చత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​ ఐదుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని కాంకేర్​ జిల్లాలో శనివారం భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇద్దరు జవాన్లకూ గాయాలయ్యాయి. ట్రీట్​మెంట్​కోసం వారిని హెలికాప్టర్ లో రాయ్​పూర్​ ఆస్పత్రికి తరలించారు. బస్తర్ ఐజీ సుందర్​ రాజ్ ​పి, కాంకేర్​ ఎస్పీ ఐకే ఎలిసెల ఎన్​కౌంటర్​కు సంబంధించిన వివరాలు తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్​గఢ్​లోని నారాయణ్​పూర్, కాంకేర్​ జిల్లాల బార్డర్​లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్.. దళాలతో సమావేశం నిర్వహిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందింది. 

దీంతో శుక్రవారం నుంచి బస్తర్​ ఫైటర్స్, డీఆర్​జీ బలగాలను కాంకేర్​ ఎస్పీ ఐకే ఎలిసెల నేతృత్వంలో ఉత్తర అబూజ్​మాడ్​ ప్రాంతంలోని టేకుమేట, కోకూర్, మాడ్, అబూజ్​మాడ్​ అడవుల్లోకి పంపారు. గడ్చిరోలి(మహారాష్ట్ర) సీ-60 కమాండోలు కూడా బార్డర్​లో అలర్ట్ అయ్యారు. మరో వైపు నారాయణ్​పూర్​ భద్రతా బలగాలు సైతం కాంకేర్​ బార్డర్​లో అడవుల్లో మాటు వేశాయి. 

ఈ కూంబింగ్​ నిర్వహిస్తున్న కాంకేర్​ పోలీసులు శనివారం ఉదయం 8 గంటల సమయంలో టేకుమేట, -కోకూర్​ అటవీ ప్రాంతంలోకి చేరుకోగానే మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. అలర్ట్ అయిన భద్రతాబలగాలు మావోయిస్టులపై కాల్పులతో ఎదురుదాడి చేశాయి. సుమారు 3 గంటల పాటు ఇరువర్గాల మధ్య ఆగి ఆగి కాల్పులు జరిగాయి. మావోయిస్టులు పారిపోతూ భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు.

 గాయపడిన పలువురు మావోయిస్టులను దళాలు వెంట తీసుకెళ్లాయి. వీరి కోసం సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతోందని బస్తర్ ఐజీ సుందర్​రాజ్​ వెల్లడించారు. కాగా, కాల్పుల్లో కాంకేర్​ బస్తర్​ ఫైటర్స్ కు చెందిన కానిస్టేబుల్​ ఖిలేశ్వర్​ గార్డే, డీఆర్జీ కానిస్టేబుల్​ హిరామాన్​ యాదవ్​కు గాయాలయ్యాయి. ఖిలేశ్వర్​ గార్డే చేతికి, తలకు గాయాలు కాగా, హిరామాన్​ యాదవ్​ రెండు కాళ్లలోకి బుల్లెట్లు దిగాయి. వీరిద్దరినీ హెలికాప్టర్ లో​రాయ్​పూర్​ ఆస్పత్రికి తరలించారు. ఎస్​ఎల్​ఆర్, ఇన్సాస్​ వంటి ఆయుధాలు సహా పలు పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 

బార్డర్​లో అలర్ట్

కాంకేర్​ జిల్లాకు బార్డర్​లో ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ, నారాయణ్​పూర్​ (చత్తీస్​గఢ్)​లలో  కేంద్రహోం శాఖ రెడ్​ అలర్ట్ ప్రకటించింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్​ ఈ ఎన్​కౌంటర్​ నుంచి తప్పించుకున్నట్టుగా భావిస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు.. అతడు గాయాలతో ఈ ఏరియాలోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం ఇచ్చారు. అబూజ్​మాడ్​లోని కొండపల్లి ఏరియాలో కొత్తగా బేస్​ క్యాంపును ఏర్పాటు చేస్తున్న క్రమంలో మావోయిస్టులు ఎదురుదాడికి వ్యూహరచన చేసేందుకు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్​ చేపట్టారు.