జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటుంటారు పెద్దలు. వాస్తవానికి జిహ్వకో రుచి ఉన్నట్టే ప్రాంతానికో రుచి కూడా ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన టేస్ట్‌కి అలవాటుపడతారు జనాలు. అలాంటి ప్రాంతీయ వంటకాలు అక్కడి కల్చర్, అక్కడ దొరికే కూరగాయలు, ఇంగ్రెడియెంట్స్ వల్ల పుట్టుకొస్తాయి.
అలాంటి స్పెషల్ ఫుడ్స్ మన దగ్గర ఎన్నో ఉన్నాయి. లక్నో చికెన్, ముంబయి చాట్, హైదరాబాద్ బిర్యానీ మన దగ్గరే కాదు అనేక దేశాల్లో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్న ఫుడ్స్ లిస్ట్‌లో చేరాయి. ఇలాంటివే ఈ ఏడాదికి ప్రపంచంలో బెస్ట్ ఫుడ్స్ అందిస్తున్న దేశాల్లో మన దేశాన్ని 11వ స్థానంలో నిలిపాయి.
మనిషి శరీరంలోని పళ్లు, జీర్ణ, కండర, అస్థి పంజర, రక్త ప్రసరణ వ్యవస్థలు, చేతులు, పాదాలు డెవలప్ అవడం వెనక ఆహారానిది ప్రధాన భూమిక. ఆది మానవుడు నాలుగు కాళ్ల జంతువు నుంచి రెండు కాళ్ల జీవిగా మారే క్రమంలో అందుకు తగ్గట్టు ఆహారపు అలవాట్లు, శరీరంలోపల జీవక్రియ వ్యవస్థలన్నీ ఏర్పడ్డాయని ఫిజియాలజిస్టులు చెప్తారు. ఫిజియాలజీ నుంచి జియాలజీకి వస్తే... భూమధ్య రేఖ ప్రాంతంలో, కర్కాటక–మకర రేఖలకు అవతలివైపు ఉన్న ప్రాంతంలో ధృవ మండలాల్లోని శీతల ప్రాంతాల్లో ఉన్న మనుషులు అక్కడి చల్లటి వాతావరణ పరిస్థితులకు తగిన ఆహారపు అలవాట్లు చేసుకున్నారు.
ముఖ్యంగా భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండే వాళ్లు ఎండ తీవ్రతని తట్టుకోగలిగేలా శరీరాన్ని, శరీరంలోని జీవక్రియ వ్యవస్థలను చల్లపరిచే ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలాగే మంచు ప్రాంతాల్లో ఉండే వాళ్లు శరీరంలో ఉష్ణోగ్రతని పెంచే ఫుడ్తినడం మొదలుపెట్టారు. సమశీతోష్ణ మండల ప్రాంతంలో ఉండే వాళ్లు అక్కడి పరిస్థితులకి తగిన ఆహారాన్ని తిన్నారు. అందుకే ‘‘ప్రపంచ మానవ నాగరికత ప్రస్థానం అంతా ఆహార ప్రస్థానమే” అని కొందరు చెప్తారు. మానవ పరిణామ క్రమాన్ని పర్యావరణ, భౌగోళిక, నైసర్గికంగా చూస్తే... ఆయా కాలాల్లో, ప్రాంతాల్లో, దేశాల్లోని ఆహారపు అలవాట్లు కూడా ఎంత కీలకంగా ఉన్నాయో అర్థమవుతుంది.