నడిగడ్డ పులకింత..జూరాలకు 3 లక్షలకుపైగా క్యూసెక్కుల వరద

  • ప్రాజెక్టు 44 గేట్లు  ఎత్తి దిగువకు నీటి విడుదల
  • సుంకేశుల బ్యారేజీకి  వస్తున్న భారీగా ప్రవాహం
  • దివి గ్రామస్తులకు  తప్పని కష్టాలు
  • పుష్కర ఘాట్ల వద్ద  అప్రమత్తత అవసరం

కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డ ప్రాంతం వరద నీటితో పులకించిపోతోంది. ఓవైపు జూరాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తగా, రాజోలి సమీపంలోని సుంకేశుల బ్యారేజీకి భారీగా ప్రవాహం కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో వర్షాలు లేనప్పటికీ నదులకు ఒకేసారి వరద రావడంతో రైతులు ఉప్పొంగిపోతున్నారు. అదే సమయంలో దివి గ్రామస్తులకు కష్టాలు తప్పడం లేదు.

గద్వాల, వెలుగు:  కర్నాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ నుంచి గద్వాల జిల్లాలోని జూరాలకు వరద కొనసాగుతూనే ఉన్నది. 3 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వస్తుండడంతో శనివారం ప్రాజెక్టు 44 గేట్లను ఓపెన్ చేశారు. జూరాల ఫుల్ ​కెపాసిటీ 9.657 టీఎంసీలకు గాను 6.841 టీఎంసీలు నిల్వ ఉంచుకొని 2,92,861 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 

ఇందులో విద్యుత్ ఉత్పత్తికి19,683 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్టుకు 1500, భీమా-1కు 1300, భీమా-2కి 750, సమాంతర కాలువకు 300, లెఫ్టు కెనాల్​కు 870,  రైట్ కెనాల్​కు 596 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. మరోవైపు, సుంకేశుల బ్యారేజీకి శనివారం వరద పోటెత్తింది. బ్యారేజీ కెపాసిటీ 1.235 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.438 టీఎంసీలు నిల్వ ఉంది. 1.02 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, 28 గేట్ల ద్వారా 1.01 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు, కృష్ణా నది మధ్యలో1600 ఎకరాల విస్తీర్ణంలో గుర్రంగడ్డ పేరుతో దివి గ్రామం ఉంది. ఇక్కడ 900 మంది వరకు ప్రజలు.. 1200 ఎకరాల్లో తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరు బయటకు రావాలంటే బోటులే శరణ్యం. ఉన్న ఒక బోటు కూడా పాతది కావడంతో ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

కొత్త బోర్డుకు ఆర్డర్ ఇచ్చినా ఇప్పటికీ రాకపోవడంతో పాత దాంట్లోనే ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్నారు. అటు చిన్న చింతరేవుల, నది అగ్రహారం, బీరెల్లి, బీచుపల్లి ప్రాంతాల్లో పుష్కర్ ఘాట్లు ఉన్నాయి. బీచుపల్లి పుష్కర్ ఘాటు తప్ప మిగతా చోట్ల పోలీస్ పహారా లేకపోవడంతో..  స్నానాల కోసం ఎవరైనా నదిలోకి దిగితే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.