విషాహారం నేల నుంచి నోటిదాకా.. అన్నింటా రసాయన అవశేషాలే

పండించే నేల..తినే ఆహారం..నిల్వ చేసే పద్ధతులు.. అన్నింటా రసాయన అవశేషాలే కనిపిస్తున్నాయి. ‘ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అన్నట్టు’ ఏది తినాలన్నా.. ‘ఎందులో ఏ రసాయనం​ ఉందో?’ అని ఆలోచించాల్సి వస్తోంది. అంతగా కలవరపెడుతున్న సమస్య ఇది. మొన్నటి వరకు ‘ప్యాకేజ్డ్​ ఫుడ్​లో కెమికల్స్ ఉంటాయి. అందుకే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు’ అనుకునేవాళ్లు. ఆ విషయం తెలిసినప్పటికీ పూర్తిగా ప్యాకేజ్డ్ ఫుడ్​ను తినడం ఆపడంలేదు చాలామంది. దానివల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నా ఎక్కువమంది వినడంలేదు. 

ఇదే ఒక సమస్య అనుకుంటే మరో షాకింగ్​ న్యూస్​ తెరమీదకు వచ్చింది. అందరికీ తిండి పెట్టేందుకు అహర్నిశలు శ్రమించే రైతుకు పెద్ద కష్టం వచ్చిపడింది. అన్నదాత ఆరోగ్యం మీద పెస్టిసైడ్స్​ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. అసలు ఇంతలా పెస్టిసైడ్స్​ ఎందుకు వాడాల్సి వస్తోంది? పండించే పంట నుంచి ప్యాకేజ్డ్ ఫుడ్​ వరకు రసాయనాల జాడ ఉండాల్సిందేనా? అవి లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినలేమా?

రా మయ్యకు వ్యవసాయం చేయడమంటే చాలా ఇష్టం. తనకున్న నాలుగెకరాల పొలాన్ని ఎంతో అపురూపంగా సాగు చేసుకుంటాడు. ఆ పంటమీద వచ్చిన ఆదాయంతో బిడ్డల్ని సెటిల్ చేశాడు.  నమ్ముకున్న పనే చేసుకుంటూ జీవితాన్ని గడపాలనుకునే రామయ్య.. ఊరు విడిచి ఎక్కడికీ వెళ్లడు. ఇన్నాళ్లు అన్నం పెట్టిన నేలను విడిచి వెళ్లడానికి ఇష్టపడడు. అందుకే బిడ్డలు తమ దగ్గరే ఉండమన్నా ఒప్పుకోడు. అలాంటి రామయ్యకు అనుకోని కష్టం వచ్చింది. ఒకసారి తన బిడ్డల్ని చూసొద్దామని సిటీకి వెళ్లాడు. మాటల్లో మాటగా ‘ఈ మధ్య ఆయాసంగా ఉంటోంది. 

మునుపటిలా పొలం పనులు చేయలేకపోతున్నా. ఒకసారి హాస్పిటల్​లో చూపించ’మని కొడుకుని అడిగాడు. మరుసటి రోజు రామయ్య కొడుకుతో కలిసి హాస్పిటల్​కి వెళ్లాడు. అక్కడ టెస్ట్​లన్నీ చేశారు. ఆయన ఆయాసానికి కారణం పెస్టిసైడ్స్ అన్నారు. అది విని తండ్రీకొడుకులిద్దరూ షాకయ్యారు. ఆ తర్వాత ‘రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ ఉంటున్నా’యనే వార్తలు చదివాక గానీ ఆ విషయాన్ని నమ్మలేదు వాళ్లు.ఇలాంటివి ఒకటిరెండు కాదు.. మన రాష్ట్రంలోనే వందల సంఖ్యలో ఉన్నాయట! అదే.. దేశవ్యాప్తంగా చూస్తే ఆ సంఖ్య వేలల్లో ఉంటుంది అంటున్నారు సైంటిస్ట్​లు. 

వ్యవసాయానికి సాయంగా.. రసాయనం!

ఎంత చదువుకున్నప్పటికీ గ్రామాల్లో వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఎక్కువ. అలాగని ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయలేకనో, వ్యాపారాలు పెట్టి లాభాలు గడించలేకనో కాదు.. తరతరాలుగా వస్తోన్న వ్యవసాయాన్ని వదులుకోలేక. లాభమైనా, నష్టమైనా ‘మన నేల’ అనే మమకారంతో జీవిస్తున్నారు చాలామంది రైతులు. నలుగురికీ తిండి పెట్టగలిగే అవకాశం ఉన్నప్పుడు వేరే ఆలోచనలు ఎందుకు? అంటారు వాళ్లు. 

అందుకే రాత్రి, పగలు అని తేడాలేకుండా ఒళ్లొంచి కష్టపడతారు రైతులు. నేలలో వేసిన విత్తనాలన్నీ మొక్కలుగా మారాలని కోరుకుంటాడు రైతు. పంట చేతికి వచ్చేవరకు రక్షించుకోవడం ఎంత కష్టమో ఆ రైతుకే తెలుసు. ఎందుకంటే మొక్క ఎదిగేటప్పుడు  కీటకాలు, చీడపురుగులు, తెగుళ్లు వంటివి వస్తాయి. వాటివల్ల పంట దెబ్బతింటుంది. అందుకే ఎంత కష్టపడైనా పంటను కాపాడాల నుకుంటాడు రైతు. 

ఆ కాపాడుకునే క్రమంలో రకరకాల పద్ధతుల మీద ఆధారపడాల్సి ఉంటుంది. వాటిలో ఆగ్రో కెమికల్స్ ఒకటి. అందులో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియెంట్స్ వంటివి ఉంటాయి. పంట మీద దాడిచేసే పురుగుల్ని చంపేందుకు రకరకాల పెస్టిసైడ్స్ ఉన్నాయి. అయితే ఆ పురుగుమందుల వల్ల పంటకు కలిగే లాభం గురించే ఆలోచిస్తారు తప్ప పరోక్షంగా తమకు జరిగే నష్టం గురించి ఆలోచించడంలేదు రైతులు. ఆలోచించడం లేదు అనేకంటే కూడా అవగాహన ఉండడం లేదని చెప్పొచ్చు. పురుగు మందులు వాడేటప్పుడు ఎలాంటి సేఫ్టీ మెజర్స్​ తీసుకోవాలో కూడా చాలామంది రైతులకు అవగాహన ఉండదు. ఆ కారణాల వల్ల దీర్ఘకాలంలో రైతులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. పంటకు మేలు కోసం రసాయనం వాడితే... మొదటికే మోసం అన్న చందాన తయారైంది పరిస్థితి. 

