వర్షం ఆగినా.. వరద వదలట్లే

  • మూడ్రోజులుగా నీటిలోనే బహదూర్​పల్లిలోని 90 విల్లాలు 
  • లబోదిబోమంటున్న శ్రీరామ్​అయోధ్య కమ్యూనిటీవాసులు 
  • నీట మునిగిన జవహర్​నగర్​పాపయ్యనగర్​ బస్తీలు

దుండిగల్/మేడ్చల్/జవహర్ నగర్/జీడిమెట్ల/ఘట్​కేసర్, వెలుగు:భారీ వర్షాలకు గ్రేటర్​పరిధిలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వర్షం ఆగిన 24 గంటలకు కూడా వరద నీరు వదలట్లేదు. వర్షపు నీరు వెళ్లే దారిలేక ఆయా కాలనీల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల ఇండ్లు, అపార్ట్​మెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరింది.

స్థానిక అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని జనం వాపోతున్నారు. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలన్నా, నిత్యవసరాలు తెచ్చుకోవాలన్నా కష్టంగా ఉందని, వెహికల్స్​వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

వరద ముంపులో 90 విల్లాలు

మూడు రోజుల భారీ వర్షానికి దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్​పల్లిలోని శ్రీరామ్స్ అయోధ్య కమ్యూనిటీలోని 90 విల్లాలను వరద నీరు చుట్టుముట్టింది. మంగళవారం ఉదయం వర్షం తెరిపిచ్చింది అనుకునేలోపు అర్ధరాత్రి టైంలో దంచికొట్టింది. దీంతో వరద ముంచెత్తింది. చాలా ఇండ్లలోకి నీరు చేరింది.

వెహికల్స్​నీట మునిగాయి. బహదూర్ పల్లిలోని ప్రైమార్క్ సంస్థ బాబాఖాన్ చెరువు అలుగు కాల్వపై విల్లాస్​నిర్మించి విక్రయించిందని, అందుకే వరద పోటెత్తుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.కోట్ల పెట్టి కొనుక్కున్న విల్లాల్లోకి నీరు చేరడంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత కురిసిన వర్షానికి బిక్కుబిక్కుమంటూ గడిపారు. 

మైసమ్మగూడలో సెల్లార్లలోకి వరద

మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని పాపయ్య నగర్ బస్తీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది. బియ్యం, ఇతర నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి. రోడ్లపై మోకాల్లోతున నీరు నిలిచింది. మేయర్ శాంతి కోటేశ్, కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి బుధవారం బాధితులను పరామర్శించారు.

పలు కుటుంబాలను ఇండ్లను ఖాళీ చేయించి, గవర్నమెంట్​స్కూల్ లో ఉంచారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని హాస్టళ్లు, అపార్ట్​మెంట్లు, రోడ్లను వర్షపు నీరు ముంచెత్తింది. పలు బిల్డింగ్స్​సెల్లార్లు వరద నీటితో నిండిపోయాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని, అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. 

బాక్స్​డ్రెయిన్​లేకనే ముంపు

నిజాంపేట కార్పొరేషన్​పరిధిలోని పాపాయి కుంట నుంచి సిరిబాలాజీ కాలనీ వరకు బీజేపీ నాయకులు బుధవారం వరద నీటిలో పర్యటించారు. శ్రీనివాస్​నగర్​కాలనీ వాసులతో కలిసి ముంపు తీవ్రతను పరిశీలించారు. వరుస వానలతో శ్రీనివాస్​నగర్​కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారని ఆకుల సతీశ్ తెలిపారు.

అంబీన్​చెరువులోకి వరద నీరు వెళ్లే మార్గం లేక కాలనీ మునుగుతోందని, బాక్స్​డ్రెయిన్​నిర్మిస్తే సమస్య తీరుతుందని పేర్కొన్నారు. ఎస్ఎన్డీపీ కింద రూ.2.20కోట్లు మంజూరైనా పనులు పూర్తిచేయలేకపోయారని మండిపడ్డారు. తురక చెరువు డ్రైనేజీని బండారు లేఅవుట్​కు కలపకుండా పాపయ్య కుంటలో కలపడమే ముంపుకు కారణమన్నారు.
 

ఘట్​కేసర్​లో ఇండ్లలోకి వరద 

ఘట్​కేసర్​మండలంలోని వెంకటాపూర్ అరుంధతి, వైభవ్​కాలనీల్లోని ఇండ్లలోకి  వరదనీరు వచ్చి చేరింది. అధికారులు తాత్కాలిక చర్యలు పనిచేయడం లేదని, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఎంపీడీఓ గీతారెడ్డి, ఇరిగేషన్ ఏఈ పరమేశ్​అర కావ్య బుధవారం ఉదయం నాడెం చెరువు పరిసరాలను పరిశీలించారు. జేసీబీతో సీసీ రోడ్డుకు గండికొట్టారు. 


మూడేండ్లుగా ఇదే సమస్య 

మూడేండ్లుగా భారీ వర్షం కురిసిన ప్రతిసారి వరద నేరుగా ఇండ్లలోకి వస్తోంది. వెహికల్స్​తోపాటు సోఫాలు, ఫ్రిడ్జ్​లు ఇతర ఎలక్ట్రానిక్​వస్తువులు డ్యామేజ్​అవుతున్నాయి. నిర్మాణ సంస్థ అయిన ప్రై మార్క్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. స్థానిక అధికారులైనా సమస్యను పరిష్కరించాలి. 
– అశోక్ రాజు, శ్రీరామ్స్ అయోధ్య విల్లాస్, బహదూర్​పల్లి

అలుగు కాల్వ కబ్జాలను తొలగించాలి

బాబాఖాన్ చెరువు అలుగు, తూము కాల్వలపై శ్రీరామ్స్​అయోధ్య విల్లాస్ కట్టారు. అందుకే వరద ముంచెత్తుతోంది. హైడ్రా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. కబ్జాలను తొలగించాలి. గతంలో వరద సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పైప్​లైన్​వేస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇంత వరకు అతీగతి లేదు.  
– సగిడి నర్సింగ్ రావు, శ్రీరామ్స్ అయోధ్య విల్లాస్, బహదూర్ పల్లి