చేప పిల్లల పంపిణీలో.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

  • చెరువుల్లో చిన్న సైజ్ చేప పిల్లలను వదులుతున్న వైనం
  • చేప పిల్లల్లో నాణ్యత లేదని ఆందోళన చేస్తున్న 
  • మత్స్య సహకార సొసైటీలు 
  • చెరువుల్లో పోస్తున్న చేప పిల్లల్లో భారీ వ్యత్యాసం 
  • నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

నల్గొండ, వెలుగు : చేప పిల్లల పంపిణీలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చేప పిల్లల సంఖ్యలో దొంగ లెక్కలు చూపించి కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల మత్స్యశాఖ అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని కాంట్రాక్టర్లు అడ్డగోలు దందాకు పాల్పడుతున్నారు. ఇటీవల రెండు జిల్లాల్లో నాణ్యతా లేకుండా తక్కువ సైజ్ ఉన్న చేప పిల్లలను పంపిణీ చేస్తుండడంతో మత్స్య సహకార సంఘాల సొసైటీ సభ్యులు వద్దంటూ వెనక్కి పంపారు.   

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో.. 

నల్గొండ జిల్లాలో 1000 కి పైగా చెరువులు ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో 964 చెరువుల్లో 35– 40 ఏంఏం సైజ్ లో మొత్తం 93. 52 లక్షలు చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 9 రిజర్వాయర్లు, ఏడాది పొడవునా నీళ్లుండే 190 చెరువుల్లో 80 – 100 ఎంఎం సైజులో 2.40 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం 35 – 40 ఎంఎం సైజ్ చేప పిల్లలకు 56 పైసలు, 80 – 100 ఎంఎం సైజ్ చేప పిల్లలకు రూ.1.46 ధరగా నిర్ణయించింది. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 80– 100 ఎంఎం చేప పిల్లలు పంపిణీ చేశారు.

 ఇప్పటివరకు సుమారు 21 లక్షలకు పైగా పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో వదిలారు. సూర్యాపేట జిల్లాలో 2024 –25లో 1.70 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వీటిలో 35 – 40 ఎంఎం చేప పిల్లలు 48.84 లక్షలు, 80 – 100 ఎంఎం చేప పిల్లలు 121.75 లక్షలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 850 చెరువులతోపాటు పులిచింతల రిజర్వాయర్ ఉంది. ఇప్పటివరకు 50 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. 

లెక్కల్లో వ్యత్యాసాలు..

చేప పిల్లలను చెరువుల్లో వదిలేటప్పుడు లెక్కించే విధానం తప్పుల తడకగా ఉందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లో ఇటీవల పంపిణీ చేసిన చేప పిల్లల్లో కనీసం 50 శాతం కూడా వదలకుండానే 100 శాతం పంపిణీ చేసినట్లు కాంట్రాక్టర్లు లెక్కలు చూపిస్తున్నారు.

 నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో సుమారు 13.72 లక్షల చేప పిల్లలను వదిలేయాల్సి ఉండగా, 50 నుంచి 60 శాతం పిల్లలను వదిలినట్లు సొసైటీ సభ్యులు చెబుతున్నారు. రిజర్వాయర్లలో పోసిన చేప పిల్లలు కూడా నాణ్యతగా లేవని విమర్శలు వస్తున్నాయి. 

అయితే జిల్లా మత్స్యశాఖ అధికారుల అలసత్వం వల్ల చేప పిల్లల పంపిణీ ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా.. కేవలం 45 చెరువుల్లో 18 లక్షల చేప పిల్లలను మాత్రమే వదిలినట్లు లెక్కలున్నాయి. వాస్తవానికి ఇది 12 నుంచి 15 లక్షలకు మించలేదని మత్స్య సహకార సంఘాలు చెబుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో సైతం అధికారులు చెప్పిన లెక్కలకు పోసిన లెక్కకు భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. చేప పిల్లల పంపిణీలో జరుగుతున్న అవినీతిపై కొంతమంది విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

కాంట్రాక్టర్లు ఆడిందే ఆట..

మత్స్యశాఖలో తగినంత ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడంతో కాంట్రాక్టర్లు చేప పిల్లల సంఖ్యలో గోల్‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. చేప పిల్లల పంపిణీలో అక్రమాలు బయటపడతాయని జిల్లాలో సగానికిపైగా ప్రజాప్రతినిధులకు తెలియకుండా కాంట్రాక్టర్లు చెరువుల్లో చేప పిల్లలను వదులుతున్నారు. అధికారులతో కాంట్రాక్టర్లు కుమ్మక్కై తమకు తోచిన విధంగా దొంగ లెక్కలు రాసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 అయితే చెరువుల్లో చేప పిల్లల పెంపకంపై మత్స్య సొసైటీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలోని పెద్ద చెరువులో పోయడానికి తీసుకొచ్చిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్య సహకార సంఘం సొసైటీ సభ్యులు ఇటీవల చేప పిల్లల పంపిణీని అడ్డుకున్నారు. 

చేప పిల్లలు పంపిణీ చేయకముందే అవి సగం చనిపోయాయని, మిగిలినవి కూడా నాసిరకంగా ఉన్నాయని సొసైటీ సభ్యులు మత్స్యశాఖ అధికారులతో గొడవకు దిగారు. మరోవైపు గరిడేపల్లి, సూర్యాపేట, నేరేడుచర్ల, మట్టంపల్లి మండలాల్లో ఇటీవల ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియకుండా చేప పిల్లలను వదిలి పెట్టడంతో మత్స్య సహకార సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. 

క్వాలిటీ చేప పిల్లలను పంపిణీ చేస్తాం.. 

తక్కువ క్వాలిటీతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. చేప పిల్లల క్వాలిటీ తక్కువగా ఉన్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. చేప పిల్లల పంపిణీలో నిఘా పెట్టి పర్యవేక్షిస్తా౦. క్వాలిటీ చేప పిల్లలను పంపిణీ చేస్తాం.నాగు నాయక్, డీఎఫ్​వో, సూర్యాపేట జిల్లా