మధ్యాహ్న భోజనం చేసి ఐదుగురు విద్యార్థులకు అస్వస్థత 

దేవరకొండ, వెలుగు : ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన దేవరకొండ మండలం ఆదర్శ పాఠశాలలో గురువారం జరిగింది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పెంచికల్పహాడ్ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి ఐదుగురు విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పితో రావడంతో వెంటనే దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న దేవరకొండ ఎంఈవో మాతృనాయక్, తహసీల్దార్ కిరణ్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.

విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. మరోవైపు జిల్లా న్యాయ సేవా అధికారం సంస్థ ఆదేశాల మేరకు మోడల్ స్కూల్ హాస్టల్ ను దేవరకొండ సీనియర్ సివిల్ జడ్జి కె.అనిత, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పి.రవీందర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి హరీశ్ బాబు సందర్శించారు. హాస్టల్​లోని వంట గది, స్టోర్ రూమ్ ను పరిశీలించారు.