మన రాష్ట్రంలో... 

పంటలకు వాడే పెస్టిసైడ్స్ వాడకం ఏయేటికాయేడు పెరుగుతూపోతోంది. వాటివాడకం వల్ల రైతుల ఆరోగ్యం దెబ్బతింటోంది. పురుగుమందుల వాడకంతో ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులతోపాటు స్కిన్ అలర్జీస్, అల్జీమర్స్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులబారిన రైతులు పడుతున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్​ఐఎన్), ఉస్మానియా బయోకెమిస్ట్రీ డిపార్ట్​మెంట్​ సైంటిస్ట్​లు చేసిన రీసెర్చ్​లో తేలింది. ఈ స్టడీలో భాగంగా రైతుల రక్తం, మూత్రాలను టెస్ట్​ చేశారు. ఆ నమూనాల్లో పదుల సంఖ్యలో వ్యాధుల బారిన పడే లక్షణాలు ఉన్నట్టు తేలింది.

 ఈ రీసెర్చ్​ ఆర్టికల్​ డచ్ అకడమిక్ పబ్లిషింగ్ కంపెనీ ‘ఎల్సెవియర్’ అనే మ్యాగజైన్​లో పబ్లిష్​ అయింది. తెలంగాణ రాష్ట్రంలో చేసిన స్టడీలో భాగంగా వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 493 మంది రైతుల బ్లడ్, యూరిన్ శాంపిల్స్​ టెస్ట్ చేశారు. వీళ్లలో పురుగు మందుల ప్రభావానికి గురైన గ్రూప్​కు చెందిన 341 మంది రైతులు, ఎఫెక్ట్ కాని వాళ్లు152 మంది రైతులు ఉన్నారు. ఈ స్టడీ 2021 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ మధ్య చేశారు. ఒక్కో జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేశారు. కనీసం ఒక ఏడాది కాలం పెస్టిసైడ్స్ పిచికారీ చేసిన వరి, పత్తి, ఇతర పంటలు పండించే రైతుల శాంపిల్స్ మాత్రమే తీసుకున్నారు. వాళ్లలో18 ఏండ్ల నుంచి 70 ఏండ్ల మధ్య వయసుగల రైతులు ఉన్నారు.

ఊపిరాడట్లేదని...

వరల్డ్​ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్​ఒ) మార్గదర్శకాల ప్రకారం అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన11 రకాల పెస్టిసైడ్స్​తో సహా 28 రకాల వేర్వేరు పురుగుమందు అవశేషాలను రైతుల రక్త నమూనాల్లో గుర్తించారు. వాటిలో కౌమఫాస్, ఫెనామీఫాస్, డిక్లోర్వోస్, మెతామిడోఫాస్, మోనోక్రోటోఫాస్, ట్రయజోఫాస్ ఉన్నాయి. పురుగుమందులు వాడని, వాటి ఎఫెక్ట్ కాని రైతుల బ్లడ్ శాంపిల్స్​తో పోలిస్తే.. పురుగుమందుల పిచికారీ చేసే రైతుల బ్లడ్ శాంపిల్స్​లో పెస్టిసైడ్స్​ అవశేషాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. 

పురుగుమందులను పిచికారీ చేసినప్పుడు ఎదురయ్యే సమస్యలపై రైతులను అడిగితే..  ఊపిరి సరిగా ఆడకపోవడం, ఛాతిలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు ఉంటున్నాయని కొందరు చెప్పారు. మరికొందరు కంట్లో దురద, కోపం, కళ్లు మసకబారడం, తలనొప్పి, తలతిరగడం, నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పడం, తిమ్మిరి, కండరాల బలహీనత వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.

ఎక్కువగా ఆ పంటలకే..

మన రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి, ఇతర పంటలకు చీడపీడలు ఎక్కువ. దాంతో పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారు. పంట దిగుబడి, లాభాలు పెంచుకునేందుకు వాణిజ్య పంటలను సాగు చేస్తూ, వాటి మీద మోతాదుకు మించి పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. పెస్టిసైడ్స్​ ఎక్కువగా వాడడం వల్ల వచ్చే నష్టాల గురించి పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన సేఫ్టీ పద్ధతుల గురించి రైతులకు తగినంత అవగాహన లేదని ఆ స్టడీ చెప్తోంది.  గ్లౌస్​లు వేసుకోకుండా నేరుగా చేతులతో పురుగుమందులను కలపడం, సేఫ్టీ లేని పద్ధతిలో నిల్వ చేయడం, ఎక్కడపడితే అక్కడ పెస్టిసైడ్స్ పడేస్తున్నారు. పురుగుమందుల పిచికారీ సమయంలో చర్మం, ఊపిరితిత్తుల మీద ఎటువంటి ప్రభావం పడకుండా ఉండాలంటే పర్సనల్ సేఫ్టీ డివైజ్​లు వాడాలి. అలాగే, పెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గించేందుకు బయో పెస్టిసైడ్స్, నాణ్యమైన విత్తనాలతో పాటు ఇంటిగ్రేటెడ్ పెస్ట్​ మేనేజ్​మెంట్ పద్ధతులు పాటించాలని రీసెర్చ్ టీం హెచ్చరించింది.

ఆ రైతుకేం తెలుసు?

ఒకప్పుడు వ్యవసాయం చేసినవాళ్లలో చాలామంది చదువుకున్న వాళ్లు కాదు. అందుకని వాడుతున్న పురుగుమందుల మీద సరైన అవగాహన ఉండదు. ఏ పంటకు ఏ మందు పనికొస్తుంది? ఎప్పుడు మందు కొట్టాలి? వంటి విషయాలు మాత్రమే  తెలుస్తాయి. వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ మందుల డబ్బాలపై  జాగ్రత్తలు రాసి ఉన్నా చదవలేరు. చదివినా పాటించరు. కారణం... సేఫ్టీ మెజర్స్​ తీసుకోకపోవడం వల్ల జరిగే నష్టం గురించి అవగాహన తక్కువ ఉండడం లేదా ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం వల్ల రసాయనాలకు ఎక్స్​పోజ్​ అవుతున్నారు. 

