రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోతే శరీర బరువు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ప్రతిరోజూ నిద్రాభంగం కలిగితే శరీర సమతౌల్యం దెబ్బతింటుంది. ఇది నేరుగా శరీర బరువుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి హాయిగా పడుకోవాలంటే కొన్ని పద్ధతులు కూడా పాటించాలి. `జీవ గడియారం ప్రకారం వెలుగు, చీకటి నిద్రను నియంత్రించే కారకాలు. ఈ మధ్య 'అమెరికన్ జర్నల్స్ ఆఫ్ ఎపిడెర్మాలజీ చేసిన పరిశోధనల ప్రకారం.. చిన్న లైట్ నిద్రను మాత్రమే కాకుండా శరీర బరువును కూడా ప్రభావితం చేస్తుందని తెలిసింది. కాబట్టి పడుకునే సమయంలో గదిలోని లైట్లు, కిటికీలను మూసి వేయాలి..
సరైన ఆహారం
రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్ర పట్టాలంటే ముఖ్యంగా తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారం తీసుకోవటం. వల్ల జీర్ణక్రియ, జీవక్రియలు ఆరోగ్యకర స్థాయిలో జరుగుతాయి. రాత్రి ఆలస్యంగా తినడం లేదంటే స్నాక్స్ తీసుకోవడం వల్ల ఈ ప్రక్రియలకు ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి రాత్రిళ్లు ఏడు లేదా ఎనిమిది గంటలలోపు ఆహారం తీసుకోవడం మంచిది.
బిగుతైన దుస్తులు వద్దు
పడుకునే సమయంలో వేసుకునే బట్టలు కూడా శరీర బరువును ప్రభావితం చేస్తాయి. టైట్గా ఉండే దుస్తులు శరీర ఉష్ణోగ్రతలను పెంచి... 'మెలటోనిన్' హార్మోన్ స్థాయిలను తగ్గిస్తాయి.
వ్యాయామాలు
వ్యాయామాల వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. అయితే, తీవ్రమైన వ్యాయామాలు(కార్డియో) లాంటివి పడుకునే ముందు చేస్తే సరైన నిద్ర పట్టదు. పైగా శరీర ఉష్ణోగ్రత పెరగటం వల్ల హార్మోన్ల విడుదలలో అంతరాయాలు ఏర్పడతాయి. దీంతో నిద్రాభంగంతో పాటూ శరీర బరువు కూడా పెరుగుతుంది.
మెలటోనిన్ హార్మోన్ అనేది ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. నిద్రాభంగం కావడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. కాబట్టి పడుకునే ముందు బిగుతుగా ఉండే డ్రెస్లు కాకుండా.. వదులుగా ఉండేవి వేసుకోవాలి.:
ఎక్కువ సేపు మెలకువగా ఉంటే
చాలా మంది అన్ని పనులు పూర్తి చేసుకొని పడుకుంటారు. ఇది మంచి పనే. కానీ, ప్రతి రోజు ఆలస్యంగా పడుకోవడం అలవాటైతే శరీర బరువు పెరుగుతుంది. దీంతోపాటు రాత్రిళ్లు ఎక్కువగా తినడం కూడా ఇబ్బందే. ప్రతి రోజు పదకొండు గంటల లోపు అన్ని పనులు పూర్తయ్యేలా చూసుకోవాలి.
అతి నిద్రతో అనర్థం
ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం, నిద్ర వల్ల శరీరం పునరుత్తేజం చెందుతుంది. కణజాలానికి కొత్త శక్తి వస్తుంది. హాయిగా నిద్రపోతే తర్వాత రోజు ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ప్రతి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. అయితే, కొంత మంది రోజుకు ఎనిమిది గంటల కన్నా ఎక్కువ సమయం నిద్రపోతారు. ఇలా అతిగా నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అతి నిద్రపై కొన్ని అధ్యయనాలు కూడా చేశారు. రోజుకు ఎనిమిది గంటల కన్నా ఎక్కువగా నిద్రపోయే వాళ్లకు డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు వస్తాయని తెలిసింది. అంతేకాదు బద్ధకం పెరిగి.. నీరసంగా ఉంటారట. బరువు పెరిగే ప్రమాదమూ ఉంది. కాబట్టి సరిగ్గా నిద్ర లేకపోయినా, అతిగా నిద్రపోయినా అనారోగ్యం తప్పదు.
గది వేడిగా ఉండటం
పడుకున్నపుడు శరీరం చల్లబడుతుంది. ఆపై కొవ్వును కరిగించే హార్మోను విడుదలవుతాయి. గది వేడిగా ఉండటం వలన శరీరం చల్లబడే ప్రక్రియకు భంగం కలుగుతుంది. కాబట్టి గది చల్లగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా నిద్ర కోసం ప్రణాళికలు వేసుకోవాలి. పెద్ద వాళ్లు ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలి. చిన్నపిల్లలు తొమ్మిది నుంచి పది గంటలు పడుకోవచ్చు.