- వారం రోజుల్లో పరిష్కరించే ప్లాన్
- రోజువారీ సమీక్షతో స్పీడ్ పెంచిన కలెక్టర్
- జిల్లాలో 2,800 ఆర్జీలకు మోక్షం కలిగే చాన్స్
నిజామాబాద్, వెలుగు : మూడేండ్ల నుంచి రైతులను ఇబ్బంది పెడుతున్న ధరణి భూసమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్‌తో 82 రోజుల పాటు నిలిచిపోయిన అప్లికేషన్స్‌ను రెవెన్యూ ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్డర్స్‌తో జిల్లాలోని సుమారు 2,800 ఆర్జీలను పూర్తిగా సెటిల్ చేసే దిశగా యంత్రాంగం కదులుతోంది. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు గత నాలుగు రోజులుగా ఈ అంశంపైనే ఫోకస్ పెట్టి రోజువారి సమీక్షలు నిర్వహిస్తున్నారు.
స్పెషల్ డ్రైవ్‌తో 1,460 ఆర్జీల పరిష్కారం
జిల్లాలో 5.20 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 2,55,561 మంది రైతులు పెట్టుబడి సాయం పొందుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు 2017లో భూరికార్డుల అప్డేషన్ (ఎల్‌ఆర్‌యూపీ) ప్రొగ్రాం చేపట్టి అక్టోబర్ 2021లో ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. కొత్త పట్టాపాస్ పుస్తకాలు రైతులకు ఇచ్చి అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్‌ను తహసీల్దార్లకు అప్పగించింది. పంట పెట్టుబడి సహాయం అందజేయడానికి ధరణి రికార్డులను ప్రామాణికం చేసుకుంది. కొత్తగా అమలులోకి వచ్చిన ధరణితో వేలాది మంది రైతులకు కష్టాలు పెరిగాయి.
పట్టా భూములపై హక్కులు కోల్పోయే పరిస్థితి తలెత్తి ఆందోళన చెందారు. స్టేట్‌లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ధరణి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసింది. దీంతో ఫిబ్రవరి నెల నాటికి జిల్లాలో పెండింగ్ లో ఉన్న సుమారు 4,200 ఆర్జీలు సెటిల్ చేయడానికి స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. తహసీల్దార్, డీటీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో), ఆర్ఐ, సర్వేయర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌తో కూడిన టీం 1,460 ధరణి ఆర్జీలను పరిష్కరించింది. మిగితా వాటిని తేల్చే పనిలో యంత్రాంగం ఉండగా అంతలోనే పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ రావడంతో పక్కనబెట్టారు.
ఇప్పుడు మరోసారి
స్పెషల్ డ్రైవ్ తరువాత జిల్లాలో మిగిలిపోయిన సుమారు 3,800 ధరణి అప్లికేషన్లు పరిష్కరించడానికి ఇప్పుడు మరోసారి ఆఫీసర్లు రెడీ అయ్యారు. గతంలో ధరణి అప్లికేషన్లు కలెక్టర్ లాగిన్‌కే నేరుగా వెళ్లేవి. మారిన విధానంతో తహసీల్దార్ పరిధిలోనే చాలా వరకు సమస్యలు పరిష్కరించే వీలుంది. రైతు క్యాస్ట్, జెండర్, ఆధార్ లింక్, ఒకే చోట ఖాతాలు మెర్జ్ చేయొచ్చు. ఎకరం రూ.5 లక్షల లోపు వాల్యూగల భూమి ఆర్జీలు ఆర్డీవోల పరిధిలో, రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విలువగల భూ సమస్యలు మాత్రమే కలెక్టర్‌కు వెళ్లేలా ఏర్పాటు చేశారు.
రూ.50 లక్షలు దాటే ల్యాండ్ ఆర్జీలు సీసీఎల్ఏకు వెళ్తాయి. గవర్నమెంట్ ల్యాండ్ పట్టాభూమిగా మారినట్లయితే సీసీఎల్ఏ ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది. అక్కడి దాకా వెళ్లే అప్లికేషన్లు జిల్లా లో లేనందున అన్నింటి పరిష్కారం ఇక్కడే లభించనుంది. కోర్టు వివాదాలు వచ్చేవాటిని పక్కనబెట్టి మిగిలిన దరఖాస్తులంన్నింటినీ సెటిల్ చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. బోధన్, నిజామాబాద్ రూరల్, నవీపేట, ఇందల్వాయి మండలాలలో అప్లికేషన్లు అధికంగా ఉన్నందున వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. వారం తరువాత అపరిష్కృత ధరణి ధరఖాస్తులు ఏవీ ఉండొద్దనే టార్గెట్ పెట్టుకున్నారు.