పెస్టిపైడ్స్​ ఎఫెక్ట్​ వెంటనే ఆరోగ్యం మీద చూపించకపోవడం వల్ల కూడా అవి వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం గురించి పట్టించుకోరు ఎక్కువమంది. వాటి ప్రభావం ఎప్పటికో చాలా కాలం తరువాత ఉంటుంది. అప్పుడు జబ్బు చేశాక టెస్ట్​ల్లో వచ్చే రిపోర్ట్​లు చూశాక కానీ అనారోగ్యానికి కారణం రసాయనాలు అని తెలియడంలేదు.

ఒకప్పటిలా పంట కోసం ఎదురు చూసే టైం ఇప్పుడు లేదు. విత్తనాలు వేయగానే పంట చేతికి రావాలి అన్నట్టు ఉంది పరిస్థితి. దాంతో పొలంలో విత్తనాలు నాటింది మొదలు పంట చేతికొచ్చేవరకు రసాయన ఎరువులు వాడుతున్నారు. రసాయనాలు లేని మందులు షాపుల్లో కూడా దొరకట్లేదు. దాంతో చేసేదేమీ లేక వాటినే తెచ్చుకుంటున్నారు. పురుగు చావడానికి, మొక్క ఏపుగా పెరగడానికి అని అడ్వర్టైజ్​మెంట్లలో చూపించే హానికర ఎరువులు వాడుతున్నారు. పంట బాగా రావాలనే కోరికతో టీవీ, పేపర్ యాడ్స్, సేల్స్ రిప్రజెంటేటివ్స్​ మాటలు నమ్మి ఆ మందుల్ని కొంటున్నారు, వాడుతున్నారు.

పరిస్థితుల ప్రభావం

పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఏదైనా పని జరుగుతుంది. వ్యవసాయానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కరువుకాటకాలు, పంట దెబ్బ తినడం, తరుచుగా జరిగే పంటనష్టాలు ఉంటూనే ఉంటాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950 – 51నాటికి 51 మిలియన్ టన్నులుగా ఉంటే 2021 – 22 నాటికి 314 మిలియన్ టన్నులుగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇండియా ఎదుర్కొన్న సవాళ్లు మరో ఎత్తు. ఇండియాలో వ్యవసాయం చేయాలంటే విత్తనాల నుంచి మార్కెట్ వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్లోబల్​గా 60 రకాల నేలలు ఉంటే... అందులో 46 రకాలు ఇండియాలో ఉన్నాయి. దాంతోపాటు15 రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి.

ఇవన్నీ పక్కన పెడితే.. ఈ పంటలు పండించడానికి రైతులు వాడే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ రెండు రకాల రసాయనాలు మోడర్న్​ అగ్రికల్చర్​లో భాగంగా పంట నష్టం రాకుండా ఉండేందుకు, పంట దిగుబడి ఎక్కువ రావడం కోసం వాడతారు. వీటివల్ల ఎక్కువ పంట చేతికొస్తుంది. క్వాలిటీ బాగుంటుంది. పెస్టిసైడ్స్​లో ఇన్​సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్ వంటివి ఉంటాయి. 

అవి కలుపు, చీడపురుగుల్ని నాశనం చేస్తాయి. పంట దిగుబడి పెరిగేందుకు ఉపయోగపడతాయి. ఈ కారణంగానే వాటిని వాడుతున్నారు. అయితే, ఇండియాలో వాడే పెస్టిసైడ్స్​లో ఇన్​సెక్టిసైడ్స్ ఉంటాయి. అయినప్పటికీ దేశంలో ఒక్క శాతం మాత్రమే పెస్టిసైడ్స్ వాడుతున్నారు. దాదాపు 58,160 మిలియన్ టన్నుల పెస్టిసైడ్స్ వాడినట్లు 2018 రిపోర్ట్​ చెప్తోంది.  

ఇండియాలో అప్పుడు మొదలైంది

ఇండియాలో1952లో పెస్టిసైడ్ ప్రొడక్షన్ మొదలైంది. దాంతోపాటు బెంజీన్ హెగ్జాక్లోరైడ్, డీడీటీ. పెస్టిసైడ్స్​ని తయారుచేసే దేశాల్లో ఇండియా రెండో అతిపెద్ద తయారీదారు. పెస్టిసైడ్స్ తయారుచేయడమనేది చాలాకాలంపాటు కొనసాగుతుంది.1998 నాటికి అది102, 240 మిలియన్ టన్నులకు పెరిగింది. రిజిస్ట్రేషన్ అయిన పెస్టిసైడ్స్ 145 రకాల ఇన్​సెక్టిసైడ్స్ ఉన్నాయి. ఆసియాలోనే ఏడాదికి 90 వేల మిలియన్ టన్నుల పెస్టిసైడ్స్ ఉత్పత్తి చేస్తోంది ఇండియా. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పెస్టిసైడ్స్ తయారు చేసే దేశాల్లో12వ స్థానం మన దేశానిది. 

2022–23 ఏడాదికిగానూ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ 58.4%. మొత్తం వాడకం 57.9 శాతం. దిగుమతులు 35.9 శాతంగా ఉంది. ఇండియాలో పెస్టిసైడ్స్​ను ఐదు రకాలుగా విడదీశారు. అందులో అగ్రికల్చర్, పెస్టిసైడ్స్. వీటిలో పెస్ట్స్, ఫంగిసైడ్స్, ఇన్​సెక్టిసైడ్స్, హెర్బిసైడ్స్, రొడెంటిసైడ్స్. ఉదాహరణకు.. ఫంగిసైడ్స్ ఫంగైని, ఇన్​సెక్టిసైడ్స్ కీటకాలను, హెర్బిసైడ్స్ కలుపును నాశనం చేస్తాయి. మార్కెట్​ షేర్​లో ఇన్​ సెక్టిసైడ్స్ వాటా 60 శాతం. ఫంగిసైడ్స్18 శాతం, హెర్బిసైడ్స్ 16 శాతం, మిగతావి 6 శాతం.
 
