పెద్ద వానొస్తే కష్టమే.,. కామారెడ్డి పట్టణంలో రోడ్లపైనే వరద నీరు

  • అంతంత మాత్రంగానే వరద కాల్వలు, డ్రైనేజీలు
  • వర్షాకాలం రాకముందే పనులు చేపడితే మేలు

కామారెడ్డి, వెలుగు:  కామారెడ్డి జిల్లా  కేంద్రంలో  భారీ వర్షాలు కురిసినపుడు వరద నీరు వెళ్లడానికి సరైన డ్రైనేజీలు లేక రోడ్లపైనే చేరుతోంది.  దీంతో  ఏటా వర్షాకాలంలో  ఇబ్బందులు తప్పడం లేదు.   భారీ వర్షాలు పడినపుడు అధికారులు  తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు.  కామారెడ్డి టౌన్ లో  పూర్తి  స్థాయిలో శాశ్వత చర్యలు చేపట్టడం లేదు.  గతంలో  నిర్మించిన  వరద కాల్వలు పలు చోట్ల శిథిలమయ్యాయి.  మురుగుకాల్వల పై  కప్పుల నిర్మాణం చేపట్టక ప్రమాదకరంగా మారాయి.  మరో 10 రోజుల్లో వర్షాకాలం రానుండగా.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. 

లోతట్టు ప్రాంతాలు ఇవే.. 

టౌన్‌‌లో విద్యానగర్ కాలనీ,  ఎన్జీవోస్​కాలనీ,  బతుకమ్మకుంట, పంచముఖి హన్మాన్​ కాలనీ, గాంధీనగర్​, అయ్యప్పకాలనీ, రుక్మిణికుంట, శ్రీరాంనగర్​కాలనీ,  సైలాన్​బాబా కాలనీ, టీచర్స్​ కాలనీలు లోతట్టు ఏరియాలుగా ఉన్నాయి.   సిరిసిల్ల రోడ్డు, నిజాంసాగర్​రోడ్డు, స్టేషన్​ రోడ్డు లో కూడా వరద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది.  బతుకమ్మకుంట, గాంధీనగర్​, సిరిసిల్ల రోడ్డులోని కొంత ఏరియా,  నిజాంసాగర్​ రోడ్డు నుంచి చెరువు వైపు వరద కాల్వల నిర్మాణం చేపట్టారు.  11 కి.మీ. మేర వరద కాల్వలను రూ. 16.85 కోట్లతో నిర్మించారు.  కానీపూర్తి స్థాయిలో నిర్మాణాలు జరగకపోగా.. వరద నీటి ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

పరిస్థితి ఇది...

కామారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి హౌజింగ్ బోర్డు కాలనీ వరకు మెయిన్​ రోడ్డుకు ఇరు వైపులా  డ్రైనేజీతో పాటు, పుట్​పాత్​ల నిర్మాణం  6  సంవత్సరాల క్రితం చేపట్టారు.  ఏండ్లు గడుస్తున్నా ఈ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.  కొత్త బస్టాండు నుంచి మున్సిపల్​ ఆఫీసు వరకు నిర్మాణం చేపట్టారు. మిగతా పనుల్ని కాంట్రాక్టర్​ మధ్యలోనే వదిలేశారు. డిగ్రీ కాలేజీ, కాకతీయనగర్​, కొత్త బస్టాండ్ ఏరియా నుంచి వరద నీరు నిజాంసాగర్​ చౌరస్తా నుంచి హౌజింగ్​ బోర్డు వైపు వెళుతోంది. ఈ  మార్గంలో డ్రైనేజీ నిర్మాణాన్ని  మెయిన్​ రోడ్డు వెంట చేపట్టకుండా చౌరస్తా దగ్గరికి వచ్చిన తర్వాత విద్యానగర్​ కాలనీలోని ఓ రోడ్డు వైపు మలిపారు. దీంతో వర్షం పడితే  డీఎస్పీ ఆఫీసు ఎదురు రోడ్డులో ఇండ్లలో నీరు చేరి స్థానికులు అవస్థలు పడుతున్నారు.  

జన్మభూమి రోడ్డులో వరద నీరు 

జిల్లా కేంద్రంలోని స్టేషన్​ రోడ్డు,  ఇరు పక్కల డ్రైనేజీ వ్యవస్థ లేదు.  ఒక సైడ్​ దశాబ్ధాల క్రితం నిర్మించిన చిన్న డ్రైనేజీ ఉన్నప్పటికీ అది మూసుకుపోయింది.  వానాకాలంలో వరద నీరు రోడ్డుపైనే ప్రవహిస్తుంది.  రోడ్డుపైనే వరద నీళ్లు నిలిచి ఉండి వెహికిల్స్​ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.   2 వైపుల డ్రైనేజీ నిర్మించాలనే  ప్రపోజల్స్​ ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమవుతున్నాయి.    చెరువు ఏరియాలో నిర్మించిన వరద కాల్వపై కూడా పై కప్పు లేదు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని వరద నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.