ఫస్ట్ టైం ఫుల్ బడ్జెట్ పెట్టినం: శ్రీధర్ బాబు

  •     38 పద్దులకు ఆమోదం
  •     ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్  ప్రకటించాం
  •     భవిష్యత్తులో జీవో 46 ఉండదని స్పష్టం

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. 38 బడ్జెట్  పద్దులను అసెంబ్లీ ఆమోదించిందని, రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఏకంగా17 గంటలకుపైగా అసెంబ్లీలో జరిగిన చర్చలో 24 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారని పేర్కొన్నారు. 

మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు పద్దులపై మాట్లాడడానికి స్పీకర్ అవకాశం ఇచ్చారని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ కు అనుకూలంగా వచ్చిన తీర్పుపై అసెంబ్లీలో ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం జాబ్  క్యాలెండర్  విడుదల చేశామని, దీంతో మరో హామీని నెరవేర్చామన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును అడ్డుకోవడానికి అసెంబ్లీలో బీఆర్ఎస్  రాజకీయం చేసిందని, జాబ్  క్యాలెండర్ పైనా బీఆర్ఎస్  రాజకీయం చేసిందని ఆయన విమర్శించారు. 

అసెంబ్లీలో సమస్యలు సృష్టించాలని కొందరు బీఆర్ఎస్  యువ ఎమ్మెల్యేలు ప్రయత్నించారని, వారు ఎంత గొడవ చేసినా.. తాము సస్పెండ్  చేయలేదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆలోచన మారాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్..  అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ‘‘కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో కేసీఆర్  తన వాణి వినిపిస్తారని అనుకున్నాం. 

కానీ, ఆయన రాలేదు. కనీసంఎస్సీ వర్గీకరణపై అయినా కేసీఆర్  మాట్లాడుతారనుకున్నాం. కానీ రాలేదు. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వడంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్  పూర్తిగా విఫలమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా చర్చల్లో పాల్గొన్నారు. వారందరికీ అభినందనలు. ఉద్యోగాల భర్తీ విషయంలో గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇందులో న్యాయపరమైన చిక్కులను గత ప్రభుత్వం పరిష్కరించలేదు. 

తమ ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఉద్యోగాలను భర్తీ చేసింది. జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత కల్పించాం. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. మేము అధికారంలో ఉన్నన్ని రోజులు జాబ్ క్యాలెండర్  అమలు చేస్తాం. జీవో 46కు పరిష్కారంపై మంత్రివర్గ సబ్ కమిటీ కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో జీవో 46 అసలు ఉండదు” అని మంత్రి పేర్కొన్నారు.