కాళ్లకు వల చిక్కుకుని జాలరి మృతి

కల్లూరు, వెలుగు: ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో జాలరి కాళ్లకు చేపల వల చిక్కుకుని చెరువులో మునిగి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామానికి చెందిన అక్కుల వెంకటేశ్వర్లు(35) గ్రామంలోని మహాలింగం కుంట చేపల చెరువుకు కాపలాకు వెళ్తున్నానని శనివారం రాత్రి భార్య లక్ష్మికి చెప్పి వెళ్లాడు. 

ఆదివారం ఉదయం చెరువుకు వెళ్లిన మెరుగు గోపి చెరువులో తెప్ప పడవ ఉండడంతో అనుమానంతో వలను లాగి చూశాడు. వల కాళ్లకు చిక్కుకుని వెంకటేశ్వర్లు చనిపోయినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.