మీ పనిలో ప్రొడక్టివిటీ బాగుండాలి అంటే... మీ కంటే తక్కువ ప్రొడక్టివిటీ కలిగిన వాళ్లను గమనించాలి. ఇలా ఎందుకంటే వాళ్లు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో తెలిస్తే. ఆ తప్పులు చేయకుండా మీ ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. నిజానికి ఫైనాన్షియల్ బ్లాగ్స్ చాలావరకు కాంటెంపొరరీ సీఈఓల పని అలవాట్ల గురించి ఇంటర్వ్యూ చేస్తుంటాయి. అయితే వాళ్లు చెప్పే అంశాలు సామాన్యులకు స్ఫూర్తినివ్వవు. ఎందుకంటే వాళ్లలో చాలామంది ‘మెడిటేషన్ చేస్తాం. ఇ–మెయిల్స్ చూడం. వాటికి రిప్లయ్ ఇవ్వం. అవే మా విజయానికి కారణం’ అని చెప్తుంటారు.
కానీ సామాన్యుల జీవితాల్లో ఇలా ఉండడం సాధ్యమవుతుందా? ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసేంత టైం దొరకదు. ఎవరి ఇ–మెయిల్స్ వాళ్లే చూసుకోవాలి. అంతేకానీ ఇ–మెయిల్స్ చూసి, వాటికి రిప్లయ్ ఇచ్చేందుకు అసిస్టెంట్లు ఉండరు. ‘మరయితే ప్రొడక్టివిటీ పెంచుకునే సజెషన్స్ చెప్పి, మాలో స్ఫూర్తి కలిగేదెలా?’ అంటున్నారా. అందుకు ఉపయోగపడేదే ఐవీ లీ మెథడ్. దీన్ని మోడర్న్ పబ్లిక్ రిలేషన్ ఫౌండర్ ఐవీ లీ అనే అమెరికన్ తయారుచేశాడు. ఈ మోడల్ తయారుచేసి వందేండ్లు అయినప్పటికీ ఇప్పటికీ లైవ్‌గానే ఉంది. ఇకముందు కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇన్నేండ్లయినా యాక్టివ్‌గా పనిచేస్తున్న ఆ ప్రొడక్టివిటీ టూల్‌ని ఆయన పేరుతోనే పిలుస్తారు. ఐవీ లీ పద్ధతి ఫాలో అయితే వర్క్ ప్రొడక్టివిటీ పెరగడం ఖాయం.
ఐవీ లీ పద్ధతి ఏంటి?
నా జీవితంలో ఏదైనా భిన్నంగా చేయాలి. అది అద్భుతంగా ఉండాలి. నా పేరు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. కానీ, ప్రతిరోజు షార్ట్ టర్మ్ గోల్స్ పూర్తిచేయడంతోనే టైం అయిపోతుంది అనిపిస్తుంది. కానీ ఐవీ లీ మాత్రం ఆ పనులన్నింటినీ మేనేజ్ చేశాడు. పెద్ద బిజినెస్‌లు సక్సెస్ సాధించేందుకు, ఎక్కువ ప్రొడక్టివిటీ కోసం 1920ల్లో ఒక పద్ధతి కనుగొన్నాడు. ఇందులో చేయాల్సిందల్లా చేయాల్సిన పనుల లిస్ట్‌ను వాటి ప్రాధాన్యతలను బట్టి రాసుకోవాలి. ఆ లిస్ట్‌లో ఉన్న పనులు పూర్తయ్యేవరకు వాటిని వదిలేయకుండా ఉండాలి.
ఇలా వాడాలి
ఈ పద్ధతి అంత కష్టమైనది కూడా కాదు. వర్కింగ్ డే అయిపోయేటప్పుడు రేపు చేయాల్సిన ఆరు టాస్క్‌ల లిస్ట్ రాయాలి. ఇది చదివాక వారానికి ఐదు రోజులు పనిచేసే వాళ్లు ‘శని, ఆదివారాలు సెలవులు కాబట్టి శుక్రవారం లిస్ట్ చేయాల్సిన పనిలేదు’ అనుకోవచ్చు. కానీ అలా పనిచేసేవాళ్లు సోమవారం రోజు చేయాల్సిన ఆరు టాస్క్‌ల లిస్ట్ శుక్రవారం రాయాలి. ఐవీ లీ ప్రకారం వారాంతాలు అంటే శని, ఆదివారాల బ్రేక్ తప్పనిసరి. అప్పుడే ఆ తరువాత చేసే పనిలో ప్రొడక్టివిటీ బాగుంటుంది అనేది ఆయన సిద్ధాంతం.
