ఆర్థిక అభివృద్ధికి ఐదు దశలు

అభివృద్ధి దశల పరిణామాన్ని విశ్లేషణ చేసిన వారిలో కార్ల్​మార్క్స్​, రోస్టావ్​ ముఖ్యులు. మార్క్స్ చారిత్రాత్మక పరిశీలన చేసి సామాజిక పరిణామంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉద్భవించింది, ఈ వ్యవస్థ చివరికి ఎటు దారి తీస్తుందో తెలిపాడు. రోస్టోవ్​ సాంప్రదాయ సమాజం, ప్లవన దశకు కావాల్సిన ముందు పరిస్థితులు, ప్లవన దశ, పరిపక్వ దశకు గమనం, సామూహిక వినియోగం అనే ఐదు దశల ద్వారా వృద్ధిని వివరించాడు. 

కార్ల్​మార్క్స్​ సిద్ధాంతం

మార్క్స్ వర్గ పోరాటం ద్వారా ఆర్థికాభివృద్ధి దశలను చారిత్రాత్మక, భౌతిక దృష్టిలో విశ్లేషణ చేశాడు. చారిత్రాత్మక పరిశీలన చేసి సామాజిక పరిణామంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉద్భవించింది, ఈ వ్యవస్థ చివరికి ఎటు దారి తీస్తుందో తెలిపారు. 

ఆదిమ సమాజం: సామాజిక పరిణామంలో మొదట ఆదిమ కమ్యూనిజం ఉంటుంది. అందరూ కలిసి పనిచేస్తారు. ఉత్పత్తి కారకాలు ఎవరి సొంతం కావు.  శ్రమించి ఉత్పత్తి చేసి దానిని అందరి అవసరాల కోసం పంచుకుంటారు. 

బానిస దశ: క్రమంగా శ్రమ విభజన ఉద్భవించి శ్రామికులు తమ అవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. ఈ దశలో మనిషి మనిషిని దోపిడీ చేసే విధానం ప్రారంభమైంది. ఉత్పత్తి సాధనాలు కొందరి చేతుల్లో కేంద్రీకృతం అవుతాయి. 

భూస్వామ్య దశ: ఈ దశలో రైతులు భూమి దున్ని కష్టించి పనిచేస్తారు. ప్రతిఫలం మాత్రం భూస్వాములకు చెందుతుంది. భూమిపై యాజమాన్యం భూస్వాములకు చెందుతుంది. నూతన సాంకేతిక పద్ధతుల ప్రవేశం వల్ల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. నూతన సాంకేతిక పద్ధతుల వల్ల కొత్త ఉత్పత్తి సంబంధాలు అవసరమై భూస్వామ్య వ్యవస్థ బాగా దెబ్బ తింటుంది. 

సామ్యవాద దశ: పెట్టుబడిదారీ వర్గం పరిపక్వానికి చేరినప్పుడు శ్రామిక వర్గానికి, పెట్టుబడిదారి వర్గానికి వైరుద్ధ్యం ఏర్పడుతుంది. శ్రామికులు సంఘటితమై విప్లవం ద్వారా రాజ్యంపై ఆధిపత్యం వహిస్తారు. శ్రామికులు రాజ్యాన్ని నియంత్రించి ఉత్పత్తి సంస్థలను స్వాధీనం చేసుకుంటారు. 
అడ్వాన్స్​డ్​ కమ్యూనిజం: మొదట దశ మాదిరిగా ఉత్పత్తి కారకాలు సమాజపరం అవుతాయి. వ్యక్తుల ఆదాయాలు వారి అవసరాలను అనుసరించి తీరుతాయి. కాబట్టి చివరికి సామ్యవాదం కమ్యూనిజంగా మారుతుంది. ఇక్కడ రాజ్యం అంతరిస్తుంది. పెటుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో నవీన యంత్రాలు ప్రవేశపెట్టడం వల్ల నిరుద్యోగం పెరుగుతుంది. ఈ పెరిగే నిరుద్యోగులను కారల్​ మార్క్స్​ ఇండస్ట్రియల్​ రిజర్వ్​డ్​ ఆర్మీగా పిలిచారు. 

పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ: ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారీ వర్గం, శ్రామిక వర్గం అనే రెండు వర్గాలుగా చీలిపోతుంది. పారిశ్రామిక విప్లవం వల్ల శాస్త్రీయ భావాలు ప్రజల్లో వృద్ధి చెందుతాయి. ఈ దశలో ఉత్పత్తి సాధనాలు పెట్టుబడిదారుల చేతుల్లో ఉంటాయి. శ్రామికుడి వద్ద శ్రమశక్తి ఉంటుంది. ఈ శ్రామిక శక్తిని పెట్టుబడిదారులు దోచుకుంటారు. 

రోస్టోవ్​ వృద్ధి దశల సిద్ధాంతం: డబ్ల్యూడబ్ల్యూ రోస్టావ్​ రచించిన ది స్టేజ్ ఆఫ్​ ఎకనామిక్​ గ్రౌత్​ 1960లో ప్రచురితమైంది. దీనిని ఏ నాన్​ కమ్యూనిస్ట్​ మేనిఫెస్టో అనే సబ్​ టైటిల్​తో పిలుస్తారు. రోస్టోవ్ వృద్ధి దశలను ఐదు దశలుగా విభజించవచ్చు. అవి.. సాంప్రదాయ సమాజం, ప్లవన దశకు కావాల్సిన ముందు పరిస్థితులు, ప్లవన దశ, పరిపక్వ దశకు గమనం, సామూహిక వినియోగం. 

