మహబూబ్​నగర్, జడ్చర్లలో కుంటలు, చెరువుల కబ్జా

  • కబ్జాల వల్లే కష్టాలు
  • ఇండ్ల నిర్మాణాలు చేపట్టడంతో కాలనీల్లోకి చేరుతున్న వరద నీరు
  • మూడేండ్లుగా కంప్లైంట్లు చేసినా స్పందించని ఆఫీసర్లు

మహబూబ్​నగర్, వెలుగు: చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఎఫ్టీఎల్, బఫర్​ జోన్లలో అక్రమ నిర్మాణాలు జరుగుతుండడంతో అవి కుచించుకుపోయాయి. దీంతో ఏటా వానాకాలం సీజన్​లో చెరువుల్లోకి నీరు వెళ్లే దారి లేక, వరదలు దిగువన ఉన్న కాలనీలను ముంచెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలు చేశారని నోటీసులు జారీ చేసినా.. ఇంత వరకు ఆఫీసర్లు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పాలమూరు, జడ్చర్లలో ముంపు..

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారం 119 ఎకరాల్లో విస్తరించి ఉంది. పదేండ్లుగా ఈ చెరువు ఆక్రమణకు గురవుతోంది. బఫర్​ జోన్, ఎఫ్టీఎల్​ పరిధిలో ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్నారు. గత ప్రభుత్వం ట్యాంక్​బండ్​ పేరుతో డెవలప్​మెంట్​ వర్క్స్​ చేయడంతో ప్రస్తుతం ఈ చెరువు 60 ఎకరాలకు కుంచించుకుపోయింది. వరద నీరు వచ్చి చేరే అవకాశం లేకపోవడంతో ఐదేండ్లుగా చెరువు దిగువన ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.

భారీ వర్షాలు వస్తే శిల్పారామం, రామయ్యబౌలి, పాత పాలమూరులోని ఎస్సీ కాలనీ, మోతినగర్ ప్రాంతాల్లోకి నీళ్లు చేరుతున్నాయి. అలాగే ఎర్రకుంట చెరువు బఫర్, ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద మొత్తంలో ఆక్రమణలు చేసి, ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఏటా ఈ చెరువు కింద ఉన్న కుర్షినిశెట్టి కాలనీ ముంపునకు గురవుతోంది. మహబూబ్​నగర్,​ -కర్నాటక అంతర్రాష్ట్ర రహదారిపై వరద నీరు పారుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీనికితోడు జిల్లా కేంద్రంలో 38 కుంటలు ఉండగా.. ఇప్పుడవి కనుమరుగయ్యాయి. కుంటలు కబ్జా చేసి ఇండ్ల నిర్మాణాలు చేపట్టడంతో కాలనీలు ముంపులో చిక్కుకుంటున్నాయి.

జడ్చర్లలోని నల్లకుంట చెరువులోనూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఎఫ్టీఎల్​ను కొందరు కబ్జా చేసి కాంపౌండ్​ వాల్స్​ నిర్మించారు. దీంతో వరద వస్తే దిగువకు నీరు పోయి కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఊరకుంట అలుగు కింద వెంచర్  వేశారు. ఇప్పుడు అక్కడ ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. నీరు రాకుండా అలుగు, తూమును మూసేశారు. దీంతో శనివారం నుంచి చెరువు ఓవర్​ ఫ్లో కావడంతో వెంటనే అలర్ట్​ అయిన ఆఫీసర్లు ఆదివారం ఉదయం పూడ్చిన అలుగు తీయించారు. అలుగు నుంచి నీరంతా నల్లకుంటలోకి వెళ్తుండగా.. అక్కడ కూడా చెరువును కబ్జా చేశారు. దాదాపు ఐదు ఎకరాల్లో మట్టిని పోసి చదును చేశారు. దీంతో నీరు చెరువులోకి వెళ్లే పరిస్థితి లేక ఈ నీరంతా రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

చర్యలకు వెనకడుగు..

గత ప్రభుత్వ హయాంలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్​ జోన్లలో కూడా వెంచర్లు, ఇంటి నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారు. ఆక్రమణల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతున్నట్లు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆక్రమణలు తొలగించాలని ప్రజవాణిలోనూ కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు అందించారు. కానీ, ఇంత వరకు ఆఫీసర్లలో ఎలాంటి స్పందన రాలేదు. అయితే మహబూబ్​నగర్​ పెద్ద చెరువు కింద మూడేండ్ల కింద ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు. అక్కడ చేపట్టిన నిర్మాణాలన్నీ ఆక్రమించి కట్టారని తేల్చారు. దీనిపై నోటీసులు అందించినా.. ఇంత వరకు చర్యలు తీసుకోవడంపై అడుగు ముందుకు పడలేదు. 

సీఎం పేషీలోనూ ఫిర్యాదులు...

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న ప్రజా దర్బార్​లో మహబూబ్​నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో జరిగిన కబ్జాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కేవలం చెరువులను కబ్జా చేసినట్లు 92 కంప్లైంట్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కంప్లైంట్లపై కూడా ఉన్నతాధికారులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదు.