- లంచాలతో నెట్టుకొస్తున్న మేనేజ్మెంట్లు
- బడుల రీఓపెన్‌కు ముందే పూర్తి కావాల్సిన తంతు
- ఇంకా 50 శాతం ముగియలే
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్‌స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెక్ ప్రహసనంగా మారిపోయింది.ప్రతి ఏడాది బడులు రీఓపెన్కావడానికి ముందే ఫిట్నెస్ తనిఖీలు పూర్తి కావాల్సి ఉండగా, ఇంకా 50 శాతం కూడా పూర్తికాలేదు. ఎప్పటిలాగే లంచాలతో నెట్టుకురావాలని ఆలోచిస్తూ ప్రైవేట్స్కూల్స్ మేనేజ్మెంట్లు స్టూడెంట్ల సెక్యూరిటీని గాలికి వదిలేస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్న ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్లు తరువాత మామూళ్లతో సర్దుకుపోతున్నారు. గవర్నమెంట్రూల్స్ఖాతరు చేయకుండా నడుస్తున్న బస్సులపై చర్యలు తీసుకోవడం లేదు.
మొత్తం 1,455 ప్రైవేటు బస్సులు
నిజామాబాద్ జిల్లాలో 520 ప్రైవేట్ స్కూల్స్ఉండగా, సుమారు 1,200 బస్సులు నడుస్తున్నాయి. స్టూడెంట్ల సంఖ్య 2.60 లక్షల వరకు ఉంది. కామారెడ్డి జిల్లాలోని 175 ప్రైవేట్ బడుల్లో 90 వేల స్టూడెంట్ల కోసం 255 బస్సులను వినియోగిస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో మొత్తం1,455 ప్రైవేట్స్కూల్బస్సులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఒక విద్యార్థి నుంచి బస్సు చార్జీల కింద ఏడాదికి రూ.12 వేల నుంచి రూ.17 వేల వరకు మేనేజ్మెంట్లు వసూలు చేస్తున్నాయి. బస్సుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్న స్కూళ్ల యజమాన్యాలు రూల్స్ పాటించడం లేదు.
ఇవీ రూల్స్..
స్టూడెంట్లను భద్రతగా స్కూళ్లకు తీసుకొచ్చి తిరిగి సేఫ్‌గా ఇండ్లకు చేర్చేలా సర్కారు విధివిధానాలు ఉన్నాయి. ప్రైవేట్లారీలు, కార్లు, ట్యాక్సీలు ఇతర అన్ని వెహికల్స్‌కు ఆర్సీ గడువు దాటాకే ఫిట్నెస్పరీక్ష చేసి ఇంకొన్నాళ్లకు రిన్యూవల్లేదా స్క్రాప్‌గా మార్చాడమో చేస్తారు. కానీ, స్కూల్‌బస్సుల విషయానికి వస్తే ప్రతి ఏడాది తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించాలి. 15 ఏండ్లు దాటిన బస్సును స్టూడెంట్ల కోసం అసలు ఉపయోగించకూడదు. 60 ఏండ్లు దాటిన డ్రైవర్‌ను అపాయింట్చేయొద్దు. క్లీనర్, అటెండర్తప్పక ఉండాలి.
డ్రైవర్ కంటి చూపు, గుండె జబ్బు, షుగర్ లెవల్ రెగ్యులర్‌గా స్కూల్ మేనేజ్మెంట్లు చెక్ చేసి రిపోర్టులు దగ్గర పెట్టుకోవాలి. స్కూల్స్స్టార్ట్ కావడానికి ముందు బస్సుకు పసుపు పేయింటింగ్చేయించి.. ముందు భాగంలో తెలుపు వెనుక భాగంలో రెడ్ రేడియం స్టిక్కర్లు వేయించాలి. స్కూల్పేరు, ఫోన్ నంబర్, స్టూడెంట్లను సూచించేలా బొమ్మలు అతికించాలి. ఫస్ట్ఎయిబ్బ్యాక్స్, ఫైర్యాక్సిడెంట్నివారించే ఎగ్జాస్టర్ను తప్పక బస్సులో పెట్టాలి. బస్సులోని స్టూడెంట్లంతా డ్రైవర్‌కు కనబడేలా ప్రత్యేక విజన్మిర్రర్, కిటికీల నుంచి తలలు బయటకు రాకుండా రాడ్లు బిగించాలి. వాహనం టైర్ల నాణ్యతను రెగ్యులర్‌గా గమనించాలి. గంటకు 40 కిలోమీటర్ల స్పీడ్‌తో మాత్రమే వీటిని నడుపాలి. సీట్ల సంఖ్యకు సమానంగా స్టూడెండ్లను అనుమతించాలి.
తప్పించుకునే దారులపై దృష్టి
ఇన్ని రూల్స్ ఉన్నా మేనేజ్మెంట్లు అడ్డదార్లు వెతుక్కుంటున్నాయి. ఆర్టీఓ అధికారులకు లంచాలు ఇచ్చి క్లీన్‌చీట్ పొందుతున్నాయి. వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఫిట్నెస్ జారీ చేయడాన్ని, తనిఖీలను ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్లు మరిచారు. ఏదైనా జరగరాని ఘటన జరిగితేగానీ స్పందించడంలేదు.
గతేడాది 200 దాటలేదు
జూన్12న కొత్త విద్యా సంవత్సరం షురూ కానుంది. దానికి ముందే బస్సుల ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో కేవలం 699 బస్సుల తనిఖీ మాత్రమే జరిగింది. పది బస్సులున్న స్కూల్మేనేజ్మెంట్లు ఐదింటికి అంటే సగం వరకే ఫిట్నెస్ చేయిస్తున్నారు. మిగితా వాటిని లంచాలతో నెట్టుకొస్తుండగా, కొన్ని యాజమాన్యాలు అటువైపే వెళ్లడం లేదు. గతేడాది బస్సుల ఫిట్‌నెన్ చెక్ 200 సంఖ్య దాటలేదు.