బయో పెస్టిసైడ్స్ 

ఇవి నాన్​ టాక్సిక్ నేచర్​ కలిగి ఉంటాయి. కానీ వీటికి మార్కెట్ తక్కువ. 1999 – 2000 నాటికి ఇన్​సెక్టిసైడ్స్ వాడకం చూస్తే 60 శాతం ఉంది. ఫంగిసైడ్స్ 21 శాతం, హెర్బిసైడ్స్ 14 శాతం, మిగతావి 5 శాతం ఉంటాయి.  

ఎదుర్కోవాల్సిన సవాళ్లు

చీడపురుగుల్ని నాశనం చేసేందుకు పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్​ని కనిపెడితే... అవి ఫుడ్​ ప్రొడక్షన్​ని పెంచాయి. దాంతోపాటు ప్రొడక్షన్​లో తిరుగులేని విజయాలు చూశాయి. అయితే అవి నేలను నిస్సారం చేయడం, ఆరోగ్యం మీద దెబ్బకొట్టడం, పర్యావరణ కాలుష్యం... ఒక్కమాటలో చెప్పాలంటే ​కాలుష్యం అనేది అంతటా జరిగింది. ఏడాదికి దాదాపు 5,3 బిలియన్ టన్నుల నేల నిస్సారమైపోతోంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం.. చీడపురుగులు, కలుపు, తెగుళ్ల వల్ల 40 శాతం పంటనష్టం జరుగుతోంది. కోత కోశాక 6 నుంచి 7 శాతం నష్టం ఉంటోంది. 

భూమి తరిగిపోతోంది

ఇండియాలో ఎక్కువగా సారవంతమైన పంటభూమి ప్రతి ఏటా తరిగిపోతుంది. ఇదేదో నోటి లెక్కల మీద చెప్తున్న మాట కాదు సెంట్రల్ సాయిల్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్​ (సిఎస్​డబ్ల్యూసిఆర్​టీఐ) చెప్పింది.  దాదాపు 5,334 మిలియన్​ టన్నుల నేల నిస్సారమవుతోంది. అందుకు కారణం, ఫెర్టిలైజర్స్, ఇన్​సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్. 2000 ఏండ్లకు10 సెంటిమీటర్ల సారవంతమైన నేల ఉత్పత్తి అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో నేల నిస్సారానికి పెస్టిసైడ్స్ కారణం అవుతున్నాయి. జనాభా, ఉత్పత్తి కేంద్రాలు, సప్లయ్ చెయిన్ ప్రాసెస్, రైతులు, వర్కర్లు దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. 

పెస్టిసైడ్స్​ వల్ల ఇండియాలో వార్షిక పంట దిగుబడి నష్టం ఎక్కువగా ఉంటోంది. ఆ నష్టం విలువ అమెరికన్ డాలర్లలో 42 .66 మిలియన్లు. అంటే అక్షరాలా రూపాయల్లో నాలుగు కోట్ల, 26 లక్షల, 60 వేల రూపాయలు అన్నమాట!  పెస్టిసైడ్స్ అనేవి 0.1 శాతం మాత్రమే వాటి టార్గెట్స్ మీద పనిచేస్తున్నాయి. మిగతాది వాతావరణంలో కలిసిపోయి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. నేలను పాడుచేస్తున్నాయి. ఇదేకాకుండా కలుపు, తెగుళ్లు, కీటకాలు, పక్షులు, పందులు, ఎలుకలు, పందికొక్కుల వంటివాటివల్ల ఇండియాలో దాదాపు ఏటా ఆరు వేల కోట్లకు పైగా పంట నష్టం జరుగుతోంది. 

నీరు కూడా కలుషితం...

గ్లోబల్​గా నీటి వాడకం 70 శాతం. ఇండియాలో 91 శాతం నీళ్లు అగ్రికల్చర్​ సెక్టార్​లో వాడుతున్నారు. అయితే ఆ నీరు కలుషితం కావడం వల్ల చాలా ప్రభావం ఉంటోంది. నీళ్లలో ఆగ్రో కెమికల్స్, ఆర్గానిక్ మ్యాటర్, మందుల అవశేషాలు, రాళ్లు రప్పలు, ఉప్పు నీటి డ్రైనేజీ వంటివి ఉంటున్నాయి. అలాంటి కలుషిత నీరు ఎకోసిస్టమ్​, మనుషుల ఆరోగ్యం మీద దెబ్బ తీస్తోంది. మరీ ముఖ్యంగా చిన్న, సన్న కారు రైతులు నీటివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు.

లోపాల వల్ల..

రైతులు వాడే మందు డబ్బాల మీద అవి వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటివల్ల కలిగే ప్రభావం వంటి వివరాలు ఉంటాయి. ఆ సమాచారం స్థానిక భాషలో ఉండాలనే రూల్ కూడా ఉంది. కానీ, భాష వేరుగా ఉంటుంది. పైగా చదవడానికి వీల్లేకుండా చిన్న సైజులో అక్షరాలుంటాయి. ఇది చాలా పెద్ద లోపం. మరొక విషయం ఏంటంటే.. ప్రత్యేకంగా ఆ పంటకు ఏ రసాయనం? ఎంత మోతాదులో వాడాలి? అనే లెక్క ఉంటుంది. 

ఒకవేళ మోతాదు సరిగా తీసుకున్నా.. నాలుగురకాల మందులు వాడితే.. అవన్నీ కలిసినప్పుడు ఆయా మందుల తాలూకు అవశేషాలు పెరిగిపోతాయి. ఇలా మనం వండుకునే ఒక కాయగూరకి వాడిన మందుల అవశేషాల లెక్క చూస్తే కళ్లు తిరిగిపడిపోవాల్సిందే. వాటివల్లే రైతులు అనారోగ్యం బారిన పడుతున్నారు. వాటివల్ల మరణాలు కూడా జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రతి ఏటా యాక్సిడెంటల్ సూసైడ్ డెత్స్​ అని రిపోర్ట్​ ఇస్తుంది. అందులో ప్రతి ఏటా ఇండియాలో పెస్టిసైడ్ పాయిజన్​ వల్ల చనిపోయేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

అంతా రసాయనమయం

పండించేటప్పుడు పురుగుమందులు వాడకుండా ఉంటే సరిపోతుంది. అప్పుడే రసాయనాల బారిన పడకుండా ఉండొచ్చు. అవును నిజమే. కెమికల్స్ వాడకుండా పంట పండిస్తే మేలు జరుగుతుంది. కానీ, అది కొంతవరకే! ఎందుకంటే రసాయనం అనేది ఇక్కడా.. అక్కడా అని కాదు అన్ని చోట్లా ఉంటోంది. అదెలాగంటే.. మారుతున్న కాలంతోపాటు ఫుడ్ తయారీ, అలవాట్లలో మార్పులొచ్చాయి.

