ఐదు OTT మూవీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రేమ కోసమై.. 

టైటిల్ : మరక్కుమ నెంజం

డైరెక్షన్​ : రాకో. యోగద్రన్

కాస్ట్ : రక్షణ్​, ధీనా, మలినా, మునిష్కాంత్‌‌, అరుణ్​ కురియన్‌‌

ప్లాట్​ ఫాం : అమెజాన్‌‌ ప్రైమ్ వీడియో

ఈ సినిమా ఒక హిల్ స్టేషన్‌‌లోని స్కూల్‌‌ పూర్వ విద్యార్థుల కథ. ఈ స్కూల్‌‌లో 2008లో చదువు పూర్తి చేసుకుని వెళ్లిపోయిన స్టూడెంట్స్‌‌ అంతా సరిగ్గా పదేండ్లకు... అంటే 2018లో మళ్లీ అదే స్కూల్‌‌లో కలుసుకుంటారు. కానీ.. అలా కలవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. అదేంటంటే.. ఆ ఏరియాలో ఉండే మరో స్కూల్‌‌తో ఈ స్కూల్‌‌కు ఎప్పుడూ పోటీ ఉంటుంది. దాంతో పొరుగు స్కూల్ యాజమాన్యం ఈ స్కూల్ మీద ఒక కేసు వేస్తుంది. ఆ కేసులో 2008లో పాసైన విద్యార్థులు మళ్లీ హెచ్‌‌.ఎస్‌‌.సి. ఎగ్జామ్ రాయాలని కోర్టు తీర్పునిస్తుంది. అందుకే వాళ్లంతా ఎగ్జామ్స్‌‌కి మూడు నెలల ముందు మళ్లీ స్కూల్‌‌కి వస్తారు. వాళ్లంతా తమ కెరీర్, లైఫ్‌‌ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు. కానీ.. ఒక వ్యక్తి మాత్రం మళ్లీ ఎగ్జామ్‌‌ రాయడానికి వచ్చినందుకు చాలా సంతోషిస్తాడు. అతనే కార్తీక్ (రక్షణ్​). ఎందుకంటే.. అతను పదేండ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయి ప్రియదర్శిని(మలినా)ని కలిసే అవకాశం ఈ ఎగ్జామ్‌‌ రూపంలో వచ్చింది. ఆమె కోసమే స్కూల్‌‌కి తిరిగి వెళ్తాడు. కానీ, తన ప్రేమ గురించి చెప్పడానికి భయపడుతుంటాడు. ఇంతకీ కార్తీక్ ప్రియదర్శినిని కలిశాడా? ఈసారి తన ప్రేమను ఆమెకు చెప్పాడా? లేదా? 
పదేండ్ల తర్వాత మళ్లీ ఎగ్జామ్స్ రాయాలని కోర్టు ఆదేశించడం వాస్తవదూరంగా అనిపిస్తుంది. అందుకు డైరెక్టర్‌‌‌‌ బలమైన కారణాలను చూపించలేకపోయాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే అందరూ బాగానే నటించారు. రక్షణ్ యాక్టింగ్‌‌ అందరినీ ఆకట్టుకుంటుంది. సలీమ్‌‌గా ధీనా కూడా కామెడీ బాగా పండించాడు. 

ఆరు జీవితాలు 

టైటిల్ : లవ్ స్టోరియా

డైరెక్షన్​ : అక్షయ్ ఇందికర్, అర్చన ఫడ్కే, కొల్లిన్ డి కున్హా, హార్దిక్ మెహతా, షాజియా ఇక్బాల్, వివేక్ సోనీ

కాస్ట్ : పూనమ్ గురుంగ్‌‌, ట్వింకిల్‌‌ ట్షెరింగ్‌‌, ఎక్తా కపూర్‌‌‌‌, ఉల్లేఖ్ ఎన్‌‌పీ, నిలోలస్‌‌ జోనథన్‌‌ ఖర్నామి