అయితే అందులో కేవలం ఆరు టాస్క్‌లు మాత్రమే రాయాలి. అంతకంటే ఎక్కువ రాయొద్దు. అలాగే సాధ్యమైన పనులని మాత్రమే లిస్ట్‌లో చేర్చుకోవాలి. అంతేకానీ ఎప్పటికీ పూర్తికాని లక్ష్యాలు పెట్టుకుని, వాటిని లిస్ట్‌లో చేర్చడం వల్ల లాభం ఉండదు. లిస్ట్ రాసుకున్న తరువాత వాటి ప్రాధాన్యతల బట్టి పని మొదలుపెట్టాలి. ముందు ఏ పని చేయాలి? అది ఎంత అత్యవసరం? అనేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్లడమే.
మరుసటిరోజు ఉదయం, అంతకుముందు రోజు రాసుకున్న లిస్ట్ బట్టి పనులు మొదలుపెట్టాలి. మొదటి టాస్క్‌తో పూర్తయ్యాకే రెండో టాస్క్ తీసుకోవాలి. అలా ఆ రోజు ఆఫీసు టైం అయ్యే వరకు ఒకదాని తరువాత ఒకటి టాస్క్ పూర్తి చేయాలి. ఒకే పని లేదా ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఫలితం బాగుంటుంది. ఆ రోజు పూర్తయ్యాక లిస్ట్‌లో చేసుకున్న పనులేవైనా మిగిలిపోతే... వాటిని మరుసటి రోజు చేయాల్సిన పనుల లిస్ట్‌లో చేర్చాలి. వాటితో పాటు కొత్త టాస్క్‌లు చేర్చుకోవాలి. అయినా లిస్ట్ మాత్రం ఆరుకి మించకూడదు.
టాస్క్‌ల్లో ఒకదాని బదులు ఒకటి చేసినప్పటికీ అవి పూర్తి కావడం అనేది ముఖ్యం. ఒక పనిని పార్ట్స్‌గా చేసి పని పూర్తిచేయొచ్చు. ఉదాహరణకి క్వార్టర్ రిపోర్ట్ రాసేటప్పుడు దాన్ని చిన్న భాగాలుగా విభజించాలి. డాటా తీసుకుని దాన్ని విశ్లేషించి రిపోర్ట్ రాయడం ఒక పని. దాన్ని ప్రెజెంటేషన్‌గా తయారుచేయడం అనేది మరో టాస్క్. దీన్ని ప్లానర్, డిజిటల్ నోట్ లేదా క్యాలెండర్‌గా చేయొచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ టాస్క్‌లు పెట్టుకోవద్దు. వాటి ప్రాధాన్యతలను బట్టి లిస్ట్ చేయాలి. ఒకవేళ ఆ టాస్క్‌లు పూర్తికాకపోతే వాటిని వదిలేయొద్దు. మరుసటి రోజుకి ఆ టాస్క్‌ని రోల్ ఓవర్ చేయాలి. కొత్తరోజుకి కలుస్తున్న కొత్త టాస్క్‌లతో పాటు పాత వాటిని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు కూడా చేయాల్సిన పనుల లిస్ట్ మాత్రం ఆరుకి మించొద్దు.అయితే ఈ సూత్రం పనిలో ప్రొడక్టివిటీకే కాదు. వ్యక్తిగతంగా జీవితంలో ఎదగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా చేసుకుంటూ పోవడం వల్ల కళ్లముందు కనిపించే పనులు లేదా సమస్యలు భూతాల్లా భయపెట్టవు.
పబ్లిసిటీ ఎక్స్పర్ట్
ఐవీ లెడ్బెట్టర్ లీ అమెరికన్ పబ్లిసిటీ ఎక్స్పర్ట్, మోడర్న్ పబ్లిక్ రిలేషన్ ఫౌండర్. జులై 16, 1877లో పుట్టిన ఈయన నవంబర్ 9, 1934న న్యూయార్క్‌లో చనిపోయాడు. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. న్యూయార్క్ సిటీలో 1899 నుంచి 1903 వరకు న్యూస్‌పేపర్ రిపోర్టర్‌గా పనిచేశాడు. కోల్ మైనర్స్ గ్రూప్‌కి ప్రెస్ రిప్రజెంటేటివ్‌గా1906లో ఉన్నాడు. ఆ తరువాత 1912లో పెన్సిల్వేనియా రైల్రోడ్ కంపెనీని రిప్రజెంట్ చేయడం మొదలుపెట్టాడు.
ఆయన క్లయింట్లకు పబ్లిక్‌లో మంచి పేరు వచ్చేలా పనిచేసినందుకు ఇతని సర్వీస్‌లను అప్పట్లో చాలా మేజర్ కంపెనీలు తీసుకున్నాయి. 1917 వరకు ఐవీ దగ్గర పెద్ద క్లయింట్లు వచ్చారు. వాళ్లో రాకెఫెల్లర్ ఒకటి. రిపోర్టర్ల ప్రశ్నలకు ఐవీ లీ నిర్మొహమాటంగా జవాబు చెప్పేవాడు. అంతేకాకుండా కంపెనీ డెవలప్‌మెంట్స్‌లో వార్తలకు పనికొచ్చే విషయాలను రిపోర్టర్లకి తెలియజేసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ రెడ్ క్రాస్ లీ క్లయింట్ అయింది.