వరుసగా వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో సిబ్బంది వెంటనే 22 మందిని నర్సాపూర్ (జి) దవాఖానకు, 28 మందిని నిర్మల్ జిల్లా హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారని, ఎవరికీ అపాయం లేదని డాక్టర్లు ప్రకటించారు. ఘటన గురించి బుధవారం రాత్రి స్టూడెంట్ల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంతో వారు గురువారం ఉదయం తెలుసుకుని హాస్పిటల్స్​కు వచ్చారు.

వారు మాట్లాడుతూ తమ పిల్లలకు రెండు మూడు రోజుల పాచిపోయిన భోజనం పెడుతున్నారని, హాస్టల్​కిచెన్ లో ఎలుకలు, పందికొక్కులు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటికి కూడా తిప్పలు పడుతున్నారన్నారు. ఘటన జరిగిన వెంటనే తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న పిల్లలను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ ఆశిష్​ సాంగ్వాన్, రావుల రామనాథ్, డీఈవో రవీందర్ రెడ్డి పరామర్శించారు. నర్సాపూర్ దవాఖానలో పిల్లలను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీహరి రావు, ఆర్డీవో రత్నకుమారి పరామర్శించారు. ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్కకు ఫోన్ చేసిన శ్రీహరి రావు పరిస్థితిని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి స్కూల్ స్పెషల్ ఆఫీసర్ సునీత, హెడ్ కుక్ పద్మను విధుల నుంచి తొలగించినట్లు డీఈవో  రవీందర్ రెడ్డి  తెలిపారు.