సాంప్రదాయ సమాజం: న్యూటన్​ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి పూర్వం ఉన్న శాస్త్ర, సాంకేతిక జ్ఞానం ఆధారంగా ఏర్పడిన పరిమితమైన ఉత్పత్తి ఫలం ఆధారంగా నిర్మితమైన సమాజం. భౌతిక పరిజ్ఞాన ప్రపంచం గురించి న్యూటన్​కు పూర్వం ఉన్న విజ్ఞానం గల సమాజం. దీనిని ప్రీ ఇండస్ట్రియల్​ స్టేట్​ అంటారు. పరిమితమైన ఉత్పత్తి ఫలం ఉంటుంది. సాధించే తలసరి ఉత్పత్తికి గరిష్ట పరిమితి ఉంటుంది. ఆధునిక విజ్ఞానం సాంకేతిక ప్రగతి ఫలాలు అందుబాటులో లేకపోవడమే కారణం. దేశ జనాభాలో 75 శాతం వ్యవసాయరంగంలో పనిచేస్తుంటారు. రాజకీయ అధికారం భూస్వాముల చేతిలో ఉంటుంది. అధిక మానవశక్తి ఉంటుంది. శ్రమ సాంద్రత పరిశ్రమలు ఉంటాయి. ప్రజల కనీస వినియోగ అవసరాలకు మించి ఉన్న ఆదాయం విలాస జీవితానికి ఖర్చు చేస్తారు. 

ప్లవన దశకు కావాల్సిన ముందు పరిస్థితులు: ఇది సాంప్రదాయ సమాజం నుంచి శాస్త్రీయ, ఆధునిక సమాజానికి మారే కాలం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు పొంది, సాంప్రదాయక సమాజం నుంచి మార్పు చెందడానికి కొంత సమయం పడుతుంది. నష్టభయం భరించే ఉద్యమదారులు ఏర్పడుతారు. వాణిజ్యం, వ్యాపారం విస్తరిస్తుంది. పెట్టుబడి పెరుగుతుంది. ఆధునిక ఉత్పత్తి సంస్థలు ప్రత్యక్షం అవుతాయి. 15వ శతాబ్ది చివర, 16వ శతాబ్దం ప్రారంభంలో కొనసాగించగలిగే అభివృద్ధి కావాల్సిన పరిస్థితులు బ్రిటన్​, పశ్చిమ యూరప్​లో ఏర్పడ్డాయి. ఈ దశను బ్రిటన్ ముందు దాటింది. 

ప్లవన దశ: ఇది రోస్టోవ్​ ఐదు దశల్లో ముఖ్యమైన దశ. నూతన పరిశ్రమలు విస్తరించిన ఫలితంగా ఇతర పరిశ్రమలు, సేవలు విస్తరించి ఆధునిక పారిశ్రామిక రంగం, పట్టణాలు విస్తరిస్తాయి. వ్యవసాయం ఫలితంగా  ఆహార మిగులు ఏర్పడి, వేగంగా విస్తరించే పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలను ఆహార మిగులు అందిస్తాయి. పొదుపు పెట్టుబడులు 5 నుంచి 10 శాతం పెరుగుతాయి. ఈ దశలో ఉత్పత్తి పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. 

పరిపక్వ దశకు గమనం: ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని సమర్థవంతంగా వినియోగించే కాలం. ప్లవన దశ తర్వాత పరిపక్వత సాధించడానికి దేశం పురోగమిస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఆనాటివరకు సాధించిన సాంకేతిక ప్రగతి ఫలాలు దేశంలో లభ్యమయ్యే వనరులకు అనువర్తించి అభివృద్ధి సాధిస్తూ ఉంటుందని రోస్టోవ్​ నిర్వచించాడు. 

సామూహిక వినియోగం: మన్నిక గల వినియోగ వస్తువుల ఉత్పత్తి వైపు ఆర్థిక వ్యవస్థ మారుతుంది. వినియోగం, ఆహారం, వస్త్రాలు, వసతి కాకుండా అధిక ఆదాయం రావడం వల్ల కార్లు, ఏసీల వంటి మన్నికగల వినియోగ వస్తువులపై వినియోగం మళ్లుతుంది. పట్టణ జనాభా పెరుగుతుంది.

కుజినెట్స్ అభిప్రాయం: ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. సాంకేతికాభివృద్ధి వల్ల ద్వితీయరంగం వాటా పెరిగి ప్రాథమిక రంగం వాటా తగ్గుతుంది. శ్రామికశక్తి కూడా ప్రాథమిక రంగం నుంచి ద్వితీయ రంగానికి మళ్లుతుంది. చివరికి పెట్టుబడిదారీ చివరి దశలో శ్రామికశక్తి ద్వితీయ రంగం నుంచి తృతీయ రంగానికి మళ్లుతుంది. అమెరికాలో జాతీయాదాయం సేవారంగం వాటా 75 శాతంపైనే. 

విమర్శ: నార్వేలో జాతీయాదాయంలో వ్యవసాయరంగం నుంచి ఎక్కువ వాటా వస్తున్నా అవి ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. ఇండియాలో 50 శాతం పైన సేవారంగం నుంచి వాటా వస్తున్నా ఇది అల్ప అభివృద్ది చెందిన దేశమే. జాతీయాదాయంలో ఒక రంగం వాటాకు ఆ రంగం అందించే ఉపాధికి మధ్య కుజ్​నెట్స్​ పేర్కొన్న సంబంధం కనిపించడం లేదు. ఉదా: ఇండియాలో సగం కంటే ఎక్కువ ఆదాయం సేవారంగం నుంచి లభ్యం కాగా ఇది కల్పించే ఉపాధి మాత్రం తక్కువే.