మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కృష్ణాష్టమి రోజు ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 120 మంది అస్వస్థతకు గురయ్యారు. బుక్వీట్ పిండితో తయారు చేసిన పదార్థాలు తినడంతో మహిళలు, చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి మధుర జిల్లాలోని ఫరా పోలీస్ స్టేషన్ పరిధిలో గల పలు గ్రామాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు బుక్వీట్ పిండి సరఫరా చేసే ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేశారు. బాధితులు జన్మాష్టమి సందర్భంగా ఉపవాసం ఉన్నారు.
ఆలయంలో ఉపవాస దీక్ష విడుస్తూ బుక్వీట్ పిండితో తయారు చేసిన పూరీలు, పకోడి, వడలు తిన్నారు. దీంతో కొద్దిసేపటి తర్వాత కడుపులో మంట, వాంతులు, తల తిరగడం, వణుకు వంటి లక్షణాలు వారిలో కనిపించాయి. కొందరు స్పృహ కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ.. ఫరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్, జిల్లా ఆస్పత్రి నుంచి స్పెషల్టీంలను ఆయా గ్రామాలకు పంపించింది.
ముందుగా సీహెచ్‌సీలో చికిత్స అందించారు. ఆ తర్వాత బాధితుల సంఖ్య పెరగడంతో వారిని జిల్లా ఆస్పత్రితో పాటు బృందావన్‌లోని 100 పడకల కంబైన్డ్ ఆస్పత్రికి అలాగే, ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది పర్‌ఖామ్, బరోడా, మీర్జాపూర్, మఖ్దూమ్, ఖైరత్ గ్రామాలకు చెందినవారు ఉన్నారు. ఫరాలోని కిరాణా వ్యాపారుల వద్ద వారు ఈ పిండిని కొనుగోలు చేశారు. వారికి ఈ పిండి సప్లై చేసిన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు.