జర్మనీలో కారు బీభత్సం..ఐదుగురు మృతి

జర్మనీలో ఘోర ప్రమాదం జరిగింది. మాగ్డేబర్గ్​లోని క్రిస్మస్​ మార్కెట్​లో  ఓ బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. ఏడుగురు భారత సంతతి పౌరులు సహా 200 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు దాదాపు 400 మీటర్లు దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. 

నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తి సౌదీ అరేబియాకు చెందిన తలేబ్‌‌‌‌ (50)గా గుర్తించారు. అతడు 20 ఏండ్లుగా జర్మనీలో ఉంటున్నాడు. బెర్న్​బర్గ్​లో మెడిసిన్​ప్రాక్టీస్​ చేస్తున్నాడు. బీఎండబ్ల్యూ కారును అద్దెకు తీసుకొని నడిపినట్టు గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్ట్​ చేశారు. కాగా, తలేబ్​ ఇస్లాంకు వ్యతిరేకంగా నిత్యం ఎక్స్​ (ట్విట్టర్​) ద్వారా ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు తేల్చారు. అలాగే, అతడు ఇటీవల తీవ్రవాద, వలస వ్యతిరేక ఆల్టర్నేటివ్​ఫర్​ జర్మనీ (ఏఎఫ్​డీ) పార్టీకి మద్దతు పలికినట్టు గుర్తించారు. క్రిస్మస్ మార్కెట్​లోకి కావాలనే కారుతో దూసుకొచ్చాడా? లేక ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా?  అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.