 ఎక్కువ టైం వంటకు పెట్టకుండా ఉండాలని స్పీడ్​గా వంటపని పూర్తి చేసేందుకు ప్యాకేజ్డ్​ ఫుడ్​ మీద డిపెండ్​ అవుతున్నారు. కానీ జరగబోయే నష్టాన్ని గుర్తించలేకపోతున్నారు. అనారోగ్యాల బారిన పడుతున్నారు. దాంతో రసాయనాల బారిన పడ్డ రైతుల ఆరోగ్య పరిస్థితి ఎలాగైతే తయారైందో అలానే ప్యాకేజ్డ్​ ఫుడ్​ తిన్న వాళ్ల పరిస్థితి తయారవుతోంది!

చదువుకునే పిల్లల నుంచి ఉద్యోగాలు చేసేవాళ్లవరకు.. అందరూ ప్యాకేజ్డ్​ ఫుడ్​కి అలవాటు పడ్డారు. దానిమీద ఆధారపడుతున్నారు. అందుకు సుమిత్ బెస్ట్​ ఎగ్జాంపుల్​. పై చదువుల కోసం సుమిత్​ సిటీకి వెళ్లాడు. అక్కడ హాస్టల్​ ఫుడ్ నచ్చక ఫుడ్​ ఆర్డర్లు పెట్టుకుని తినేవాడు. కొన్ని రోజుల తరువాత రూం అద్దెకు తీసుకుని ఫ్రెండ్స్​తో కలిసి ఉండేవాడు. అప్పుడు కూడా వండుకుని తినడం తక్కువ. ప్యాక్ చేసిన ఫుడ్​ తెచ్చుకుని వేడి చేసుకుని తినడం ఈజీగా అనిపించింది. అలా కొన్నాళ్లు బాగానే గడిచింది. ఒకరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. 

టెస్ట్​లు చేశాక తెలిసిందేంటంటే.. రసాయనాలు వాడిన ఫుడ్ ఎక్కువగా తినడం వల్లే హెల్త్​ పాడైనట్లు చెప్పారు డాక్టర్లు. సుమిత్ లాంటి వాళ్లు సిటీలో ఎక్కువమందే కనిపిస్తారు. అయితే, ఇది సిటీలో మాత్రమే ఎదురయ్యే సమస్య అనుకుంటే పొరపాటు. ఊళ్లలో ఉండేవాళ్లు కూడా ప్యాకేజ్డ్​ ఫుడ్​ బాగానే తింటున్నారు. వాళ్లకు తెలియకుండానే ఎన్నో రకాల రసాయనాలను కడుపులోకి పంపుతున్నారు. అనారోగ్యాన్ని ‘కొని’తెచ్చుకుంటున్నారు.

3,600లకు పైనే...

ఫుడ్ ప్యాకేజింగ్​ లేదా తయారీలో వాడే 3,600లకు పైగా రసాయనాలను మనుషుల శరీరాల్లో గుర్తించినట్టు ఎక్స్​పోజర్​ సైన్స్ అండ్​ ఎన్విరాన్​మెంటల్​ ఎపిడెమియాలజీ జర్నల్​లో పబ్లిష్ అయ్యింది. ఈ స్టడీని లీడ్ చేసిన బిర్గిట్ గుయెకా మాట్లాడుతూ ‘‘దాదాపు వంద రకాల హానికర రసాయనాలు ఉన్నాయి. వాటిలో పీఎఫ్ఏఎస్​, బిస్ఫెనాల్ ఎ లాంటి బ్యాన్​ అయిన వాటి లిస్ట్​లో ఉన్న కెమికల్స్ కూడా కనిపించాయి. 

పీఎఫ్​ఏఎస్​ రసాయనాలు అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ఫుడ్ ఐటమ్స్ ఎక్కువసేపు ప్యాక్​ చేసి ఉంచొద్దు. ప్యాకేజ్డ్​ ఫుడ్​ని వేడి చేయొద్దు. గతంలో దాదాపు14 వేల ఫుడ్ కాంటాక్ట్ కెమికల్స్​ను గుర్తించారు. వివిధ రకాల ప్యాకేజింగ్ పదార్థాలు, వంటపాత్రల నుంచి ఆహారం​లో కలిసిపోయే లక్షణాలు ఉన్నాయి వాటికి. ఈ మధ్య కనుగొన్న 3,600 రసాయనాలు ఫుడ్​ ప్యాకేజింగ్​ ద్వారానే శరీరంలోకి వెళ్లాయనేది మాత్రం ఇప్పుడు చేసిన స్టడీ తేల్చలేకపోయింది. అందుకు కారణాలు ఇతరత్రా ఏవైనా ఉండొచ్చు” అన్నారు.

అన్నింటా కెమికల్స్

కడుపుకింత తిండి ఉంటే చాలు హాయిగా బతకొచ్చు అనుకునేవాళ్లు ఒకప్పుడు. కానీ, ఇప్పుడు ఏది తింటే ఏమవుతుందోనని భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకు కారణం రసాయనాల్లో మునిగితేలుతున్న ఫుడ్​. రుచిగా ఉండడం కోసం కొన్ని, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని మరికొన్ని రసాయనాలు వాడుతున్నారు. నిజానికి పెద్ద కంపెనీల్లోనే రసాయనాల వాడకం  ఎక్కువగా జరుగుతుంది. 

ఎక్కువ మొత్తంలో ఫుడ్ ప్రొడక్ట్స్ తయారుచేయడమే అందుకు కారణం. పైగా షాపులకు సరఫరా చేయక ముందునుంచే వాళ్ల దగ్గర స్టాక్​ ఉంటుంది. షాపులకు వచ్చాక మరికొన్ని రోజులు, ఇంటికి తెచ్చుకున్నాక ఇంకొన్ని రోజులు గడిచిపోతాయి. అన్ని రోజుల తర్వాత వాటిని తినడం ప్రమాదం! ప్రతి వస్తువు మీద ఎక్స్​పైరీ డేట్ చూసి కొనాలి. దాంతో పాటు అందులో వాడే పదార్థాల వివరాలు తెలుసుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం.