ప్లాట్​ ఫాం : అమెజాన్‌‌ ప్రైమ్ వీడియో

ఈ వెబ్ సిరీస్‌‌లో ఆరు ఎపిసోడ్లు(ఆరు కథలు) ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్‌‌ని ఒక్కో డైరక్టర్‌‌‌‌ తెరకెక్కించాడు. హార్దిక్ మెహతా దర్శకత్వం వహించిన మొదటి ఎపిసోడ్‌‌ ‘ఏన్ అన్​సూటబుల్ గర్ల్’, ఏక్తా కపూర్, ఉల్లేఖ్ ఎన్‌‌పీ నటించిన ఈ ఎపిసోడ్‌‌లో వాళ్ల జీవితాల్లో ఎదుర్కొనే అడ్డంకులను బాగా చూపించారు. ఢిల్లీకి చెందిన 33 ఏళ్ల రచయిత్రి/ఎడిటర్‌‌‌‌ ఏక్తా ముంబైకి చెందిన ఉల్లేఖ్ అనే జర్నలిస్టును ప్రేమిస్తుంది. అతను ఏక్తా లైఫ్‌‌స్టయిల్‌‌ బ్లాగ్‌‌ కామెంట్ సెక్షన్‌‌లో పరిచయం అవుతాడు. కానీ.. ఏక్తాకు అంతకుముందే పెండ్లి అవుతుంది. ఇద్దరు కూతుళ్లు కూడా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ. రెండో ఎపిసోడ్‌‌ ‘లవ్ ఆన్ ఎయిర్’లో షిల్లాంగ్‌‌కు చెందిన రేడియో జాకీలు నికోలస్ జె. ఖర్నామి, రజనీ కె. ఛత్రీల ప్రేమకథ చూపించారు. దర్శకుడు వివేక్ సోనీ డైరెక్ట్‌‌ చేశాడు. డైరెక్టర్‌‌‌‌ షాజియా ఇక్బాల్ తీసిన ‘క్రాస్ బోర్డర్స్’ మూడో ఎపిసోడ్‌‌. బంగ్లాదేశ్‌‌లోని ఢాకా నుంచి ఆనందాన్ని వెతుక్కుంటూ కోల్‌‌కతాకు పారిపోతున్న హిందూ–ముస్లిం జంట ప్రేమ కథ ఇది. నాలుగో ఎపిసోడ్‌‌ ‘రాహ్ సంఘర్ష్ కీ’ని అక్షయ్ ఇందికర్‌‌‌‌ తెరకెక్కించారు. ఇందులో ‘నర్మదా బచావో’ ఆందోళన కార్యక్రమంలో పరిచయమై ప్రేమలో పడిన ఐఐటీ గ్రాడ్యుయేట్ రాహుల్ బెనర్జీ, దళిత యువతి సుభద్ర ఖాపర్డే మధ్య జరిగిన కులాంతర వివాహం గురించి చూపించారు.ఐదో ఎపిసోడ్‌‌ ‘ఫాస్లే’.. యు.ఎస్‌‌.ఎస్‌‌.ఆర్‌‌.లోని మాస్కోలో చదువుతున్నప్పుడు కలిసిన కేరళకు చెందిన ధన్య, అఫ్ఘాన్ వ్యక్తి హోమయోన్ ప్రేమ కథ. ఈ జంట రెండు దశాబ్దాల వాళ్ల వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను ఈ ఎపిసోడ్‌‌లో చూపించారు. చివరి ఎపిసోడ్‌‌ ‘లవ్ బియాండ్ లేబుల్స్’ని ‘కొలిన్ డి’కున్హా’ తెరకెక్కించారు. పశ్చిమ బెంగాల్‌‌లో పెండ్లి చేసుకున్న మొదటి ట్రాన్స్ జెండర్ జంట తీస్తా దాస్, దీపన్‌‌ల కథ ఇది. ‘లవ్ స్టోరియా’ ప్రేమకు ఉన్న విభిన్న రూపాలను చూపించే పయత్నం చేసింది. కాకపోతే.. ప్రతి కథ 25 నుంచి 30 నిమిషాల్లో క్రిస్ప్​గా చూపించారు.

దేశం కోసం జీవితాన్నే..

టైటిల్ : ఏ వతన్ మేరే వతన్
 

డైరెక్షన్ : కన్నన్ అయ్యర్
 

కాస్ట్ : సారా అలీ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, అభయ్ వర్మ, స్పర్ష్ శ్రీవాస్తవ్, అలెక్స్ ఓ'నెల్, సచిన్ ఖేడేకర్
 

