వానొస్తే వణుకే .. కామారెడ్డి పట్టణంలో రోడ్లపైనే పారుతున్న వరద నీరు

  • సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే కారణం
  • సమస్య పరిష్కరించాలని పట్టణ వాసుల విజ్ఞప్తి 
  • ఏండ్ల తరబడి పరిష్కారం చూపని అధికారులు 

కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిస్తే చాలు ప్రజలు నరకయాతన పడుతున్నారు.  వరద నీరు పోయేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు  రోడ్లపైనే నిలుస్తుంది. దీంతో వెహికల్స్ నీట మునిగి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి కామారెడ్డి పట్టణం అస్తవ్యస్తంగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మెయిన్ రోడ్ల వెంట సరైన డ్రైనేజీలు లేక రోడ్లపైనే నీరు పారాయి. మరి కొన్ని చోట్ల చిన్నగా ఉన్న డ్రైనేజీలు, వాటిపైనే కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేయడంతో వరద నీరు రహదారిపైకే వస్తోంది. 

మధ్యలోనే ఆగిన డ్రైనేజీ పనులు 

కామారెడ్డి జిల్లా కేంద్రం అభివృద్ధి చెందుతున్నప్పటికీ సరైన  మౌలిక వసతులు మాత్రం సమకూరడం లేదు. కోట్లాది రూపాయలతో చేపట్టిన డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా మారాయి. కొత్త బస్టాండ్  నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు మెయిన్ రోడ్డుకు రెండు వైపులా 7 ఎండ్ల క్రితం డ్రైనేజీ పనులు ప్రారంభించి వాటిని మధ్యలోనే వదిలేశారు.  ఆక్రమణలు తొలగించకుండానే డ్రైనేజీలు కట్టి కాలనీలోని చిన్న డ్రైనేజీలను కలుపుతున్నారు. నీటి ప్రవాహం ఎక్కువై వర్షం నీరు రోడ్డు పైకి, ఇండ్లలో కి వస్తోంది.  

మెయిన్ రోడ్ల వెంట పెద్ద డ్రైనేజీల నిర్మాణంపై మున్సిపల్ యంత్రాంగం ఫోకస్ చేయడం లేదు.  ఫలితంగా వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.  ముఖ్యమైన సెంటర్లు , కొత్త బస్టాండ్ నుంచి హౌజింగ్ కాలనీ వరకు, నిజాం సాగర్ రోడ్డు, జన్మభూమి రోడ్డు, స్టేషన్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు,  జేపీఎన్ రోడ్డులో సరైన డ్రైనేజీ లేదు. ఏటా వర్షాకాలంలో మెయిన్ రోడ్లలో నీళ్లు నిలుస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం కలగటమే కాకుండా ఇండ్లలోకి నీరు వస్తుంది. ప్రజలకు ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  సమస్య పరిష్కారానికి  యంత్రాంగం చొరవ చూపట్లేదు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన  అవసరం ఉంది.

స్టేషన్ రోడ్డు లో చిన్న డ్రైనేజీ కూరుకుపోయి  నీళ్లు పోలేని పరిస్థితి.స్టేషన్ రోడ్డు కు ఇరుపక్కల డ్రైనేజీ లేదు. దశాబ్దాల క్రితం నిర్మాణం చేసిన చిన్న డ్రైనేజీ ఉండగా అది మూసుకుపోయింది.   టౌన్ లో ఏ రోజు వాన పడిన కూడా ఈ రోడ్డు పై నీళ్లు నిలుస్తున్నాయి. ఇండ్లలోని నీళ్లు వస్తున్నాయి. ఈ మార్గంలో వందలాది వాహనాలు తిరుగుతాయి.  పెద్ద డ్రైనేజీ నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు.  

ఇది నిజాంసాగర్ రోడ్డు నుంచి జన్మభూమి రోడ్డు. ఈ మెయిన్ రోడ్ల వెంట డ్రైనేజీ సరిగా లేదు.  వర్షపు నీరు, మురుగు రోడ్లపై నిలుస్తున్నాయి. శుక్రవారం టౌన్ లో భారీ వర్షం పడింది. ఇక్కడ రోడ్ల పై వరద నీరు అక్కడే నిలిచిపోయింది.  వెహికల్స్ రాకపోకలు ఆగిపోయాయి. బైకుల పై వెళ్తున్న వారు అదుపుతప్పి కింద పడిపోయారు.  కార్లు, ఆటోలు, బస్ లకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. 

 ఇండ్ల లోకి నీళ్లు వచ్చి వస్తువులు కొట్టుకు పోయాయి.  కొత్త బస్ స్టాండ్  నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ పు నిర్మాణం చేపట్టిన డ్రైనేజీ మధ్యలో ఆగిపోయింది. ఒక వైపు డ్రైనేజీ ని విద్యానగర్ కాలనీ లోని వైపు చిన్న డ్రైనేజీ వైపు మళ్లించారు.  చౌరస్తా వద్ద జంక్షన్ అభివృద్ధి చేసి, ఆక్రమణలను తొలగించాల్సి ఉంది.  వర్షానికి రోడ్డు కొట్టుకుపోయి మట్టే మిగిలింది.