పల్లెల్లో ఫాగింగ్​ చేయట్లే.. గత ప్రభుత్వ హయాంలో నాసికరం మెషీన్ల కొనుగోలు

  • మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో మూలన పడ్డ యంత్రాలు
  • దోమల విజృంభణతో డెంగ్యూ, విష జ్వరాల బారిన పడుతున్న ప్రజలు

మహబూబ్​నగర్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్  మెషీన్లు మూలకుపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో వీటిని కొనుగోలు చేయగా, కనీసం రెండేండ్లు సర్వీస్​ కూడా పని చేయలేదు. రిపేర్లు చేయిద్దామన్నా.. మెకానిక్​లు దొరకడం లేదు. దీంతో గ్రామాల్లో వ్యాధుల సీజన్​ మొదలైనా.. ఫాగింగ్​ చేయలేని పరిస్థితి నెలకొంది. 

మూడేండ్ల కింద కొనుగోలు..

దోమల నివారణ కోసం ఉపయోగించే ఫాగింగ్​ మెషీన్ల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మహబూబ్​నగర్​ జిల్లాలోని కొందరు సర్పంచులు, ఆఫీసర్లు సిండికేట్​గా ఏర్పడి ఓ కాంట్రాక్టర్​ ద్వారా హైదరాబాద్​లోని రాణిగంజ్, బేగం బజార్, గుర్రంగూడ ప్రాంతాల్లో అగ్గువకు దొరికే ఫాగింగ్​ మెషీన్లను కొన్నట్లు తెలిసింది. ఇవి నాసిరకం కావడం, వారంటీ లేకపోవడంతో తెచ్చిన ఏడాదికే ఖరాబ్​ అయ్యాయి. వీటిని కాంట్రాక్టర్​ ద్వారా రూ.25 వేలు, రూ.30 వేలలోపే కొని.. ఒక్కో మెషీన్​ను రూ.55 వేలు, రూ.60 వేలకు కొన్నట్లు బిల్లులు కూడా తీసుకున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోని మక్తల్, ధన్వాడ, మాగనూరు, అడ్డాకుల, మిడ్జిల్, చిన్నచింతకుంట, దేవరకద్ర, నవాబ్​పేట, బాలానగర్, మూసాపేట, మాగనూరు, ఊట్కూరు తదితర మండలాల్లో ఫాగింగ్  చేయడం లేదు. మెషీన్లు పని చేస్తున్న చోట్ల మాత్రమే దోమల మందును పిచికారి చేయిస్తున్నారు. కొన్ని చోట్ల మెషీన్లు మంచిగానే పని చేస్తున్నా.. సిబ్బంది వీటిని వినియోగించేందుకు ముందుకు రావడం లేదు. మెషీన్లు పని చేయని చోట్ల ప్రజలు తమ ప్రాంతాల్లో దోమలు పెరిగాయని కంప్లైంట్​ చేస్తే.. మెషీన్లు అందుబాటులో ఉన్న జీపీలకు వెళ్లి వాటిని అద్దెకు తీసుకొచ్చి వాడుకుంటున్నారు.

మెకానిక్​లు వస్తలేరు..

మూలకు చేరిన మెషీన్లను రిపేర్లు చేయించడం పంచాయతీ సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. కంపెనీకి చెందినవి కాకపోవడంతో తరచూ మొరాయిస్తున్నాయి. వీటిని రిపేర్లు చేసే టెక్నిషీయన్లు స్థానికంగా దొరకడం లేదు. దీంతో మహబూబ్​నగర్, నారాయణపేట ప్రాంతాల నుంచి మెకానిక్​లను పిలిపించి, రిపేర్లు చేయిస్తున్నారు. అయితే రిపేర్లు చేసిన తర్వాత ఇవి ఆన్​ అయి, కొద్ది సేపటికే  మళ్లీ బంద్​ అవుతున్నాయి. వీటి ప్రాబ్లం ఏంటో టెక్నిషీయన్​లు కూడా కనుక్కోలేకపోతున్నారు. దీంతో పంచాయతీ సిబ్బంది మళ్లీ రిపేర్ల కోసం టెక్నిషీయన్లను పిలిపిస్తే వారు గ్రామాలకు రావడం లేదు. చేసేది లేక కొన్ని గ్రామ పంచాయతీల్లో సిబ్బంది రిపేర్లకు వచ్చిన మెషీన్​లను వదిలేసి, కొత్త వాటిని తెప్పించుకున్నారు. వాటితోనే గ్రామాల్లో వారానికి రెండు సార్లు ఫాగింగ్​ చేస్తుయిస్తున్నారు.

వణికిస్తున్న జ్వరాలు..

వర్షాకాలం కావడంతో సీజనల్​ వ్యాధులు ప్రబలుతున్నాయి. గత నెలలో దాదాపు 20 రోజుల పాటు ముసురు పట్టడంతో గ్రామాల్లో ఇండ్ల చుట్టు పక్కల ప్రాంతాలు చిత్తడి చిత్తడిగా మారాయి. కాలువలు కూడా నిండిపోయాయి. అయితే, వీటిని క్లీన్ చేయడం లేదు. ఫాగింగ్​ చేయడం కూడా మానేయడంతో దోమలు పెరిగాయి. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో 280కి పైగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్​ ఫీవర్​ కేసులు నమోదయ్యాయి. వైద్యాధికారులు ఇచ్చిన రిపోర్ట్​ ప్రకారం ఒక్క పాలమూరు జిల్లాలోనే ఈ మూడు వారాల్లో 37 డెంగ్యూ, 175 విష జ్వరాల కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా డెంగ్యూ లక్షణాలు బయట పడుతుండగా, పెద్దలు ఎక్కువగా విష జ్వరాల బారిన పడుతున్నారు.

విష జ్వరాలు వస్తున్నయ్..

మా ఊళ్లో ఇటీవల పడిన వర్షాలకు దోమలు పెరిగినయ్. విష జ్వరాలతో జనం బాధ పడుతున్నారు. ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు జ్వరంతో ఉన్నారు. పంచాయతీ సిబ్బందికి చెప్పినా, ఇంత వరకు ఫాగింగ్​ చేయలేదు. - సవారన్న, గడ్డంపల్లి, మక్తల్​ మండలం

దోమలతో తిప్పలు పడుతున్నం..

ఊర్లో దోమలు పెరిగి తిప్పలు పడుతున్నాం. పంచాయతీ సెక్రెటరీని ఫాగింగ్​  చేయించమని అడిగినా పట్టించుకుంటలేడు. గట్టిగా అడిగితే మెషీన్​ లేదు. ఖరాబ్​ అయ్యిందని చెబుతున్నాడు. ఊర్లో చాలా మంది చికెన్​ గున్యా, డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు.- రవీందర్ రెడ్డి, వెలుగొమ్ముల, మిడ్జిల్  మండలం