రసాయన కల్తీ జరుగుతుందా?

కల్తీలో రకాలున్నాయి. ఒకటి.. ప్రొడక్షన్​లో సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల లేదా పండించే భూమి, వాడే నీళ్లు, చల్లే పురుగుల మందులు వాడడం వల్ల ఫుడ్ కలుషితం అవ్వొచ్చు. రెండోది.. రంగు, రుచి, నిల్వ చేయడం కోసం రసాయనాలు కలపడం. ఇది కూడా కల్తీనే. ​అందుకే ప్రాసెసింగ్ యూనిట్​ని కూడా చెక్ చేస్తారు ఫుడ్​ సేఫ్టీ అధికారులు. ఎక్కడి నుంచి కొంటున్నారు? ఎలా స్టోర్​​ చేస్తున్నారు? ఏం వాడుతున్నారు? వంటివి చూస్తారు. ఎందుకంటే స్టోరేజ్​లో కూడా కెమికల్స్ వాడకూడదు. 

ఇలా వెరిఫై చేసి, సర్టిఫై చేసేందుకు మనదేశంలో రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్. దీన్నే ఇండియా ఆర్గానిక్ స్టాండర్డ్స్ అంటారు. ‘ఎపిడా’ అనే అగ్రి ప్రొడక్ట్ ఫుడ్ డెవలప్​మెంట్ అథారిటీ. ఈ అథారిటీ అప్రూవ్ చేసిన ఏజెన్సీలు కొన్ని ఉంటాయి. వాళ్లు వెరిఫై చేసి సర్టిఫికెట్ ఇస్తారు. రెండోది పీజీఏ (పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టమ్) ఇది నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్ ఇస్తుంది. ఇది గ్రూప్ సర్టిఫికేషన్. అంటే.. కొందరు రైతులు ఆర్గానిక్ ఫామింగ్ చేసేందుకు ఒక గ్రూప్​గా ఏర్పడతారు. ఆ గ్రూప్​లో ఒక్కరు ఫెయిల్ అయినా, గ్రూప్​ మొత్తం ఫెయిల్ అయినట్టే. సర్టిఫికేషన్ ఇచ్చేవాళ్లు ఏడాదికొకసారే వచ్చి పరిశీలిస్తారు. మిగతా అంతా ఆ గ్రూప్​దే బాధ్యత. 

ఆర్గానిక్ అయినా కాకపోయినా ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి. ప్యాక్ మీద ఇంగ్రెడియెంట్ లిస్ట్, ప్రొసీజర్, లేబుల్, నెంబర్ ఉంటాయి. నెంబర్ ఆధారంగా ప్రొడక్ట్ వివరాలు తెలుసుకోవచ్చు. లేబుల్​లో కూడా మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని రెగ్యులర్​గా ఎఫ్​.ఎస్​.ఎస్.ఎ.ఐ. వెరిఫై చేస్తుంది. రెస్టారెంట్స్, హోటల్స్, రిటెయిల్ షాప్స్.. ఏవైనా సరే వెరిఫై చేస్తారు. 

లైసెన్స్​ కోసం అప్లై చేసినప్పుడు శాంపిల్స్ చెక్ చేస్తారు. ఆర్గానిక్ పంట అయితే ప్రతి ఏడాది చెక్ చేస్తారు. ఏడాది చివర్లో శాంపిల్స్ టెస్ట్ చేస్తారు. మూడేండ్ల కిందటి రసాయనాలు ఉన్నా ఆ టెస్ట్​లో బయటపడతాయి. ఆ తర్వాత ఇతర ప్రదేశాలకు పంపాలన్నప్పుడు స్టోర్ చేయాల్సివస్తే ధాన్యాలను కోల్డ్ స్టోరేజ్​లో పెడతారు. దానివల్ల పురుగుపట్టదు, ప్రొడక్ట్ పాడవదు. గాలి ఆడకుండా ప్యాక్ చేస్తే పాడవకుండా ఉంటాయి. వెజిటబుల్స్ అయితే మూడు రోజులకంటే ఎక్కువ రోజులు తాజాగా ఉండవు. 

ఆర్గానిక్  పర్వాలేదు! 

కొందరు ప్రాసెస్ మొత్తంలో కెమికల్స్​ వాడి, ప్రొడక్ట్ పూర్తయ్యాక వాటి ప్యాకింగ్​లో ‘ఆర్గానిక్​’ అని  లేబుల్ అంటిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్​మెంట్​ చేసిన స్టడీల్లో వెల్లడైంది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్​లో సింథటిక్ కెమికల్స్, జన్యు మార్పిడి పంటలు, ఇండస్ట్రియల్ లేదా మెటల్ వేస్ట్ కలిసిన కలుషితమైన నీళ్లు వాడకూడదు. వీటికంటే ముందు పండించే నేలకి ప్రాధాన్యత ఇవ్వాలి. పైన చెప్పిన కలుషితాలన్నీ నేలలోకే వెళ్తాయి. కాబట్టి నేల రసాయన రహితంగా ఉండాలి. అందుకోసం ఐదారేండ్లుగా కెమికల్స్ వాడకుండా, నేలను సురక్షితంగా, సారవంతంగా ఉంచితేనే ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్​కు అనుమతిస్తారు. 

మనదేశంలో ఆర్గానిక్ ప్రొడక్షన్​ చేయాలనుకుంటే కచ్చితంగా సర్టిఫికెట్ ఉండాలి. ఆ సర్టిఫికెట్స్​ని ఆర్గానిక్ ఏజెన్సీలు ఇస్తాయి. రైతులు నేరుగా అమ్ముకుంటే సర్టిఫికెట్ అవసరం లేదు. అది కూడా ఏడాదికి వాళ్ల ఆదాయం12లక్షలలోపు ఉంటేనే ఈ రూల్ వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువైతే మాత్రం రైతులు కూడా సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఇక కొనేవాళ్లు కూడా ఆర్గానిక్​ సర్టిఫైడా? కాదా? అని తప్పక చూడాలి. 95శాతం ఆర్గానిక్ సోర్స్ నుంచి వచ్చినవైతేనే ఆర్గానిక్ అని లేబుల్ వేస్తారు. అంతకంటే తక్కువ ఉంటే లేబుల్ వెయ్యరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

 ఒకదాన్నుంచి మరో దానికి

పొలాల్లో చల్లే మందులు.. వర్షం నీటిలో కలిసిపోయి వాగులో చేరతాయి. ఆ నీళ్లు తాగే నీటిగా సరఫరా అవుతుంది. నీళ్లు కలుషితం అయితే వనరులన్నీ పాడయినట్టే. ఎందుకంటే ఆ నీళ్లలో చేపలు ఉంటాయి. వాటిని తినడం వల్ల ఆ రసాయనాలు మనుషుల శరీరంలోకి చేరతాయి. అలాగే జంతువులు కూడా మొక్కలు తింటాయి. వాటి నుంచి వచ్చే పాలలో రసాయన అవశేషాలు ఉంటాయి. అవి కూడా మనుషుల్లోకి రసాయనాలు చేర్చే వాహకాలు అవుతాయి. అంతేకాదు.. పురుగుమందుల వాడకం వల్ల పాలపిట్ట, ఊరపిచ్చుకల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది.  

మందులు వాడడం వల్ల చనిపోయిన పురుగుల్ని అవి తినడం వల్ల అవి  చ నిపోతున్నాయి. చనిపోయిన జంతుజాతులను తినే రాబందులు కూడా చచ్చిపోతున్నాయి. రాబందులు లేకపోవడం వల్ల చనిపోయాక కుళ్లిపోయేటప్పుడు విడుదలయ్యే వాయువులు, సూక్ష్మజీవుల వల్ల కూడా మనుషులు చనిపోతున్నారని ఈ మధ్య ఒక స్టడీ చెప్పింది. పర్యావరణంలో ఒకదాని ప్రభావం మరోదాని మీద పడుతుంది. ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. అయితే ఈ సమస్య ఇండియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాల్లో పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ నేరుగా ఎఫెక్ట్​ అయ్యేవాళ్లు తక్కువ. విదేశాల్లో గట్టి నియమనిబంధనలు ఉంటాయి. అందుకే చాలాసార్లు మన ప్రొడక్ట్స్ రిజెక్ట్ అయ్యాయి అనే వార్తలు వింటుంటాం.

వాడేది ఒక్క శాతమే!

ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు మిలియన్ల మెట్రిక్ టన్నుల పెస్టిసైడ్స్ వాడుతున్నారని తెలిసింది. మనదేశం ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. గ్లోబల్​గా చూస్తే ఇండియా1 శాతం మాత్రమే పెస్టిసైడ్స్ వాడుతోంది. గ్రీన్ రివల్యూషన్ తర్వాత రసాయన పెస్టిసైడ్స్ వాడకం బాగా పెరిగింది. అది దీర్ఘకాలం​లో వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. అంతేకాకుండా ఫుడ్​ చెయిన్​లోకి కూడా వస్తుంది. అక్కడి నుంచి ఆరోగ్యం, అభివృద్ధి మీద ప్రభావం పడుతుంది. ‘‘అగ్రికల్చర్​ ప్రొడక్షన్​కి పెస్టిసైడ్స్ వాడకం అవసరమైనదిగానే కనిపిస్తుంది’’ అని రీసెంట్​ రీసెర్చ్​ చెప్తోంది. ఈ స్టడీలో చిన్న, సన్నకారు రైతులే లక్ష్యంగా... వాళ్లు పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఎలా వాడుతున్నారనే విషయమై రీసెర్చ్ చేశారు. 

కెమికల్స్ డెవలప్​మెంట్

పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడడానికి గల కారణం పంట ఎక్కువ మొత్తంలో కావాలనుకోవడమే. అందుకే అలాంటి వెరైటీల విత్తనాలకు, ఫర్టిలైజర్స్​ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ రసాయనాల వాడకం అనేది ప్లాంట్ బయో డైవర్సిటీతో పాటు వాతావరణ కాలుష్యం, నీటి నాణ్యత తగ్గిపోతుంది. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది.

  • ఇండియాలో 1956 –57 నాటికి ఫెర్టిలైజర్స్ వాడకం ఒక హెక్టార్​కి1.0 కేజీ ఉంది. 1984- 85 నాటికి 46.4 కేజీలకు పెరిగింది.   అదే కాలం​లో డై అమ్మోనియం  ఫాస్పేట్ (డిఎపి) వాడకం కూడా101, 91 మిలియన్ టన్నుల నుంచి105, 31 మిలియన్‌ టన్నులకు చేరింది. 
  • మ్యూరియేట్ ఆఫ్​ పొటాష్​ (ఎంఓపీ) లేదా పొటాషియం క్లోరైడ్ 30, 29 (2011 –22)మిలియన్ టన్నుల నుంచి 16, 32 (2022–23) మిలియన్ టన్నులకు తగ్గిపోసాగింది. 
  • ఆగ్రో కెమికల్స్ వాడకం 2020 –21 నాటికి 62, 192.63మిలియన్ టన్నులుగా ఉంది. 
  • ఫెర్టిలైజర్స్ వాడకం ఎక్కువగా తెలంగాణలో 1985 – 86 వరకు 0,24 మిలియన్ టన్నులు ఉండగా 2014–15 నాటికి 1,1 మిలియన్ టన్నులుగా ఉంది. 
  • ఎన్​పీకే (నైట్రోజన్, పాస్ఫరస్, పొటాషియం) 2015 నుంచి 2020 నాటికి ఒక హెక్టార్​కి 247.6 కేజీల నుంచి 256.6 కేజీల మధ్యలో ఉంది.
  • యూరియా వాడకం, 295,65 మిలియన్ టన్నులు (2011–12) నుంచి 357,25 మిలియన్ టన్నులు (2022–23) వరకు పెరిగింది. 

అవన్నీ చేశాకే తయారీ

ముడిసరుకు ఫ్యాక్టరీకి వచ్చాక, వాటి క్వాలిటీ చెక్​ చేయాలి. ఆ తర్వాత వాడిని వాడొచ్చో లేదో డిసైడ్ చేయాలి. వాటిలో ఇంకా ఏయే పదార్థాలు కలపొచ్చు, కలపకూడదు అనేది చూసుకోవాలి. ముడిసరుకులో రసాయనాల శాతం ఎక్కువగా ఉంటే అవి పూర్తిగా పోయేవరకు శుభ్రం చేయాలి. ఈ ప్రాసెస్​ అంతా చేశాకే ప్రొడక్ట్ తయారుచేయడం మొదలుపెట్టాలి.

