ఎస్సారెస్పీకి పెరిగిన వరద

  • పూర్తి కెపాసిటీ 80.5 టీఎంసీలు.. ప్రస్తుతం 56.980 టీఎంసీల నీరు
  •  ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోకి వస్తున్న 34,952 క్యూసెక్కుల ప్రవాహం
  • గతేడాది ఈ టైం వరకే పూర్తిగా నిండిన ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌

నిజామాబాద్, వెలుగు : ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు మూడు రోజుల నుంచి వరద ప్రవాహం పెరిగింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మీదుగా 34,952 క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోకి చేరుతోంది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తి స్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 56.980 టీఎంసీల నీరు చేరింది. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండడంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే గతేడాదిలో ఈ టైం వరకే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తిగా నిండగా, ప్రస్తుతం 56 టీఎంసీల నీరు మాత్రమే చేరింది.

జూన్‌‌‌‌‌‌‌‌లో వచ్చింది 9.49 టీఎంసీలే...

ఎస్సారెస్పీ డెడ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజీ ఐదు టీఎంసీలు కాగా వర్షాకాలం మొదలయ్యే జూన్‌‌‌‌‌‌‌‌ 1 నాటికి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో 6.39 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇంత తక్కువ నీరు గత ఐడేండ్లలో ఎప్పుడూ లేదు. వర్షాలు మొదలయ్యాక జూన్‌‌‌‌‌‌‌‌ మొత్తం కలిపి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోకి 9.49 టీఎంసీల నీరు చేరింది. జులైలో భారీ వర్షాలు పడడంతో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నీటి మట్టం 36.075 టీఎంసీలకు చేరుకుంది. జులై 1న బాబ్లీ గేట్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయడంతో గోదావరిలో పడిన ప్రతి నీటి బొట్టు నేరుగా ఎస్సారెస్సీ వైపే వస్తోంది. ఈ నెలలో సైతం వర్షాలు పడడంతో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నీటి మట్టం56.980 టీఎంసీలకు చేరింది.

గతేడాది ఆగస్ట్‌‌‌‌‌‌‌‌లోనే ఎస్సారెస్పీ ఫుల్‌‌‌‌‌‌‌‌

గతేడాది ఆగస్ట్‌‌‌‌‌‌‌‌ నెలాఖరు వరకే ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తి స్థాయిలో నిండింది. తర్వాత వచ్చిన నీటిని వచ్చినట్లే గేట్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేసి దిగువకు విడుదల చేశారు. ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. రెంజల్‌‌‌‌‌‌‌‌ మండలం కందకుర్తి వద్ద గోదావరిలో కలిసే మంజీరా, హరిద్రా నదుల్లో ఈ సారి నీటి ప్రవాహం అంతగా లేకపోవడం, ఒక్క గోదావరిలోనే ప్రవాహం ఉండడంతో ఎస్సారెస్పీ పూర్తిస్థాయిలో నిండలేదని తెలుస్తోంది.

సాగుకు నీరు విడుదల

ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో నీటి నిల్వ 40 టీఎంసీలు దాటడంతో ఈ నెల 7న కాకతీయ కాల్వకు సాగు నీటిని విడుదల చేశారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వరకు 284 కిలోమీటర్ల ఉన్న ఈ కెనాల్‌‌‌‌‌‌‌‌కు నిత్యం 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీ కెనాల్‌‌‌‌‌‌‌‌కు 50 క్యూసెక్కులు వదులుతున్నారు. సరస్వతీ కాల్వకు రెండు వారాలు 100 క్యూసెక్కుల నీరు విడుదల చేసి  వారం కింద ఆపేశారు. మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ స్కీం కోసం కోరుట్ల, జగిత్యాల జిల్లాలకు 61 క్యూసెక్కుల నీటిని వాడుతుండగా అదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డిలో భగీరథ స్కీంకు నిత్యం 107 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

17.50 టీఎంసీలకు చేరిన ఎల్లంపల్లి

మంచిర్యాల, వెలుగు : ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ జలకళను సంతరించుకుంది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోకి 17.75 టీఎంసీల నీరు చేరింది. ఇటీవల వర్షాలు పడడంతో ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోకి 10,478 క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో వస్తోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే మిడ్‌‌‌‌‌‌‌‌మానేరు, మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌కు ఎత్తి పోస్తున్నారు. నంది పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ ద్వారా 12,600 క్యూసెక్కులు పంపింగ్​చేస్తున్నారు.

ఇప్పటివరకు మొత్తం 19.32 టీఎంసీల నీటిని లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. అలాగే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మెట్రో వాటర్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ (హెచ్‌‌‌‌‌‌‌‌ఎండబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌)కు 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి121 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ ఏడాది ఎల్లంపల్లి ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు లేకపోవడంతో గోదావరికి పెద్దగా వరదలు రాలేదు. పైనుంచి వచ్చిన నీళ్లు ఎస్సారెస్పీలోనే ఉంటున్నాయి. జూలై నెలాఖరులో కడెం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ గేట్లు ఎత్తడంతో ఆ వరద ఎల్లంపల్లికి చేరింది. 17 టీఎంసీలు నిండగానే మిడ్‌‌‌‌‌‌‌‌మానేరుకు ఎత్తిపోతలు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో నీటి మట్టం ఈ నెల 7న 13.75 టీఎంసీలకు తగ్గింది. ఇటీవల వర్షాలు పడడంతో నీటి మట్టం తిరిగి 17.75 టీఎంసీలకు చేరుకుంది.

మిడ్‌‌‌‌‌‌‌‌మానేరు నుంచి నీటి విడుదల

బోయినిపల్లి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని మిడ్‌‌‌‌‌‌‌‌ మానేరుకు భారీ వరద వస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్‌‌‌‌‌‌‌‌ల మీదుగా వరద కాల్వ ద్వారా మిడ్‌‌‌‌‌‌‌‌ మానేరుకు 11 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, మానేరు, మూలవాగుల నుంచి 2,200 క్యూసెక్కుల నీరు వస్తుంది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పూర్తిస్థాయి సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి 18.82 టీఎంసీల నీరు చేరింది. ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో భారీగా ఉండడంతో మిడ్‌‌‌‌‌‌‌‌మానేరు ఐదు గేట్లు ఎత్తి ఎల్ఎండీకి 14,600 క్యూసెక్కులు, ప్యాకేజీ10లోని అన్నపూర్ణ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 3,200 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 


జూరాల 24 గేట్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌

గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో పెరిగింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌ల నుంచి వరద వస్తుండడంతో సోమవారం జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ 24 గేట్లను ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా జూరాలకు చేరుకోంది. జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నీటిమట్టం 7.85 టీఎంసీలకు చేరడం గేట్ల ద్వారా 95,064 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,689 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.