నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ జాడలు..గ్రౌండ్​ వాటర్​లో 2 నుంచి 5 పీపీఎం ఫ్లోరిన్​ ఆనవాళ్లు

  • 10 మండలాల్లో మోతాదుకు మించి ఫ్లోరిన్​  అవశేషాలు ఉన్నట్లు వెల్లడి
  • పైలెట్ ప్రాజెక్టుగా మర్రిగూడ మండలంలో శాంపిల్స్  సేకరణ
  • గర్భిణుల్లోనూ ఫ్లోరోసిస్  లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు

నల్గొండ, వెలుగు:నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్  జాడలు బయటపడడం కలకలం రేపుతోంది. గ్రౌండ్  వాటర్ లో 10 మండలాల్లో మోతాదుకు మించి ఫ్లోరోసిస్  ఉన్నట్లు తేలడంతో జిల్లా అధికారులు అలర్ట్  అయ్యారు. జిల్లాలోని మర్రిగూడ మండలాన్ని పైలెట్  ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి గ్రామంలో సర్వే చేపట్టారు.  వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రజల శాంపిల్స్  సేకరించి టెస్టింగ్  కోసం ల్యాబ్ కు పంపిస్తున్నారు. మరోపక్క  గర్భిణుల్లోనూ ఫ్లోరిన్  లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. దీంతో వారి శాంపిల్స్  సేకరించే పనిలో మెడికల్​ డిపార్ట్​మెంట్  అధికారులు నిమగ్నమయ్యారు.

10 మండలాల్లో మోతాదుకు మించి..

నల్గొండ జిల్లాను రెండేండ్ల కింద ఫ్రీ ఫ్లోరైడ్  స్టేట్ గా ప్రకటించగా, తాజాగా జరిపిన సర్వేలో నీటిలో ఫ్లోరైడ్  లక్షణాలు ఉన్నట్లు మిషన్  భగిరథ అధికారులు గుర్తించారు. ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో బోరు బావుల నీటి శాంపిల్స్  టెస్టింగ్  చేయగా సాధారణ పరిమాణం కంటే ఎక్కువగా ఫ్లోరిన్  అవశేషాలు ఉన్నట్లు తేలింది. సాధారణంగా భూగర్భజలాల్లో 0.5 నుంచి 1పీపీఎం(పార్ట్  పర్  మిలియన్)గా నమోదు కావాల్సి ఉంటుంది.

దాదాపు 10 మండలాల్లో 2 పీపీఎం నుంచి 5 పీపీఎం వరకు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల నివేదికల ప్రకారం డిండి, దేవరకొండ, చింతపల్లి, నాంపల్లి, మర్రిగూడ, చండూరు, మునుగోడు, నారాయణపూర్, కానగల్, గుర్రంబోడు, నార్కెట్ పల్లి మండలాల్లోని భూగర్భ జలాల్లో 2 పీపీఎం నుంచి 5 పీపీఎం వరకు నమోదైనట్లు సమాచారం. 

పైలెట్  ప్రాజెక్టుగా మర్రిగూడ మండలం..

ఫ్లోరైడ్  కేసులు నమోదు కావడంతో కలెక్టర్  ఇలా త్రిపాఠి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. మర్రిగూడ మండలాన్ని పైలెట్  ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి ఇంటింటి ఫ్లోరైడ్  సర్వే చేపట్టారు. మండలంలోని ప్రతి ఇంటికి కుటుంబ సభ్యులందరికీ ఫ్లోరైడ్  పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్  ఆదేశాలతో మర్రిగూడ మండలంలో ఈ నెల 19 నుంచి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మర్రిగూడ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు ఫ్లోరోసిస్ పై ట్రైనింగ్  ఇచ్చారు. ఇంటింటి సర్వేతో పాటు అంగన్​వాడీ సెంటర్లలో చిన్నారులను పరీక్షలు నిర్వహించగా, చిన్న పిల్లల్లో  డెంటల్  ఫ్లోరోసిస్  ఉన్నట్లు  గుర్తించారు. మండలంలోని శివన్నగూడ, వట్టిపల్లి గ్రామపంచాయతీల్లో ఎక్కువగా ఫ్లోరోసిస్  లక్షణాలు నమోదయ్యాయి. మర్రిగూడ మండలంలోని 20 గ్రామపంచాయతీల్లోని 40 గ్రామాల్లో 970 కుటుంబాలు ఉండగా, 39,700 జనాభా ఉంది. ఇప్పటి వరకు మండలంలో 18,134 మందికి ఫ్లోరోసిస్  పరీక్షలు నిర్వహించారు. 

గర్భిణుల్లోనూ లక్షణాలు.. 

మర్రిగూడ మండలంలో నిర్వహిస్తున్న సర్వేలో గర్భిణుల్లోనూ ఫ్లోరోసిస్  లక్షణాలు బయటపడ్డాయి. గర్భిణుల యూరిన్  టెస్ట్ లో ఫ్లోరోసిస్  లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో, వైద్యాధికారులు శాంపిల్స్  నల్గొండ ల్యాబ్ కు పంపించారు. 79 మంది గర్భిణుల్లో 20 మంది శాంపిల్స్  సేకరించారు. 

సర్వే చేస్తున్నాం..


కలెక్టర్ ఆదేశాలతో మర్రిగూడ మండలాన్ని పైలెట్  ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి సర్వే చేస్తున్నాం. ఇప్పటి వరకు 50 శాతం సర్వే పూర్తయింది. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. గర్భిణుల నుంచి శాంపిల్స్  సేకరించాం. సర్వే పూర్తి కాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.శ్రీనివాస్, డీఎంహెచ్ వో, నల్గొండ