ప్లాట్​ ఫాం : అమెజాన్‌‌‌‌ ప్రైమ్ వీడియో

అది క్విట్‌‌ ఇండియా ఉద్యమ కాలం.1942లో ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. మహాత్మా గాంధీ ఇచ్చిన ‘డూ ఆర్ డై’ నినాదంతో ఎంతోమంది ఉద్యమంలోకి వచ్చారు. అలా అప్పుడే 22 ఏళ్ల ఉషా మెహతా (సారా అలీ ఖాన్) కూడా ఈ ఉద్యమంలో చేరుతుంది. ఆమె తండ్రి (సచిన్ ఖేడేకర్) బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పనిచేస్తుంటాడు. అతను మాత్రం ఆంగ్లేయులకు మద్దతుగా నిలుస్తాడు. అది నచ్చని ఉష... కన్న తండ్రిని ఎదిరించి మరీ ఉద్యమంలో చేరుతుంది. ఆమెని ఒక గదిలో బంధించినా తప్పించుకుని వెళ్లిపోతుంది. తనను ప్రేమిస్తూ.. తన ఉద్యమానికి సపోర్ట్‌‌ చేస్తున్న కౌశిక్ (అభయ్ వర్మ), మరో ఫ్రెండ్‌‌ ఫహాద్ (స్పర్శ్ శ్రీవాత్సవ్) సాయం తీసుకుంటుంది. ఉద్యమంలో చేరాక దేశ ప్రజల్లో రేడియో ప్రసంగాల ద్వారా విప్లవ భావాలు కలిగించాలి అనుకుంటుంది. కానీ.. అప్పట్లో ప్రైవేట్ రేడియో స్టేషన్స్‌‌కి అనుమతి లేకపోవడంతో గవర్నమెంట్‌‌కు తెలియకుండా రహస్యంగా ఒక రేడియో స్టేషన్ ఏర్పాటుచేస్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నడుపుతుంది. ఆ విషయం తెలిసిన పోలీసులను ఆ రేడియో నిర్వాహకులను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అప్పుడామెకు రామ్ మనోహర్ లోహియా (ఇమ్రాన్ హష్మీ) ఎలా సాయం చేశాడు? రేడియో నిర్వాహకులను పట్టుకోవడం కోసం ముంబై ఇన్‌‌స్పెక్టర్ (అలెక్స్ ఓ’ నీల్) ఏం చేశాడు? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. స్వాతంత్ర్యోద్యమం టైంలో అండర్ గ్రౌండ్ రేడియో ద్వారా ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపిన ఉషా మెహతా లైఫ్‌‌ స్ఫూర్తితో ఈ సినిమా తీశారు. లీడ్‌‌ రోల్‌‌లో చేసిన సారా అలీఖాన్‌‌ నటన ఓకే అనిపించింది. రామ్ మనోహర్ లోహియాగా ఇమ్రాన్ హష్మీ యాక్టింగ్‌‌ బాగుంది. 

హైజాక్‌‌

టైటిల్ : లుటేరే 

డైరెక్షన్​ : జై మెహతా

కాస్ట్ : వివేక్ గోంబెర్, రజత్ కపూర్, మార్షల్ బ్యాచ్‌‌మెన్, గౌరవ్ శర్మ, అథెంకోసి ఎంఫామెలా, అమృతా ఖాన్విల్కర్, చిరాగ్ వోహ్రా, హ్యారీ పర్మార్, గౌరవ్ పాస్వాలా, ప్రీతికా చావ్లా, అమీర్ అలీ, అలినో కటోంబే, చందన్ రాయ్ సన్యాల్

ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్‌‌ హాట్‌‌స్టార్‌‌‌‌

లుటేరే వెబ్ సిరీస్ వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సోమాలియా పైరేట్స్ చేసే అకృత్యాలు ఎలా ఉంటాయో ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు. కథలోకి వెళ్తే.. ఉక్రెయిన్‌‌కు చెందిన ఒక కార్గో షిప్ సోమాలియా రాజధాని మొగదిషుకు బయల్దేరుతుంది. అందులో పది మంది భారతీయులు, ఇద్దరు పాకిస్తానీలు, ఒక బంగ్లాదేశ్‌‌ వ్యక్తి ఉంటారు. అందులో సోమాలియాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన బడా వ్యాపారవేత్త విక్రాంత్ (వివేక్ గోంబర్)కు చెందిన విలువైన సరుకులు ఉంటాయి. అతనికి సోమాలియాలో పలుకుబడి ఉండడం, పోర్ట్‌‌కు అతనే ప్రెసిడెంట్‌‌ కావడంతో చట్ట విరుద్ధమైన వస్తువులు కూడా తీసుకొస్తుంటాడు. కానీ.. పోర్ట్‌‌లో ఉండే మిగతావాళ్లు మాత్రం ఆ ఓడను అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తారు. దాంతో ఆ ఓడని మరో చోటికి తీసుకెళ్లాలి అనుకుంటాడు విక్రాంత్‌‌. ఆ పనిని తన స్నేహితుడికి అప్పగిస్తాడు. అతడు సోమాలియా పైరేట్స్‌‌తో ఓడను హైజాక్ చేయిస్తాడు. మొగదిషుకి వెళ్లాల్సిన ఓడ సోమాలియా ఉత్తర తీరం హరర్ధెరే వైపు మళ్లిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ ఓడలో ఏమున్నాయి? తెలుసుకోవాలంటే ఈ వెబ్‌‌ సిరీస్‌‌ చూడాల్సిందే. 