 ఈ పనులన్నీ పద్ధతిగా జరిగితేనే అవి తినడానికి పనికొస్తాయి. అలాకాకుండా నామమాత్రంగా శుభ్రం చేసి, వాటితో తినుబండారాలను తయారుచేయడం వల్ల నష్టం జరుగుతుంది. ఉదాహరణకు.. ఐస్​ క్రీమ్స్​లో ఇథైల్ ఎసిటేట్, బ్యూట్రాల్డిహైడ్, ఎమిల్ ఎసిటేట్, నైట్రేట్, వాషింగ్ పౌడర్ వంటివి విరివిగా వాడుతున్నారు. ఇథైల్ ఎసిటేట్ వల్ల లంగ్స్, కిడ్నీలు, హార్ట్​కు సంబంధించిన వ్యాధులొస్తాయి.

పదేండ్ల నుంచి..

పురుగుమందుల వాడకం 2004కి ముందు బాగా పెరిగింది. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయని వార్తలొచ్చాయి. పురుగుమందులు చల్లుతూ చనిపోయే రైతుల సంఖ్య తెలంగాణలో ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత 2004 నుంచి 2010 వరకు  పురుగుమందుల వాడకం తగ్గిందని ఒక ట్రెండ్ నడిచింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ప్రాంతాల్లో క్యాంపెయిన్​లు జరిగాయి. 

ప్రభుత్వ లెక్కల ప్రకారం 50 శాతం పురుగుమందుల వాడకం తగ్గింది. పురుగుమందులు వాడకుండా మేనేజ్ చేసే పద్ధతుల గురించి రైతులకు శిక్షణ ఇచ్చారు. దాంతోపాటు సేంద్రియపద్ధతులు నేర్పించారు. అప్పట్లో పురుగుమందులు పూర్తిగా మానేసిన ఖమ్మం జిల్లాలోని పునుకుల, ​వరంగల్ జిల్లాలో ఎనబావి గ్రామాలు పెస్టిసైడ్​ ఫ్రీగా ఉన్నాయి. కాకపోతే గత పదేండ్ల నుంచి పురుగుమందుల వాడకం మళ్లీ పెరిగింది. ఇంతకుముందు కంటే ఇప్పుడు కలుపు మందుల వాడకం కూడా పెరిగింది. 

2014 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మహిళా కిసాన్​ సశక్తికరణ్ ​పరియోజన (ఎంకేఎస్​కేపీ) అనే స్కీమ్ తీసుకొచ్చింది. మహిళా రైతులు పురుగుమందులు వాడకుండా పంటలు పండించే విధంగా ఎంకరేజ్ చేశారు. అయితే ఆంధ్రా వాళ్లు వరి, పత్తి పంటలవైపు మొగ్గుచూపారు. ఈ పంటలకు ఫర్టిలైజర్స్ వాడకం పెరిగింది. పంట విస్తీర్ణం పెరిగేకొద్దీ కలుపు, పురుగుమందుల వాడకం పెరుగుతూ పోయింది. 

ఏ పంటలు పండించాలి? ఎలాంటి మందులు వాడాలనేది? వాళ్ల ఇష్టం. కాబట్టి దాన్ని ఆపలేకపోయారు. అయితే ఈ ప్రాంతాల్లో మందులు అమ్మేవాళ్లు..‘ రైతులు సరైన జాగ్రత్తలు పాటించట్లేద’ని చెప్తున్నారు. అయితే జాగ్రత్తలు పాటించినా సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పురుగుమందులు అనేవి నేరుగా ప్రభావం చూపించకపోయినా కొంతకాలం తరువాత కనిపిస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వాటి ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది.

ప్యాకేజ్డ్​ ఫుడ్​లో..

గతంలో హైదరాబాద్​లో చదువుకునే పిల్లల యూరిన్ శాంపిల్స్ టెస్ట్ చేస్తే.. పెస్టిసైడ్ అవశేషాలు కనిపించాయి. వాళ్లు తినే ఫుడ్​ అందుకు కారణం. పెస్టిసైడ్స్ చల్లేటప్పుడు నేరు​గా ఎఫెక్ట్ అయ్యేది రైతులు అయితే.. ఆ పంటను తింటున్న మనం పరోక్షంగా ఎఫెక్ట్ అవుతున్నాం. దీనికి కారణం..  ముడిసరుకులో ఉన్నదే ఫైనల్ ప్రొడక్ట్​లో కూడా కనిపిస్తుంది. అందుకు కారణం కెమికల్స్​లో రెండు రకాలుంటాయి. అవి సిస్టమిక్, కాంటాక్ట్. సిస్టమిక్​ కెమికల్స్​ ఎక్కువగా వాడుతున్నారు. అవి మొక్కంతా ఉంటాయి. తరువాత ఫుడ్​లోకి వచ్చేస్తాయి. 

అదే కాంటాక్ట్ కెమికల్స్ అయితే ఒక పొర మీదే ఉంటాయి. ఉదాహరణకు పొట్టు, తొక్క తీసే పదార్థాలు. ఎంత శుభ్రం చేసినా వాటి అవశేషాలు ఎక్కడికీ పోవు. అంతేకాకుండా ప్రభావం తగ్గిపోయాక ప్రమాదం లేదనుకుంటారు. కానీ, రసాయనం అనేది ఏదైనా పూర్తిగా నశించదు. శుభ్రం చేస్తే అది ముక్కలుముక్కలుగా అవుతుంది అంతే. అవి ప్రమాదకరంగా మారొచ్చు. 

కానీ, అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలియదు. ఒక్కోసారి అది ఇంకా విషపూరితం అయ్యే అవకాశం ఉంది. వాటిపై రీసెర్చ్​లు సరిగా జరగలేదు. ఏదేమైనా ఈ రసాయన సమస్య నుంచి బయటపడాలంటే పెస్టిసైడ్స్ వాడకపోవడాన్ని మించిన పరిష్కారం లేదు.  ‘సేఫ్​గా వాడుకుంటాం’ అంటే కుదరదు. అందుకని రసాయనాల వాడకం మానేస్తే ఎలాంటి ప్రభావం ఉండదు. అందుకు ప్రభుత్వాల సపోర్ట్​ చాలా అవసరం.

- డా.జీవీ రామాంజనేయులు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్

మనీష పరిమి