పాకిస్తాన్‌‌లో ఏం జరిగింది? 

టైటిల్ : ఫైటర్‌‌
 

డైరెక్షన్​ : సిద్ధార్థ్‌‌ ఆనంద్‌‌
 

కాస్ట్ : హృతిక్‌‌ రోషన్‌‌, దీపికా పదుకొనె, అనిల్‌‌ కపూర్‌‌, కరణ్‌‌ సింగ్‌‌ గ్రోవర్‌‌, అక్షయ్‌‌ ఒబెరాయ్‌‌, సంజీవ్‌‌ జైశ్వాల్‌‌
 

ప్లాట్​ ఫాం : నెట్ ఫ్లిక్స్

సంషేర్ ప‌‌ఠానియా అలియాస్ ప్యాటీ (హృతిక్ రోష‌‌న్‌‌) భార‌‌త వైమానిక ద‌‌ళంలో స్క్వాడ్రన్‌‌ లీడ‌‌ర్‌‌‌‌గా పనిచేస్తుంటాడు. ఎలాంటి అడ్వెంచర్​ అయినా చేసేందుకు వెనుకాడ‌‌ని  ఫైట‌‌ర్ పైల‌‌ట్‌‌ అతను. అప్పగించిన పనిని ఎలాగైనా పూర్తి చేసేవరకు వదలడు. అయితే.. ఒకసారి దేశంలో ఉన్న బెస్ట్ ఫైటర్ పైలట్స్ అందరినీ శ్రీనగర్‌‌‌‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌‌లో ఒక స్పెషల్ పోస్టింగ్ కోసం పిలిపిస్తారు. ప్యాటీ కూడా అక్కడికి వెళ్తాడు. అక్కడ ఎయిర్ డ్రాగన్ పేరుతో ఒక స్పెషల్ యూనిట్‌‌ ఏర్పాటు చేస్తారు. అందులో తన ర్యాంక్‌‌లోనే ఉన్న మిన్ని అలియాస్ మీనల్ రాథోడ్(దీపికా పదుకొనే) పరిచయం అవుతుంది. మరో పక్క ఒక ఉగ్రవాద సంస్థ భారత్‌‌లో సీఆర్పీఎఫ్‌‌ జవాన్ల మీద భారీ అటాక్ చేస్తుంది. ఆ దాడికి పగ తీర్చుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్‌‌లోని బాలాకోట్‌‌లో ఉన్న ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలని ధ్వంసం చేస్తుంది. ఆ టైంలో అనుకోకుండా ఒక సుఖోయ్ యుద్ధ విమానం పాకిస్తాన్‌‌లో క్రాష్ అవుతుంది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు పారాచూట్స్​ సాయంతో పాక్‌‌ భూభాగంలో దిగాల్సి వస్తుంది. వాళ్లని రక్షించేందుకు ఇండియన్ ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌ ఏం చేసింది? ఈ సంఘటనకు, ప్యాటీకి సంబంధం ఏంటి? చివరికి వాళ్లని రక్షించి భారత్ తీసుకు వచ్చారా? లేదా? అనేది అసలు కథ. యాక్షన్‌‌ సీన్లు బాగున్నాయి. హాలీవుడ్ సినిమాలకు సమానంగా తెరకెక్కించారు. లీడ్‌‌ రోల్స్‌‌లో చేసినవాళ్లంతా బాగా నటించారు. హృతిక్​ విషయానికి వస్తే.. యాక్షన్స్‌‌ సీన్స్​లో అదరగొట్టాడు. యాక్షన్‌‌తో సినిమాలో సెంటిమెంట్‌‌ కూడా బాగుంది.